ముర్మూజీ.. జోక్యం చేసుకోండి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, తక్షణం కలగజేసుకుని ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు.

Updated : 27 Sep 2023 06:51 IST

చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు
రాష్ట్రంలో దళితులు, ఓబీసీలు, మహిళలపై దమనకాండ
దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లోకేశ్‌, తెదేపా ఎంపీల వినతి
ఈనాడు - దిల్లీ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, తక్షణం కలగజేసుకుని ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో దళితులు, ఓబీసీలపై ఇది వరకూ ఎన్నడూ లేనంత దమనకాండ జరుగుతోందని, ప్రభుత్వపరంగా జరుగుతున్న ఆ అరాచకాన్ని కూడా అడ్డుకోవాలని కోరారు. పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కె.రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి లోకేశ్‌ మంగళవారం ఇక్కడ రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘సెప్టెంబర్‌ 9 తెల్లవారుజామున చంద్రబాబునాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారు. తర్వాత సీఐడీ కోర్టు ఆయన్ను 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపింది. చట్ట, న్యాయ నిబంధనలను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ ఆయన్ను అరెస్టు చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబు పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయడానికి రాజకీయ ప్రతీకారంతో ఆయనపై కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్రపతికి వివరణ ఇచ్చారు.

1. మనీ ట్రయల్‌ సాక్ష్యాధారాలు లేవు

రూ.371 కోట్ల అవినీతిలో డబ్బు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, షెల్‌ కంపెనీలకు వెళ్లిందని సీఐడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కానీ, దాని తరఫున వాదిస్తున్న న్యాయవాదులు కానీ అందుకు ఆధారాలేవీ చూపలేదు. చంద్రబాబు రిమాండ్‌ నివేదికలో కూడా ఈ ఆర్థిక లావాదేవీల్లో ఆయనకు, కుటుంబానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు.

2. చంద్రబాబును కేసులో చేర్చడంలో అక్రమాలు

ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో తొలుత చంద్రబాబు పేరు చేర్చలేదు. ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత చేర్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం. పైగా చంద్రబాబు లాంటి ప్రజాప్రతినిధి అరెస్టుకు గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ దర్యాప్తు అధికారి గవర్నర్‌ అనుమతి కోరలేదు. అందువల్ల ఆయన అరెస్టు చెల్లదు. పైగా, ప్రజాప్రతినిధి దర్యాప్తుకు సహకరించకపోతేనో, సాక్షులను బెదిరిస్తేనో,  సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తేనో మాత్రమే అరెస్టు చేయాలి. చంద్రబాబు వీటిలో వేటికీ పాల్పడలేదు కాబట్టి ఆయన అరెస్టు నిబంధనలకు పూర్తి విరుద్ధం.

3. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు, టెండర్‌ నిబంధనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ప్రారంభానికి టెండర్లు పిలవలేదని ఆరోపిస్తున్నారు. సీమెన్స్‌ లాంటి సంస్థ 90% మొత్తాన్ని గ్రాంట్‌ రూపంలో పెట్టడానికి ముందుకొచ్చినప్పుడు సహజంగానే టెండర్ల అవసరం ఉండదు. ఎలాంటి టెండర్లు లేకుండానే నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి ఒప్పందాలే చేసుకున్నారు. అందువల్ల టెండర్లు లేకపోవడం వల్ల ఇక్కడేదో అన్యాయం, అవినీతి జరిగిందని చెప్పడానికి వీల్లేదు.

4. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ప్రశ్నార్థకం

ఈ పథకంలో ఆర్థిక అవకతవకలను కనిపెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిటే ప్రశ్నార్థకం. ఆ ఆడిట్‌ నిర్వహించిన శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల ఆడిట్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐవీఎస్‌ అండ్‌ అసోసియేట్స్‌ మధ్య పంచుకున్న ఐపీ చిరునామాలు  ఈ ఆడిట్‌, దాని స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఆడిట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తయారైనట్లు ఈ షేర్డ్‌ ఐపీ అడ్రస్‌ ద్వారా తెలుస్తోంది.

5. కంపెనీల పన్ను ఎగవేత

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అమలులో పాలుపంచుకున్న డిజైన్‌ టెక్‌ కంపెనీతో సంబంధం ఉన్న కంపెనీల పన్ను ఎగవేతను ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టకూడదు. పన్ను చెల్లింపు బాధ్యత సంబంధిత కంపెనీలదే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాత్ర జీఎస్టీ నిబంధనలకు కట్టుబడటం వరకే. అది ఆ పనిని సక్రమంగా నిర్వహించింది.

6. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం  విజయవంతం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ఏమీ లేదని సీఐడీ ఆరోపిస్తున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. అందులో ఎంతో పురోగతి జరిగింది. 6 ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, 34 టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూషన్లు పనిచేస్తున్నాయి. వాటి పనితీరును అభినందిస్తూ ఏపీ ప్రభుత్వ అధికారులు డిజైన్‌టెక్‌ సంస్థకు ధ్రువపత్రాలు కూడా జారీ చేశారు. పైగా ఏపీ హైకోర్టు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ ప్రతినిధులకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆ ప్రాజెక్టులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని చెప్పింది. 2.13 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినందుకు, 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయూతనిచ్చినందుకు అభినందించింది.

7. నైపుణ్యాభివృద్ధికి చంద్రబాబు కృషి

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018, 2019ల్లో ఆంధ్రప్రదేశ్‌.. దిల్లీ, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలను వెనక్కు నెట్టి నైపుణ్యాభివృద్ధిలో టాప్‌ ర్యాంకులో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని