Chandrababu: ఇప్పుడు ప్రశ్నలు వెతుక్కుంటున్నారు

‘‘నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో రెండేళ్ల కిందటే కేసు నమోదుచేశారు. నేను తప్పుచేసినట్టు ఇప్పటికీ మీ దగ్గర ఆధారాలు లేవు. అయినా నన్ను అరెస్టు చేశారు.

Updated : 25 Sep 2023 07:12 IST

ఫైళ్లు చూసుకుంటున్నారు
నన్ను తప్పుపట్టడానికి మీ వద్ద ఏ ఆధారమూ లేదు
నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారు
విచారణలో సీఐడీ అధికారులతో చంద్రబాబు
ప్రశ్నలన్నింటికీ సూటిగా సమాధానాలు
ముగిసిన రెండు రోజుల సీఐడీ కస్టడీ
ఈనాడు - అమరావతి
రాజమహేంద్రవరం

‘‘నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో రెండేళ్ల కిందటే కేసు నమోదుచేశారు. నేను తప్పుచేసినట్టు ఇప్పటికీ మీ దగ్గర ఆధారాలు లేవు. అయినా నన్ను అరెస్టు చేశారు. 15 రోజులవుతున్నా నన్ను తప్పు పట్టడానికి మీకు చిన్న ఆస్కారం కూడా లేకుండా పోయింది. నేను ఎలాంటి తప్పూ చేయలేదనడానికి ఇదే తిరుగులేని రుజువు. 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నన్ను నిరాధార కేసులో అరెస్టు చేసి బాధపెట్టారు. ఇది నాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది’’ అని తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ అధికారులతో అన్నారు. ఆయనను కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు రెండో రోజైన ఆదివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని కాన్ఫరెన్స్‌ హాలులో విచారించారు. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల ప్రతి ప్రశ్నకూ చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పడంతో... ఇంకా ఏ ప్రశ్నలు అడగాలనేదానిపై వారు మళ్లీ ఫైళ్లు చూసుకున్నారు. సీఐడీ అధికారుల తీరుపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘నన్ను ఎక్కడ తప్పుపట్టాలో మీకు తెలియని పరిస్థితి ఉందనేందుకు ఇదే నిదర్శనం’ అని వారితో అన్నారు. అనంతరం వారడిగిన ప్రశ్నలకు ధీమాగా సమాధానమిచ్చారు. మొత్తంగా చంద్రబాబు రెండురోజుల సీఐడీ కస్టడీ ఆదివారంతో ముగిసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండోరోజు విచారణలో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అడిగినవాటిలో కొన్ని ప్రశ్నలు, వాటికి ఆయన చెప్పిన సమాధానాల వివరాలిలా ఉన్నాయి.

సీఐడీ: నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్‌ సంస్థల మధ్య ఒప్పందం చేసుకునే క్రమంలో ప్రొసీజర్‌ తప్పులు గురించి అధికారులు మీకు చెప్పలేదా?

చంద్రబాబు: అధికారుల సమగ్ర పరిశీలన, ఆమోదం తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సీమెన్స్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయంలో పూర్తిగా నిబంధనల ప్రకారమే వ్యవహరించాం. ఎక్కడా వాటి అతిక్రమణకు తావే లేదు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన గురించి మీకు అధికారులు చెప్పారా?

నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగలేదు. అంతా సక్రమంగా జరిగింది. అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు. సీమెన్స్‌ సంస్థ ఏపీలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు చేసుకుంది. కేంద్రప్రభుత్వం కూడా సీమెన్స్‌తో కలిసి పనిచేసింది. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశాం.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన కమిటీ అన్నీ సరిగ్గా చూసిందా.. లేదా అనేది మీరు పరిశీలించలేదా?

కిందిస్థాయిలో కమిటీల పనితీరు, విధి నిర్వహణల విషయాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చూడరు. ఆ శాఖలోని ఉన్నతాధికారులు, కార్యదర్శులు, కార్పొరేషన్‌ అధికారులు ఆ బాధ్యతలు చూస్తారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి అపర్ణను మీరు తీసుకొచ్చారట కదా?

మీ వాదన సరికాదు. ఆమె సీఎస్‌కు డిప్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. నిబంధనల ప్రకారం సీఎస్‌ ఆమోదించారు. కేంద్రం కూడా ఆమోదించింది.
ఫైళ్లు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి.

అపర్ణ భర్త డిజైన్‌టెక్‌లో ఉద్యోగిగా ఉన్న విషయం మీకు తెలుసా?

ఆ విషయం నాకు తెలీదు. ఒకవేళ ఆమె భర్త డిజైన్‌టెక్‌లో పనిచేస్తుంటే ఆ విషయాన్ని అపర్ణే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

తెదేపాకు విరాళాలు ఎలా వస్తాయి?

అక్రమ సొమ్మును తెదేపా ఎప్పుడూ విరాళంగా స్వీకరించదు. మాకు వచ్చే పార్టీఫండ్‌ అంతా అత్యంత పారదర్శకంగా ఉంటుంది.


ఉదయం 8.39కే జైలు వద్దకు సీఐడీ బృందం

చంద్రబాబును విచారించేందుకు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆదివారం ఉదయం 8.39 గంటలకే జైలు ప్రాంగణానికి చేరుకుంది. తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది లోపలికి వెళ్లారు. సాయంత్రం 5.47 సమయంలో సీఐడీ అధికారులు విచారణను ముగించుకుని బయటకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని