దసపల్లా భూములపై వైవీ X విజయసాయి పోరు

నిషేధిత జాబితా(22ఏ) నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైకాపాలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ నగరం మధ్యనున్న విలువైన ఈ భూముల వ్యవహారంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది.

Updated : 24 Sep 2023 06:47 IST

తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన అంతర్యుద్ధం?

ఈనాడు, విశాఖపట్నం: నిషేధిత జాబితా(22ఏ) నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైకాపాలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ నగరం మధ్యనున్న విలువైన ఈ భూముల వ్యవహారంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఆ భూములు రాణి కమలాదేవికి చెందినవని, ఆమె వారసుల నుంచి కొనుగోలు చేశామంటూ ఇప్పటికే దక్కించుకున్న ఓ వర్గానికి విజయసాయి సహకరిస్తుంటే... తాజాగా ఆ భూముల్లో రాణి సాహిబా ఆఫ్‌ వాద్వాన్‌ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. వీరికి వైవీ మద్దతుగా నిలిచారు. దీంతో ఈ పంచాయితీ కాస్త ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. ఎన్నో వివాదాల మధ్య దసపల్లా భూముల్లో 15 ఎకరాలను ఇటీవల ఓ వర్గం దక్కించుకుంది. వాటి విలువ దాదాపు రూ.2వేల కోట్లుంటుంది. ఇందులో కొంత భూమిపై రాణి కమలాదేవి వారసుల తరఫు నుంచి తనకూ హక్కు ఉందంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ఈ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో భూమి కోసం యత్నిస్తున్నారంటూ రాణి కమలాదేవి పేరుతో ఈ ఏడాది కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు రాణి కమలాదేవి చేయలేదని, ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతిస్తున్న వర్గంలోని కీలక వ్యక్తే సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఫోర్జరీ సంతకం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని, దసపల్లా భూముల్లోని తన స్థలాన్ని అప్పగించాలని వైవీ వర్గానికి చెందిన వ్యక్తి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే.. ఇన్‌ఛార్జి  గిరి నాకొద్దు..!

ఫోర్జరీ విషయంలో విజయసాయిరెడ్డి అనుచరుడిని అరెస్టు చేయాలని వైవీ అప్పటి సీపీ త్రివిక్రమవర్మపై ఒత్తిడి తెచ్చారు. అరెస్టు చేయకుండా ఎంపీ చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే వ్యవహారమంతా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. ఈ పంచాయతీకి ముందే పెదజాలారిపేట భూముల టీడీఆర్‌ విషయంలో వైవీ కలుగజేసుకోగా.. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్‌ హెచ్చరించింది. ఈ సమయంలోనే దసపల్లా గొడవ అక్కడికి చేరడంతో.. ఈ సారి వైవీ ఘాటుగానే సమాధానం చెప్పారని సమాచారం. ‘ఫోర్జరీ సంతకం అని అధికారులు తేల్చారు కాబట్టే అరెస్టుకు ఆదేశించా. ఇందులోనూ తగ్గి ఉండాలంటే ఇన్‌ఛార్జి పదవే నాకు అవసరం లేదు’ అని చెప్పి పంచాయితీ నుంచి వైవీ లేచి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంతోనే సీపీపై బదిలీ వేటు పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అధికారుల అత్యుత్సాహం

దసపల్లా భూములను 22(ఏ) జాబితా నుంచి తొలగించి సబ్‌ డివిజన్‌ చేసిన అధికారులు... రాణి సాహిబా వాద్వాన్‌ వారసులు ఎవరు అనేది ఆ సమయంలో డిక్లేర్‌ చేయలేదు. సర్వే పూర్తి చేశాక బతికి ఉన్న వారసుల పేర్లు రికార్డుల్లో ఎక్కించాల్సి ఉండగా, అలా చేయకుండానే క్లియరెన్స్‌ ఇచ్చేశారు. దీంతో 1921 నుంచి తాజాగా అప్‌డేట్‌ చేసిన రెవెన్యూ రికార్డుల్లో దసపల్లా హిల్‌ సర్వే నంబరు 1197, 1196, 1028లలో భూములు రాణి సాహిబా వాద్వాన్‌ పేరుతో కనిపిస్తున్నాయి. ఇటీవల పెదజాలారిపేట భూముల్లో సైతం రాణి సాహిబా వాద్వాన్‌ వారసుల పేరుతో అర్జీ పెట్టారన్న కారణంగా అధికారులు ఆగమేఘాలపై సర్వే చేశారు. అసలు రాణి వారసులెవరనేది తేలకుండా టీడీఆర్‌లు ఇచ్చేందుకు పావులు కదిలాయి. పెదజాలారిపేట భూములకు టీడీఆర్‌లు దక్కించుకుంటే, ఆ తర్వాత అదే రాణి పేరుతో ఉన్న దసపల్లా భూములకు సైతం టీడీఆర్‌లు దక్కించుకునే ఎత్తుగడలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని