AP Assembly: ఎసైన్డ్‌ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు

శాసనసభలో సోమవారం పది బిల్లులు ఆమోదం పొందాయి. వీటిపై ఎటువంటి చర్చ లేకుండానే, సవరణలు ఎందుకు చేస్తున్నారనే వివరాలను మంత్రులు తెలియజేసిన వెంటనే అన్ని బిల్లులకు ఆమోదం లభించింది.

Updated : 26 Sep 2023 08:55 IST

ఆర్టీసీ నియమావళి ప్రకారం పీటీడీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు
మొత్తం పది బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈనాడు, అమరావతి: శాసనసభలో సోమవారం పది బిల్లులు ఆమోదం పొందాయి. వీటిపై ఎటువంటి చర్చ లేకుండానే, సవరణలు ఎందుకు చేస్తున్నారనే వివరాలను మంత్రులు తెలియజేసిన వెంటనే అన్ని బిల్లులకు ఆమోదం లభించింది.

  • ఎసైన్డ్‌ భూములను పొందిన నాటి నుంచి 20 ఏళ్ల తర్వాత, ఇంటి స్థలాలను పదేళ్ల తర్వాత బదలాయించే హక్కు కల్పిస్తూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన ఏపీ ఎసైన్డ్‌ భూముల సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.
  • ఉమ్మడి రాష్ట్రంలో భూదాన్‌, గ్రామ్‌దాన్‌ చట్టం అమల్లో ఉండేది. ప్రస్తుతం తెలంగాణ విడిపోయినందున దానికి అనుగుణంగా కొన్ని మార్పులతోపాటు, భూదాన్‌ ద్వారా వచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, భూదాన్‌ బోర్డును ప్రభుత్వం నియమించేలా సవరణలతో మంత్రి ధర్మాన ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది.
  • ప్రజా రవాణాశాఖలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంకా సీసీఏ నియమావళి రూపొందించలేదు. దీంతో ఆర్టీసీ పాత నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తమపై ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఎలా చర్యలు తీసుకుంటారని కొందరు ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఏ నియమాలు రూపొందించే వరకు, ఆర్టీసీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రవేశపెట్టగా, దీనికి ఆమోదం లభించింది.
  • నాలుగు చక్రాల సరకు రవాణా ఆటోలకు జీవిత పన్ను బదులు త్రైమాసిక పన్ను వసూళ్లకు వీలు కల్పించడం, మోటారు వాహన చట్టంలో వాహన ధర అంటే ఇన్వాయిస్‌ ప్రకారం అని పరిగణనలోకి తీసుకునేలా రెండు వేర్వేరు సవరణ బిల్లులను మంత్రి విశ్వరూప్‌ ప్రవేశపెట్టగా సభ ఆమోదం పొందాయి.
  • కళాశాలలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మారాలన్నా, కొత్తగా  ఏర్పాటు చేయాలన్నా.. వాటికి టైమ్స్‌, క్యూఎస్‌ ఇచ్చే తొలి 100 ర్యాంకుల్లో ఉన్న వర్సిటీల్లో ఏదైనా ఒకదానితో ఒప్పందం చేసుకొని, జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చేలా ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.
  • విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలకు ఏపీపీఎస్సీ ప్రాథమిక పరీక్ష నిర్వహించేలా గతంలో 13 వర్సిటీలకు మాత్రమే అవకాశం ఉండగా, రాష్ట్రంలో మిగిలిన వాటికి కూడా ఇదే విధానం వర్తించేలా సవరణ బిల్లును సీఎం జగన్‌ తరఫున వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభలో ఆమోదం లభించింది.
  • దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలు, సంస్థల ఆదాయ పరిమితులు మార్చడం, కౌలు, లైసెన్సు గడువు ముగిసినా ఖాళీచేయకుండా ఆక్రమణలో ఉన్నవారిపై బెయిల్‌ లభించని కేసులు పెట్టడం, వీటిపై సంబంధిత ఈవోలు, ఆపై అధికారులు చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించే సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
  • బధిరుల టెన్నిస్‌ జట్టు భారత కెప్టెన్‌ షేక్‌ జఫ్రీన్‌కు క్రీడల కేటగిరీలో సహకారశాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్‌-1 సర్వీసులో నియమించేలా.. ఏపీ పబ్లిక్‌ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించే బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.
  • జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందని, ఇటువంటి పలు సవరణలకు చెందిన బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని