ఆంక్షలు దాటి.. ఆకాంక్ష చాటి

తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అడుగుపెట్టే చోట సరిహద్దుల్లో వందల కొద్దీ పోలీసు బలగాలు.. పుట్టి పెరిగిన జన్మభూమికి వస్తున్న వారికి అడుగడుగునా ఆంక్షలు.. ఎందుకు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నల పరంపర.. ఫోన్లనూ వదలకుండా వాట్సప్‌ చాటింగ్‌లను పరిశీలించడం.. ఇవీ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు ఏపీ సరిహద్దులో పోలీసులనుంచి ఎదురైన అడ్డంకులు.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ, రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘కారులో సంఘీభావ యాత్ర’కు ఏపీ పోలీసులు పలుచోట్ల ఆటంకాలు సృష్టించారు.

Updated : 25 Sep 2023 07:02 IST

ఎట్టకేలకు రాజమహేంద్రవరం చేరిన హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగులు
మీ కుటుంబం వెంటే ఉంటామని నారా బ్రాహ్మణికి భరోసా
చంద్రబాబు దయవల్లే.. మేము ఈ స్థాయిలో ఉన్నాం  
మా రాష్ట్రానికి మమ్మల్నే రానీయడం లేదు.. ఇదెక్కడి న్యాయం?
అడుగడుగునా పోలీసుల అడ్డంకులపై నిరసన

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమరావతి, న్యూస్‌టుడే బృందం: తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అడుగుపెట్టే చోట సరిహద్దుల్లో వందల కొద్దీ పోలీసు బలగాలు.. పుట్టి పెరిగిన జన్మభూమికి వస్తున్న వారికి అడుగడుగునా ఆంక్షలు.. ఎందుకు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నల పరంపర.. ఫోన్లనూ వదలకుండా వాట్సప్‌ చాటింగ్‌లను పరిశీలించడం.. ఇవీ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు ఏపీ సరిహద్దులో పోలీసులనుంచి ఎదురైన అడ్డంకులు.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ, రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘కారులో సంఘీభావ యాత్ర’కు ఏపీ పోలీసులు పలుచోట్ల ఆటంకాలు సృష్టించారు. వాటన్నింటినీ అధిగమించి రాజమహేంద్రవరం చేరుకున్న ఐటీ ఉద్యోగులు బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు వల్లే తాము ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందామని.. మీ వెంటే నిలుస్తామని భరోసానిచ్చారు.

హైదరాబాద్‌ నుంచి ఏపీ సరిహద్దులోకి చేరగానే ఐటీ ఉద్యోగులకు పోలీసుల అడ్డంకులు మొదలయ్యాయి. వారు తలపెట్టిన కారు ర్యాలీని అడ్డుకునేందుకు ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పోలీసులు అత్యుత్సాహం చూపారు. దీంతో ఐటీ ఉద్యోగులతోపాటు సామాన్యులు అష్టకష్టాల పాలయ్యారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో తనిఖీల పేరుతో నియంత్రించడం విమర్శలపాలైంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కార్ల ర్యాలీకి అనుమతి లేదని, అందులో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద పోలీసులు శనివారం రాత్రి నుంచే చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. వందల సంఖ్యలో బలగాలను మోహరించారు. కరోనా సమయంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పెట్టిన ఆంక్షలను ఇది తలపించింది.

తనిఖీల పేరుతో సతాయింపు

ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి కార్లలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరనున్నారనే సమాచారంతో ఏపీ పోలీసులు తెలంగాణ ప్రాంతం నుంచే మకాం వేశారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి వెంట హైదరాబాద్‌ పరిసరాల్లో, అవుటర్‌ రింగు రోడ్డు, యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఏపీకి చెందిన వివిధ విభాగాల పోలీసులు కాపు కాశారు. ఐటీ ఉద్యోగులని తేలితే ఏపీ-తెలంగాణ సరిహద్దులో పికెట్‌ నిర్వహిస్తున్న తమ పోలీసులను అప్రమత్తం చేశారు. పంతంగి టోల్‌ప్లాజా నుంచి తెల్లవారుజామున ఎన్ని కార్లు వెళ్లాయని టోల్‌ప్లాజా సిబ్బందిని ఏపీ పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని వారు స్పష్టం చేయడంతోపాటు ఆంక్షలు విధించడంతో ఐటీ ఉద్యోగులు విడివిడిగా వెళ్లారు.

అడుగడుగునా గస్తీ

ఏపీలోకి ప్రవేశించగానే కార్లలో యువత కనిపిస్తే పూర్తి వివరాలు తెలుసుకుని వదిలారు. కొందరి ఫోన్లను పరిశీలించారు. ఐటీ ఉద్యోగులు విడతలవారీగా వస్తున్నారన్న అనుమానంతో పలు వాహనాలను పక్కన పెట్టించారు. అందులో ఉన్న మహిళలను ప్రశ్నించేందుకు మహిళా పోలీసులను పురమాయించారు. ఆదివారం కావడంతో సాధారణంగా వ్యక్తిగత పనులపై వెళ్లేవారికీ అవస్థలు తప్పలేదు. తమ ప్రయాణ అవసరాలను నిరూపించుకునేందుకు వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం చెక్‌పోస్టు సెంటర్‌ వద్ద, నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద, దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌ వద్ద, కొవ్వూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. కార్లలో వెళుతున్న వారి  వాహన, ఫోన్‌నంబర్లు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఎందుకు వెళుతున్నారో కారణం తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు కుటుంబం బస చేస్తున్న ప్రాంతంతోపాటు నగరం, గ్రామీణ పరిధిల్లో 34 పికెట్లు ఏర్పాటు చేశారు. జైలు నుంచి శిబిరానికి వచ్చే దారిలో మూడుచోట్ల పికెట్లు పెట్టారు. రాజమహేంద్రవరం వెళుతున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెదేపా నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, బుచ్చిరాంప్రసాద్‌, శ్రీరాంప్రసాద్‌ను నల్లజర్ల టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డగించారు. ఆనందబాబు వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. వారు భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. కార్ల ర్యాలీని అడ్డుకోవడం రాక్షసత్వమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటనలో మండిపడ్డారు.

ర్యాలీకి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తన పిల్లలతో కలిసి మద్దతు తెలిపారు. ‘ఐ యామ్‌ విత్‌ సీబీఎన్‌’; ‘ఈ పోరాటంలో మేమంతా మీ వెంటే’; ‘బాబుతో నేను’; ‘సేవ్‌ డెమోక్రసీ, సేవ్‌ ఏపీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.


తల్లి ఆరోగ్యం బాగోలేదన్నా వదలరా..!

కోనసీమ జిల్లా మలికిపురంలో మా అమ్మ ఉంటోంది. ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో నేను హైదరాబాద్‌ నుంచి బయలుదేరా. హైదరాబాద్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్లలో వస్తున్నారనే సమాచారంతో ఆంధ్రా సరిహద్దులోకి రాగానే గరికపాడు చెక్‌పోస్టు వద్ద నన్ను పోలీసులు ఆపారు. వాహనాన్ని పక్కనపెట్టించారు. తల్లి అనారోగ్యం గురించి ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

ఓ యువకుడి ఆవేదన


సొంత పనిపై వచ్చినా ఇబ్బంది పెట్టారు

మాది గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం. ఆర్‌1 జోన్‌లో మార్పుచేర్పులకు సంబంధించి నేడు ఆఖరు రోజు. అందుకే హైదరాబాద్‌ నుంచి ఆగమేఘాలపై కుటుంబంతో సహా వచ్చా. సొంత పనిపై వచ్చానని చెబుతున్నా పోలీసులు వినలేదు. మా కారును పక్కకు తీసుకెళ్లి నిలిపారు. ఆధారాలు చూపించిన అరగంట తర్వాత కూడా వెళ్లేందుకు అనుమతించలేదు. కావాలనే ఆపి ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తోంది.

నవీన్‌, ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్‌


అందుకే హైటెక్‌ సీఎం అనేవారు..

ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎలాంటి కృషి చేశారో ప్రపంచమంతటికీ తెలుసు. బిల్‌గేట్స్‌, బిల్‌క్లింటన్‌ దగ్గరినుంచి అందరికీ తెలుసు. ఐటీని ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు ప్రజలకు పరిచయం చేసింది చంద్రబాబే. అందుకే ఆయన్ను అప్పట్లో హైటెక్‌ సీఎం అనేవారు. మేము ఏ రాజకీయ పార్టీని విమర్శించడానికి రాలేదు. చంద్రబాబు వల్ల లబ్ధి పొందాం. ఆయన్ను జైలులో పెట్టారనే బాధతో ఆయన కుటుంబ సభ్యులుగా మద్దతు తెలపడానికి వచ్చాం. ఇక్కడికి వస్తుంటే అడుగడుగునా అడ్డుకున్నారు.

సుమిత, ఐటీ ఉద్యోగిని


చంద్రబాబు చొరవతో లక్షల మందికి ఉద్యోగాలు

చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాం. ఆయన కుటుంబానికి మద్దతు తెలపడానికి తెలుగు, ఐటీ ఫ్రొఫెషనల్స్‌ తరఫున రాజమహేంద్రవరం వచ్చాం. చంద్రబాబుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన వల్ల లక్షల మంది లబ్ధి పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన విజనరీ లీడర్‌. అలాంటి పెద్ద మనిషిని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు.

భవానీ శంకర్‌, ఐటీ ఉద్యోగి


అందరూ రోడ్డెక్కాల్సిన సమయమిది

హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగుల ర్యాలీకి మద్దతుగా విజయవాడ నుంచి వచ్చాం. పోలీసులు ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టినా అన్నీ దాటుకుని వచ్చాం. పోలీసులు ఏమీ చేయలేరు. అందరూ బయటకు రండి. ఇంట్లో టీవీల ముందు కూర్చుని చర్చిస్తే ఉపయోగం లేదు. అందరూ రోడ్డెక్కాల్సిన అవసరముంది. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.

డూండీ, ఎన్‌ఆర్‌ఐ


ఎందరికో ఐటీ ఉద్యోగాలు కల్పించారు

ఐటీ హబ్‌ స్థాపించి వేల మందికి ఉద్యోగాలు కల్పించిన దార్శనికుడు చంద్రబాబు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును స్కిల్‌ కేసులో ఇరికించారు. చంద్రబాబు కుటుంబానికి మద్దతు తెలపడానికి వస్తుంటే ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ అడ్డుకున్నారు. ఎలాగోలా పోలీసులను దాటుకుని రాజమహేంద్రవరం వచ్చాం. చంద్రబాబు నిజాయతీ త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఆయన క్షేమంగా కేసు నుంచి బయటపడతారు.

హర్షిత్‌, ఐటీ ఉద్యోగి, బెంగళూరు


మీ మద్దతు చూసి గర్వపడుతున్నా: నారా బ్రాహ్మణి

చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వ్యయప్రయాసలు, ప్రభుత్వ నిర్బంధాలు దాటుకుని వచ్చిన ఐటీ ఉద్యోగులను చూసి గర్వపడుతున్నానని నారా బ్రాహ్మణి అన్నారు. మద్దతు తెలపడానికి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమన్నారు. ఫోన్లు, వాట్సప్‌లు చెక్‌ చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని, పోలీసు చర్యలు వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమేనని అన్నారు. రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, వ్యతిరేకిస్తే ఉగ్రవాదుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మేము బస చేసిన ప్రాంతం చుట్టూ బారికేడ్లు పెట్టి పోలీసులు పహారా కాశారు. ఈ పరిస్థితి మొదటిసారి చూస్తున్నా. చంద్రబాబునే జైల్లో వేశారంటే మిమ్మల్ని, మమ్మల్నీ ఏమైనా చేయగలరు. చంద్రబాబు కష్టకాలాన్ని అధిగమిస్తారు. సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తిమంతమైన నాయకుడు ఆయన’ అని పేర్కొన్నారు. యువత అంతా ఓట్లను చెక్‌ చేసుకోవాలని, ఓటుతో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబు దయ, ఆయన పెట్టిన భిక్ష కారణమని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. ‘అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నాం. ఇక్కడికొస్తే జన్మభూమికి వచ్చామనే ఆనందం ఉండేది. ఇప్పుడు మాత్రం ఆందోళనగా వచ్చాం. చంద్రబాబు గురించి తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు’ అని బ్రాహ్మణికి వివరించారు.

‘అన్ని దారులు ఆపేశారు. తెలంగాణ సరిహద్దులో కార్లు ఆపేస్తే బస్సులు, లారీలు, ఆటోలు మారుతూ వచ్చాం. ఫోన్లనూ తనిఖీ చేశారు. మా రాష్ట్రానికి మేము రావడానికీ వీల్లేదా..? మాకా హక్కు లేదా..?’ అని ప్రశ్నించారు. ‘శనివారం రాత్రి నుంచి రాజమహేంద్రవరం ఎలా రావాలనే ప్రయత్నాల్లోనే ఉన్నాం. ఇప్పటికి రాగలిగాం. కొందరం స్మార్ట్‌ఫోన్లు ఇంట్లో ఉంచి కీప్యాడ్‌ ఫోన్లు తెచ్చుకున్నాం. గోపాలపురం వద్ద బలవంతంగా కొందరి ఫోన్లు తీసుకుని వాట్సప్‌ చెక్‌ చేశారు’ అని వివరించారు. ‘రాజమహేంద్రవరంలో హోటల్‌లో దిగితే గదిలో పెట్టి పోలీసులు తాళాలేశారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు’ అని మరొక ఐటీ నిపుణుడు వివరించారు. ‘మేము ఇన్నాళ్లూ ఎవరినీ విమర్శించలేదు. రాజకీయాల్లో ఎవరి పక్షానా నిలవలేదు. ఇప్పుడు మేమంతా మీతోనే ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మీ కుటుంబంతోనే ఉంటాం.. మీ కోసం పనిచేస్తాం’ అని ఒక ఉద్యోగి భరోసానిచ్చారు. ‘మాది తమిళనాడు. నేను 1996లో హైదరాబాద్‌కు వచ్చా. నా కళ్లెదుటే హైదరాబాద్‌ ఎంత అభివృద్ధి చెందిందో చూశా. నేను గతంలో చంద్రబాబుపై కామెంట్‌ చేశా. ఒక టవర్‌ కట్టి అంతా అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఆయన దార్శనికతను ప్రత్యక్షంగా చూసి గొప్పదనాన్ని తెలుసుకోగలిగా’ అని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి క్రాంతి లావాజా పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని