ఓపీఎస్‌ ముగిసిన అధ్యాయం

‘సీమెన్స్‌ శిక్షణ కేంద్రాలు లేవు.. ఎక్కడున్నాయో చూద్దాం పదండి.. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ డిజైన్‌(సీఐటీడీ) ఇంత మంది అభ్యర్థులకు ఇంత ఖర్చు అవుతుందనే నివేదికలు ఇచ్చారే తప్ప.. ఇంత సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారు, ఇంత పరికరాలు ఇచ్చారు అని నివేదిక ఇవ్వలేదు’’ అంటూ సీమెన్స్‌ ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated : 24 Sep 2023 07:38 IST

సీమెన్స్‌ కేంద్రాలు లేవు.. ఉంటే చూద్దాం పదండి
చంద్రబాబు అరెస్టు తీరు బాగోలేదంటే.. ఆయన్ని కొట్టారా? తిట్టారా?
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘‘సీమెన్స్‌ శిక్షణ కేంద్రాలు లేవు.. ఎక్కడున్నాయో చూద్దాం పదండి.. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ డిజైన్‌(సీఐటీడీ) ఇంత మంది అభ్యర్థులకు ఇంత ఖర్చు అవుతుందనే నివేదికలు ఇచ్చారే తప్ప.. ఇంత సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారు, ఇంత పరికరాలు ఇచ్చారు అని నివేదిక ఇవ్వలేదు’’ అంటూ సీమెన్స్‌ ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒక్కో సీమెన్స్‌ క్లస్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ రూ.247 కోట్లు, హార్డ్‌వేర్‌ రూ.48 కోట్లు, డిజిటల్‌ కోర్సులు రూ.249 కోట్లు, సేవలు రూ.13 కోట్లుగా సీఐటీడీ మదింపు చేసి, నివేదిక ఇచ్చినా.. శిక్షణకు పిల్లలు వస్తే అంత ఖర్చవుతుందని మాత్రమే ఆ సంస్థ మదింపు చేసిందంటూ తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇలాంటి అంచనాలు వేసి, నివేదికలు ఇస్తాయా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.58 కోట్లకే సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇచ్చిందని, తాను అధికారికంగా చెబుతున్నానంటూ ఎంతో ఖరీదైన సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌కు ఆయనే విలువ నిర్ణయించేశారు. నాలుగేళ్లలో 2లక్షల మంది అభ్యర్థులకు హోటల్‌లో పని చేసుకోవడానికి, సప్లయర్‌గా చేయడానికి శిక్షణ ఇచ్చారంటూ హేళన చేశారు. రంపం పెట్టి కోయించి, కార్పెంటర్లను ఎంతమందిని తయారు చేశారో వివరాలు ఇస్తానంటూ సీమెన్స్‌ యంత్రాల ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల చంద్రబాబు ఈ రోజు జైల్లో ఉండడం ఏంటి? ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేయి పట్టుకొని లాక్కెళ్లారా?

చంద్రబాబు అరెస్టు తీరు బాగోలేదంటే ఆయన్ని కొట్టారా? తిట్టారా? లేక చేయి పట్టుకుని లాక్కెళ్లారా? అంటూ మంత్రి బొత్స ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పగలైతే శాంతిభద్రతల సమస్య వస్తుందని రాత్రి అరెస్టు చేస్తామని పోలీసులు అంటే ఆయనే తెల్లారే వరకు సాగదీశారంటూ విమర్శించారు. సీమెన్స్‌ ప్రాజెక్టు అవకతవకల్లో భాగస్వాములైన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీవీ రమేష్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, అందులోని పేరాలను చదివి ఆయన్నే చెప్పమనండి? అని ప్రశ్నించారు.

పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, తప్పు చేసినా చూసీ చూడనట్లు వదిలేయాలనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పులు చేస్తే వదిలేయొచ్చో లేదో వాళ్ల సీఎం కేసీఆర్‌ను పోచారం అడగాలని, 10వేల ఓట్ల రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను తాకట్టు పెట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు.


ఓపీఎస్‌ ముగిసిన అధ్యాయం

ఈనాడు, అమరావతి: ఓపీఎస్‌ విధానం ముగిసిన అధ్యాయం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జీపీఎస్‌పై ఉద్యోగులు ఆందోళనలు చేయరని మేము చెప్పామా? అందరికీ ఆమోద యోగ్యమని చెప్పామా? ఓపీఎస్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. అందుకే జీపీఎస్‌ తెచ్చాం. పింఛన్‌కు గ్యారెంటీ, కుటుంబ పింఛన్‌కు గ్యారెంటీ అడిగారు ఇచ్చాం. మా ప్రభుత్వ విధానం జీపీఎస్‌. ఓపీఎస్‌ అమలుకు ఎందుకు అంగీకరించడం లేదో భాజపా వాళ్లను అడగాలి. ప్రభుత్వం ఇంతకు మించి ఏమీ చేయలేదు. దీనిపై చర్చ వద్దు. మార్పులు, చేర్పులు అడిగితే పరిశీలిస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ కొత్త ఎస్సైలా పురందేశ్వరి: విజయనగరంలో 1975 ప్రాంతంలో కొత్తగా వచ్చిన ట్రాఫిక్‌ ఎస్సైలా భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. తన ఉనికిని కాపాడుకోవడానికి మద్యం అమ్మకాలపై విమర్శలు చేస్తున్నారని, ఆమె సీబీఐ విచారణ కోరితే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని