‘ఐప్యాక్‌’ రోడ్లా.. అయితే మాకేంటి!

అత్యంత ఘోరంగా ఉన్న రహదారులను వెంటనే బాగు చేయాలని ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందం సూచించగా.. వాటికి పరిపాలన అనుమతులిచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశాక గుత్తేదారులు ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చారు.

Updated : 27 Sep 2023 06:40 IST

ప్రభుత్వానికి రహదారుల గుత్తేదారుల ఝలక్‌
టెండర్లు పూర్తయినా ఒప్పందాలకు ససేమిరా

ఈనాడు, అమరావతి: అత్యంత ఘోరంగా ఉన్న రహదారులను వెంటనే బాగు చేయాలని ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందం సూచించగా.. వాటికి పరిపాలన అనుమతులిచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశాక గుత్తేదారులు ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చారు. ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పనులకు నిధులు ఎక్కడినుంచి తెస్తారో స్పష్టతనివ్వాలని, పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో వారిని ఒప్పించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. రాష్ట్రంలో ఏయే రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు మొదలుకొని ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఎవరిని అడిగినా రహదారుల జాబితా చెబుతారు.

పైగా వాలంటీర్లతోపాటు అత్యధిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. వీరెవరినీ కాదని ఐప్యాక్‌ బృందాన్ని ప్రభుత్వం నమ్ముకుంది. వచ్చే ఎన్నికలనాటికి ఓటర్లపై ప్రభావం చూపే రహదారులంటూ ఐ-ప్యాక్‌ బృందం రాష్ట్రవ్యాప్తంగా 437 రోడ్లలో 3,432 కి.మీ.లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని సూచించింది. వీటికి ప్రభుత్వం హైఇంపాక్ట్‌ రోడ్లుగా పేరుపెట్టి రూ.1,122 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది. 2023-24 బడ్జెట్‌లోనూ వీటికి రూ.900 కోట్లు చూపారు. జిల్లాలవారీగా వీటికి ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక ఇప్పుడు ఒప్పందం చేసుకోవడానికి గుత్తేదారులు ససేమిరా అంటున్నారు.

గత అనుభవాలతో మేలుకొని..

జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రహదారుల మరమ్మతు చేసిన గుత్తేదారులకు కనీస చెల్లింపుల విషయంలోనూ చుక్కలు చూపిస్తోంది. ఒక్క ఏడాది మాత్రమే రహదారుల రెన్యువల్‌ పనులు చేశారు. అది కూడా బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్ల రుణం తీసుకొని నేరుగా ఆ బ్యాంకు నుంచే చెల్లింపులు చేసేలా ఏర్పాటుచేస్తేనే గుత్తేదారులు ముందుకొచ్చారు. కేంద్ర రహదారి నిధి, న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) ప్రాజెక్టుల్లో రహదారుల పనులు చేస్తున్న గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు లేవు. తాజాగా ఐప్యాక్‌ సూచించిన పనులు చేస్తే చెల్లింపులు ఎలా చేస్తారని గుత్తేదారులు సందేహిస్తున్నారు.

అవిగో నిధులు అని చూపేలా..

నాబార్డు రుణం కింద కొంత మొత్తం, కేంద్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కొంత మొత్తం ఈ పనులకు కేటాయించనున్నట్లు చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.400 కోట్ల మేర నాబార్డు రుణం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే నాబార్డు కొత్త రహదారుల నిర్మాణం, పటిష్ఠపరచడం (స్ట్రెంగ్తనింగ్‌)కే నిధులిస్తుంది. ఆర్‌అండ్‌బీ మాత్రం రోడ్ల రెన్యువల్‌కు నిధులు వినియోగించాలని భావిస్తోంది. దీనికి నాబార్డు సమ్మతిస్తుందా? అనేది సందేహమే. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి కింద దాదాపు రూ.350 కోట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. గతేడాది ఇవే నిధులను ఎలా ఖర్చు చేశారనే పత్రాలు చూపాల్సి ఉంటుంది. ఆ యుటిలైజేషన్‌ సర్టిఫికేట్లను ఎలా చూపాలనేదీ అధికారులకు అంతుచిక్కడం లేదు.

బకాయిలు ఇవ్వాల్సిందే..

ఇదే అదనుగా బకాయిలు చెల్లించి తీరాల్సిందేనని గుత్తేదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో బకాయిలు రాబట్టుకోవాలని చూస్తున్నారు. గతేడాది గుంతలు పూడ్చిన పనులకు, ఎన్‌డీబీ, కేంద్ర రహదారి నిధి.. తదితర పనుల బకాయిలు చెల్లిస్తే ఒప్పందాలు చేసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాజెక్టుల కింద రహదారుల పనులు చేసిన గుత్తేదారులకు దాదాపు రూ.500-600 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని