అమరావతిపై జగన్‌ ప్రభుత్వం కక్ష

ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సీఎం జగన్‌ ఎలా సర్వనాశనం చేశారో, ఎంత కక్షసాధింపుతో వ్యవహరించారో భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక బయటపెట్టింది.

Updated : 26 Sep 2023 06:45 IST

సవరించిన డీపీఆర్‌లు పంపాలని కేంద్రం అడిగినా చేతులు రాలేదు
అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదు
ప్రజావేదిక కూల్చివేతతో రూ.11.91 కోట్ల నష్టం
అంబేడ్కర్‌ స్మృతివనం నిలిపివేత వల్ల రూ.46.61 కోట్లు వృథా
తూర్పారబట్టిన కాగ్‌ నివేదిక

ఈనాడు, అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సీఎం జగన్‌ ఎలా సర్వనాశనం చేశారో, ఎంత కక్షసాధింపుతో వ్యవహరించారో భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక బయటపెట్టింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్ని నిలిపివేయడంతో.. అప్పటికే అక్కడ మౌలిక వసతులపై ఖర్చుపెట్టిన రూ.వేలకోట్లు వృథా అయినట్టు తెలిపింది. రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వం ఒక్కసారి కూడా అడగలేదు సరికదా... గత ప్రభుత్వ హయాంలో పంపిన డీపీఆర్‌లలో కొన్ని సవరణలు చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం 2019 మేలో సూచించినా స్పందించలేదు. చివరకు నీతి ఆయోగ్‌ గుర్తుచేస్తే 2022 జూన్‌లో తీరిగ్గా స్పందించింది. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి తదుపరి సాయం అందలేదని కాగ్‌ ఎండగట్టింది. 2014 జూన్‌ నుంచి 2021 సెప్టెంబరు వరకు రాజధాని అమరావతికి సంబంధించి ఆడిట్‌ వివరాల్ని కాగ్‌ తన నివేదికలో పొందుపరిచింది. ప్రజావేదికను కూల్చివేయడం వల్ల రూ.11.91 కోట్లు, అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టును నిలిపివేయడంతో రూ.44.61 కోట్లు వృథా అయ్యాయని.. ఈ ప్రాంతానికి ఒక మైలురాయిలా నిలిచే ప్రాజెక్టును కోల్పోయినట్టయిందని కాగ్‌ వ్యాఖ్యానించింది. 2019 మే నుంచి జగన్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో రాజధానికి భూ సమీకరణలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు జరిగిన నష్టాన్ని కాగ్‌ వివరించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..

కేంద్ర సాయానికి మోకాలడ్డు

అమరావతికి కేంద్రప్రభుత్వం 2015 మార్చి నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.1,500 కోట్లు అందజేసింది. రాజధాని నిర్మాణానికి వివిధదశల్లో రూ.1,09,023 కోట్లు ఖర్చవుతుందని గత ప్రభుత్వం అంచనావేసింది. నీతి ఆయోగ్‌కి రూ.39,937 కోట్లకు 2018 ఆగస్టులో 33 డీపీఆర్‌లు సమర్పించింది. 2018 డిసెంబరులో రూ.22,686 కోట్లకు మరో 14 డీపీఆర్‌లు అందజేసింది. తొలివిడతలో అందజేసిన 33 డీపీఆర్‌లను నీతి ఆయోగ్‌ 2019 ఏప్రిల్‌లో... కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖకు పంపి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, అభిప్రాయం తెలియజేయాలని కోరింది. కేంద్ర ప్రజాపనుల విభాగం 2019 మేలో ఆంధ్రప్రదేశ్‌ పురపాలకశాఖకు తన అభ్యంతరాల్ని తెలియజేస్తూ, సవరించిన డీపీఆర్‌లు పంపాలని సూచించింది. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, 2022 మేలో నీతి ఆయోగ్‌ గుర్తుచేసింది. 2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌ల అభివృద్ధికి ఖర్చుపెట్టింది రూ.183 కోట్లే

రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లను 14 జోన్లుగా విభజించారు. వాటిలో రెండు జోన్లకు ఇంకా టెండర్లు పిలవలేదు. మిగతా 12 జోన్లలో మౌలిక వసతుల పనుల్ని 16 ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో రూ.13,802.75 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభించగా... 2021 సెప్టెంబరు నాటికి రూ.183.04 కోట్లే ఖర్చుపెట్టారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేయడంతో.. మిగతా ప్యాకేజీల పనులు అసలు ప్రారంభించనేలేదు. రైతులకు మూడేళ్లలో స్థలాలు అభివృద్ధి చేసి ఇస్తామన్న హామీ నెరవేరలేదు.

దాదాపు సిద్ధమైన వాటినీ అందుబాటులోకి తేలేదు

అమరావతి పరిపాలన నగరంలో నిర్మాణ పనుల్ని గత ప్రభుత్వం రూ.6,848.58 కోట్లతో చేపట్టింది. షెడ్యూలు ప్రకారం 2018 సెప్టెంబరు నుంచి 2021 మార్చి మధ్య మొత్తం పనులు పూర్తికావాలి. వీటిని 19 ప్యాకేజీలుగా విభజించగా ఆరు ప్యాకేజీల పనులే 25-95% పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారుల నివాస గృహాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ రూ.1,505.22 కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు వృథాగా మారాయి.

ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయమూ లేదు

రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణానికయ్యే రూ.55,343 కోట్లలో సీఆర్‌డీఏ 2016-2023 మధ్య వివిధరూపాల్లో రూ.11,487 కోట్లు సమీకరించుకోగలిగింది. 2018-19 నుంచి ఏడేళ్లపాటు ఏటా రూ.1,800 కోట్ల చొప్పున రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. సీఆర్‌డీఏ హడ్కో, బ్యాంకుల కన్సార్షియం, బాండ్ల రూపంలో రూ.5,013.60 కోట్లు సమీకరించింది. కానీ ప్రధాన మౌలిక వసతులు, ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌ల అభివృద్ధి పనుల్లో ఆశించిన పురోగతి లేదు. పనులు చేసినా, చేయకపోయినా... ఈ రుణాలపై భవిష్యత్తులో రూ.3,428.12 కోట్ల వడ్డీ చెల్లించాలి.

రైతులకు ఆ సదుపాయాలన్నీ ఆగిపోయాయి

రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం వార్షికకౌలు చెల్లించడంతో పాటు... భూమిలేని పేదలకూ అదనపు వసతులు కల్పించింది. అన్నక్యాంటీన్లు ఏర్పాటుచేసింది. ఆరోగ్యకార్డులు అందజేసింది. వ్యాపారాలు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలు, ఇళ్లులేని పేదలకు గృహవసతి వంటి సదుపాయాలు తలపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి.

విద్యుత్‌లైన్ల ఖర్చు బూడిదలో పోసినట్టే

రాజధానిలో 400 కేవీ హైవోల్టేజి లైన్లను దారి మళ్లించేందుకు రూ.491.93 కోట్లతోను, 220 కేవీ హై వోల్టేజి లైన్లను భూగర్భంలో వేసేందుకు రూ.883.55 కోట్లతోను ప్రతిపాదనలు రూపొందించారు. ఏపీ ట్రాన్స్‌కో టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. 220 కేవీ లైన్లకు ఒక గుత్తేదారు సంస్థ 116.41 కి.మీ. పొడవైన రూ.208.67 కోట్ల విలువైన కేబుళ్లను సరఫరా చేసింది. జగన్‌ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడంతో.. భూగర్భలైన్ల ప్రతిపాదనను సీఆర్‌డీఏ రద్దుచేసుకుంది. ఆ కేబుళ్లను మరెక్కడైనా వాడేసుకోమని ఉచిత సలహా ఇచ్చింది. కానీ రాష్ట్రంలో తాము మరెక్కడా అలాంటి ప్రాజెక్టు చేపట్టడం లేదని ఏపీ ట్రాన్స్‌కో స్పష్టంచేసింది. ఆ కేబుళ్లు వృథాగా పడి ఉన్నాయి.

  • 400 కేవీ లైన్లు దారి మళ్లించేందుకు రూ.394.60 కోట్లతో ట్రాన్స్‌కో ఒక సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఇప్పటివరకు రూ.60 కోట్లు ఖర్చయింది. ఆ ఖర్చూ వృథానే.

చేసిన పనులన్నీ వృథా

  • రూ.163.97 కోట్లతో కొన్న పైపులు వివిధ ప్రాంతాల్లో వృథాగా పడి ఉన్నాయి.
  • రాజధానిని జాతీయ రహదారి-16తో కనకదుర్గ వారధి వద్ద అనుసంధానించేందుకు తలపెట్టిన సీడ్‌యాక్సెస్‌ రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. మొత్తం 21.34 కి.మీ. రహదారిలో 14.47 కి.మీ.లే పూర్తిచేశారు.
  • కృష్ణానదిపై రూ.1,387 కోట్లతో తలపెట్టిన ఐకానిక్‌ బ్రిడ్జిని ఈ ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై అప్పటికే డిజైన్లు, డ్రాయింగ్‌ల కోసం ఖర్చుపెట్టిన రూ.2.22 కోట్లు వృథా అయింది.
  • అమరావతిలోని శాఖమూరు పార్కులో రూ.1.86 కోట్లతో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిలిచిపోవడంతో అవన్నీ వృథాగా మారాయి.
  • ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో పిచ్చిమొక్కలు తొలగించడానికి 2017 మే నుంచి 2018 మే మధ్య రూ.10.87 కోట్లు వెచ్చించారు. 2019 మేలో ప్రభుత్వం ఆ పనులు నిలిపివేయడం, రైతులకు ఇవ్వకపోవడంతో ఆ నిధులు వృథా అయ్యాయి.

స్టార్టప్‌ ప్రాజెక్టు రద్దు వల్ల రూ.11.16 కోట్ల నష్టం

రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) సంయుక్తంగా అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ (ఏడీపీపీఎల్‌) పేరుతో కంపెనీ ఏర్పాటుచేశాయి. జగన్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అర్ధంతరంగా రద్దుచేసి, ఏడీపీపీఎల్‌ను లిక్విడేట్‌ చేయడంతో ప్రభుత్వానికి రూ.11.16 కోట్ల నష్టం వాటిల్లింది.

  • ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌)కి ఎకరం రూ.50 లక్షల చొప్పున 150 ఎకరాల్ని 2016లో ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ సీఆర్‌డీఏకి రూ.24.99 కోట్లు చెల్లించింది. గడువులోగా ప్రాజెక్టు చేపట్టనందుకు ఆ సంస్థకు భూకేటాయింపును 2019 ఏప్రిల్‌లో సీఆర్‌డీఏ రద్దుచేసింది. ఆ సంస్థ కట్టిన డబ్బు జప్తుచేయాలి. ఆ సంస్థ విజ్ఞప్తి చేయడంతో సీఆర్‌డీఏ 2020 జనవరిలో ఆ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా తిరిగి చెల్లించింది.
  • గుత్తేదారులకు రాజధానిలో వారి మెటీరియల్‌, పరికరాలు ఉంచుకోవడానికి ఎకరం రూ.లక్ష చొప్పున సీఆర్‌డీఏ లీజుకిచ్చింది. కానీ గుత్తేదారు సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. వారి బకాయి రూ.4.09 కోట్లు.
  • 30 పనులకు గుత్తేదారులకు రూ.1,282.83 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా ఇచ్చారు. దానిలో రూ.338.57 కోట్లే రికవరీ చేశారు. 2021 సెప్టెంబరు నాటికి రూ.944.26 కోట్లు గుత్తేదారుల వద్దే ఉన్నాయి.
  • రాజధానిలో వివిధ అవసరాలకు మట్టి తవ్వుకున్న గుత్తేదారుల నుంచి రూ.12.83 కోట్లు వసూలు చేయాలి.

ప్రజావేదిక కూల్చివేయడం వల్ల రూ.11.91 కోట్ల నష్టం

కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో రూ.7.85 కోట్లతో సీఆర్‌డీఏ ప్రజావేదిక (గ్రీవెన్స్‌ సెల్‌) నిర్మించింది. అనుబంధ వసతుల కోసం మరో రూ.4.06 కోట్లు వెచ్చించింది. ఆ భవన నిర్మాణానికి జలవనరులశాఖ, సీఆర్‌డీఏ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు తీసుకోలేదు. సీఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగం ఆ భవనాన్ని నిర్మించింది. ఈ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడంతో మొత్తం రూ.11.91 కోట్ల ప్రజాధనం వృథా అయింది.


అంబేడ్కర్‌ స్మృతివనం నిలిపివేయడం వల్ల రూ.44.61 కోట్లు వృథా

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని రాజధానిలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.97.69 కోట్ల అంచనా వ్యయంతో 20 ఎకరాల్లో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని గత ప్రభుత్వం తలపెట్టింది. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు పలు వసతులు కల్పించాలని తలపెట్టింది. రూ.44.61 కోట్లు ఖర్చుచేశాక... పనులు నిలిపివేయడంతో ఆ మొత్తం వృథా అయింది.


నాలుగున్నరేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే..

గన్‌ అధికారంలోకి వచ్చాక 2019 మే నుంచి రాజధాని పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రభుత్వవిధానం ప్రకారం అప్పటికే 25% పూర్తయిన పనుల్ని కొనసాగించాలి. ఆ విధానాన్ని రాజధానికి వర్తింపజేయలేదు. రాజధానిలో మౌలిక వసతుల పనుల్ని సీఆర్‌డీఏ మూడు కేటగిరీలుగా విభజించింది. వాటికి రూ.55,343 కోట్లు అవసరమని అంచనావేసింది. ప్రధాన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ.19,769 కోట్లు, ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో మౌలిక వసతులకు రూ.17,910 కోట్లు, ప్రభుత్వ భవనాలకు రూ.14,008 కోట్లు కావాలని అంచనా వేసింది. వాటిలో రూ.33,476.33 కోట్లకు సంబంధించిన 57 ప్యాకేజీల పనులకు టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించింది. రాజధాని నిర్మాణం నిలిపివేసేనాటికి... ఇంకా రూ.29,385.02 కోట్ల పనులు చేయాల్సి ఉంది. వాటిలో ప్రధాన మౌలిక వసతుల పనుల్ని 22 ప్యాకేజీలుగా విభజించారు. రూ.12,824 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా... 2021 అక్టోబరు నాటికి రూ.3,213.41 కోట్లు ఖర్చుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని