అవయవదానంతో అమరుడయ్యాడు

పుట్టిన రోజు వేడుకలు జరిగిన నాలుగు రోజులకే కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

Updated : 27 Sep 2023 06:35 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడికి బ్రెయిన్‌ డెడ్‌
గంటల వ్యవధిలోనే మరొకరికి గుండెమార్పిడి
వివిధ ఆసుపత్రులకు అవయవాలు

తిరుపతి (విద్య), గుంటూరు (నగరంపాలెం, నెహ్రూనగర్‌) - న్యూస్‌టుడే: పుట్టిన రోజు వేడుకలు జరిగిన నాలుగు రోజులకే కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అతను ఇక బతకడని.. బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడని డాక్టర్లు చెప్పడంతో గుండెలు పగిలి శోకంలో మునిగిపోయారు. ఆ తర్వాత తేరుకుని తమ బిడ్డ అవయాలను దానం చేయడానికి ఒప్పుకొన్నారు. హృదయాలను పిండేయటంతో పాటు స్ఫూర్తి నింపే ఈ ఘటన గుంటూరులో జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కట్టా కృష్ణ (19) ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రగాయాలపాలైన అతడిని గుంటూరు రమేష్‌ ఆసుపత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో అతడి గుండె, లివర్‌, రెండు కిడ్నీలు, నేత్రాలను దానం చేయడానికి తల్లిదండ్రులు మల్లేశ్వరి, రాజు ముందుకొచ్చారు. దీంతో గుంటూరు నుంచి మంగళవారం గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు అవయవాలను తరలించారు. 

హెలికాప్టర్‌ ద్వారా తిరుపతికి గుండె..

రమేష్‌ ఆసుపత్రిలో కృష్ణ అవయవాలను వేరు చేసి గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. మధ్యాహం 3:30 గంటలకు అంబులెన్స్‌లో గుంటూరు పోలీసు కవాతు మైదానానికి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా తిరుపతికి తరలించారు. లివర్‌ను విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రికి, కిడ్నీలను గుంటూరు రమేష్‌ ఆసుపత్రి, విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రులకు, కళ్లను గుంటూరులోని సుదర్శన్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. ‘చదువుకొని తల్లిదండ్రులతో పాటు పదిమందికి సాయపడాలన్నది వాడి కల. ఇలాగైనా వాడి కల నెరవేరినట్లు అనుకుంటాం’ అని కృష్ణ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వీరికి కృష్ణతో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటోలో ఉల్లిపాయలు అమ్ముకొని జీవిస్తుండగా కుమారుడి చికిత్స కోసం ఆ వాహనాన్ని అమ్మేశారు.

సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ..

హెలికాప్టర్‌ ద్వారా గుండెను తిరుపతి తరలించడానికి సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. విలువైన సమయం వృథా కాకూడదని జగన్‌ ఈ ఏర్పాటు చేశారని పేర్కొంది. మరోవైపు హెలికాప్టర్‌లో కృష్ణ గుండె వస్తుందని తెలిసి, తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సంచాలకులు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో కర్నూలు జిల్లాకు చెందిన 33 ఏళ్ల యువకుడికి ఆ గుండెను అమర్చి ప్రాణదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని