పైసా ఖర్చు చేయని ప్రాజెక్టులో అవినీతా?

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా, ఒక్క ఎకరం కూడా సేకరించకుండా, కనీసం డీపీఆర్‌ సిద్ధం చేయకుండా, బడ్జెట్‌లో కేటాయింపులూ చేయకుండా రూ.2,400 కోట్ల అవినీతి జరిగినట్టుగా వైకాపా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని తెదేపా శాసనసభాపక్షం మండిపడింది.

Updated : 28 Sep 2023 06:53 IST

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌కు ఒక్క ఎకరం
భూమి సేకరించలేదు, డీపీఆర్‌ సిద్ధమవలేదు
అయినా రూ.2,400 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం కట్టుకథలు
అదే నిజమైతే  అధికారుల  పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు  చేర్చలేదు?
మాక్‌ అసెంబ్లీలో  తెదేపా ధ్వజం

ఈనాడు, అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా, ఒక్క ఎకరం కూడా సేకరించకుండా, కనీసం డీపీఆర్‌ సిద్ధం చేయకుండా, బడ్జెట్‌లో కేటాయింపులూ చేయకుండా రూ.2,400 కోట్ల అవినీతి జరిగినట్టుగా వైకాపా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని తెదేపా శాసనసభాపక్షం మండిపడింది. ఐఆర్‌ఆర్‌ ప్రాజెక్టు 2018లో నోటిఫికేషన్‌ జారీ చేయడంతోనే ఆగిపోయిందని తెలిపింది. ఐఆర్‌ఆర్‌కి ఒక్క ఎకరం కూడా సేకరించలేదన్న విషయాన్ని 2023 మే నెలలో సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల్లో సీఆర్‌డీఏనే ధ్రువీకరించిందని తెలిపింది. వైకాపా తీరు ‘పుట్టని బిడ్డకు పెళ్లిచూపులు’ అన్నట్టుగా ఉందని దుయ్యబట్టింది. ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ మార్చడం ద్వారా పలువురికి లబ్ధి చేకూర్చారన్న అసత్య ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై అక్రమ కేసు పెట్టడం, ఆ శాఖతో ఎలాంటి సంబంధం లేని లోకేశ్‌ను ఏ14గా చేరుస్తూ కోర్టులో సీఐడీ తాజాగా మెమో సమర్పించడం జగన్‌ ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్ఠని ధ్వజమెత్తింది. తెదేపా శాసనసభాపక్షం బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాక్‌ అసెంబ్లీ నిర్వహించింది. ‘ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు- వాస్తవాలు’ అన్న అంశంపై ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ మార్చడం ద్వారా హెరిటేజ్‌ సంస్థకు లబ్ధి చేకూర్చారన్నది వైకాపా నాయకుల కట్టుకథని మండిపడ్డారు.

అధికారుల పేర్లు ఎందుకు తప్పించారు?

‘ఐఆర్‌ఆర్‌కు సంబంధించి ఎస్‌టీయూపీ కన్సల్టెన్సీ సంస్థ మూడు ఆప్షన్లు  సూచిస్తే.. ఒకటో ఆప్షన్‌ను ఎంపిక చేసి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని, సొంత వారికి లబ్ధి చేకూర్చేలా కుట్ర చేశారని వైకాపా ప్రభుత్వం అసంబద్ధ ఆరోపణ చేస్తోంది. ఏ ఆప్షన్‌ను ఎంపిక చేయాలన్నది ముఖ్యమంత్రి, మంత్రుల సొంత నిర్ణయం కాదు. 15 మంది సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీ పలు దఫాలు చర్చించి నిర్ణయం తీసుకుంది. ఆ అధికారులెవరూ తమ అసమ్మతిని తెలియజేస్తూ నోట్‌ రాయలేదు. నిజంగానే అవినీతి జరిగితే వారు కూడా బాధ్యులే కదా? మరి వారినెందుకు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు? సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అందరూ బాధ్యులవుతారన్న సహజ న్యాయ సూత్రాన్ని సీఐడీ ఎందుకు విస్మరిస్తోంది?’ అని అనురాధ మండిపడ్డారు. మాస్టర్‌ప్లాన్‌ తయారీ బాధ్యతను సుర్బానా, జురాంగ్‌కు సంస్థలకు నామినేషన్‌ పద్ధతిపై అప్పగించడం కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలకు విరుద్ధమని సీఐడీ చెబుతోందని.. అదే నిజమైతే 2014 డిసెంబరు 5 నుంచి 2016 జులై 27 వరకు సీఆర్‌డీఏ కమిషనర్‌గా వ్యవహరించి, ఆ నిర్ణయాల్లో కీలక భూమిక వహించిన నాగులాపల్లి శ్రీకాంత్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదో చెప్పాలని నిలదీశారు. ‘అది కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలకు విరుద్ధమని ఆయన బోర్డుకు రాతపూర్వకంగా తెలియజేయాలి కదా? అలా చేయనందుకు ఆయనను ప్రాసిక్యూట్‌ చేయాలి కదా? అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులపై ఫిర్యాదు చేసిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. శ్రీకాంత్‌పై ఎందుకు ఫిర్యాదు చేయలేదు?’ అని ఆమె ధ్వజమెత్తారు.

హెరిటేజ్‌ భూములకు, ఐఆర్‌ఆర్‌కు సంబంధమేంటి?

‘హెరిటేజ్‌ సంస్థ భూములకు విలువ పెంచేలా ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ మార్చారని ప్రభుత్వం తప్పుడు ఆరోపణ చేస్తోంది. హెరిటేజ్‌ సంస్థ మార్కెట్‌ విలువ రూ.2,171 కోట్లు. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల భూములు కొనుగోలు చేసింది. దానిలో భాగంగానే గుంటూరు జిల్లాలో ఆ సంస్థ కొన్న 9 ఎకరాల భూమి తుళ్లూరుకు 20 కి.మీ., అమరావతికి 30 కి.మీ.ల దూరంలో ఉంది. ఆ భూమిని 2014 జులైలోనే రిజిస్టర్‌ చేసుకుంది. అంటే అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న ఆలోచన చేయక ముందే హెరిటేజ్‌ సంస్థ ఆ భూములు కొనుగోలు చేసింది. హెరిటేజ్‌ భూములకూ, ఐఆర్‌ఆర్‌కీ ముడిపెట్టడం ప్రభుత్వ కక్షసాధింపులో భాగమే. అయినా హెరిటేజ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కాదు. అది కొన్న భూముల విలువ పెరిగినా, తగ్గినా అది వాటాదారులకే చెందుతుంది. హెరిటేజ్‌ సంస్థ భూముల విలువ పెంచేందుకు సింగపూర్‌ సంస్థతో కలసి కుట్ర చేసి, ఎలైన్‌మెంట్‌ తయారు చేయించారని ప్రభుత్వం చెప్పడాన్ని చూస్తే.. ఏదో కుంభకోణం జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ఎంతటి కుయుక్తులకు పాల్పడుతోందో అర్థమవుతోంది’ అని అనురాధ మండిపడ్డారు.

ఐఆర్‌ఆర్‌పై సీఐడీ కట్టు కథలు

‘ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ విషయంలో చంద్రబాబు, నారాయణ కుట్ర చేసి హెరిటేజ్‌, రామకృష్ణా హౌసింగ్‌, లింగమనేని సంస్థలకు రూ.వేల కోట్ల లబ్ధి కలిగేలా అవకతవకలకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్‌ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ యుద్ధప్రాతిపదికన కదిలి.. 2022 మే 6న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అంటే వారం రోజుల్లోనే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయడం, రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణల్ని ధ్రువీకరించడం జరిగిపోయాయన్నమాట! అది జరిగాక గత 16 నెలలుగా నారాయణతో పాటు, లింగమనేని రమేష్‌, రామకృష్ణ హౌసింగ్‌ సంస్థలకు చెందిన వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసేందుకు, వారి ఆస్తుల జప్తునకు సీఐడీ చేయని ప్రయత్నం లేదు. సీఐడీ తప్పుడు ఆరోపణలతో, విచారణ పేరుతో వేధించినవారంతా కోర్టులకెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్లీ బయటకు తీసి.. చంద్రబాబు, లోకేశ్‌లను దానిలో ఇరికించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును ఎలాగైనా జైల్లోనే ఉంచాలన్న కుట్రతో.. అసలే మాత్రం అవినీతి జరగని, కాగితాల్లో తప్ప కనిపించని ఐఆర్‌ఆర్‌ ప్రాజెక్టులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, రూ.2,400 కోట్లు అక్రమంగా లబ్ధి పొందారని జగన్‌ జేబు సంస్థ సీఐడీ మెమో దాఖలు చేసింది’ అని మండిపడ్డారు.  

రష్యా, ఉక్రెయిన్‌లను యుద్ధం చేయమన్నదీ లోకేశ్‌ అంటారేమో!

లోకేశ్‌ నిర్వహించిన ఏ శాఖకూ ఐఆర్‌ఆర్‌తో సంబంధం లేకపోయినా ఆయన పేరును కేసులో చేర్చడం చూస్తుంటే... చివరకు రష్యా, ఉక్రెయిన్‌లకు కూడా యుద్ధం చేయాలని లోకేశే ఫోన్‌ చేసి చెప్పారని ఈ ప్రభుత్వం అభియోగం మోపేలా ఉందని అనురాధ ఎద్దేవా చేశారు. ‘యుద్ధం వల్ల పెట్రోలు ధరలు పెంచాల్సిందిగా లోకేశే చెప్పారని, దాని వల్ల పాల ధర పెరిగి హెరిటేజ్‌కు లబ్ధి చేకూరిందని ప్రభుత్వం కట్టుకథలు అల్లేలా ఉంది. జగన్‌ పాలన పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా ఉంది. ప్రతిపక్ష నాయకులకు.. లేని నేరాలు అంటగట్టడం జగన్‌కే చెల్లింది. 38 క్రిమినల్‌ కేసులు, 409 సెక్షన్‌ కింద మూడు కేసులున్న వ్యక్తి.. 90 శాతం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు నేరచరిత్ర ఉన్నవారికి ఇచ్చి, వారితో ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడిస్తున్నారు’ అని మండిపడ్డారు.

ఐఆర్‌ఆర్‌ వల్ల తమ భూములే పోతాయని లింగమనేని సంస్థ చెప్పింది

‘లింగమనేని సంస్థకు 1980 నుంచి కాజా, కంతేరు, నంబూరు గ్రామాల్లో 355.34 ఎకరాల భూములున్నాయని, ఆ తర్వాత మరో 10 ఎకరాలు కొన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఆర్‌ఆర్‌ వల్ల తమ భూములు 14 ఎకరాలు పోతాయని లింగమనేని సంస్థ హైకోర్టుకు తెలియజేసింది. దశాబ్దాల క్రితం వందల ఎకరాలు ఉన్నవారికి రోడ్డు ఎటు నుంచి వేసినా కొంత లబ్ధి, కొంత నష్టం జరగడం సహజం. ఆ సంస్థకు మేలు చేయడానికి ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ మార్చారన్న వాదన నిరాధారం’ అని అనురాధ స్పష్టం చేశారు.  రామకృష్ణ హౌసింగ్‌ సంస్థలో మాజీ మంత్రి నారాయణకు వాటాలు ఉన్నాయని, ఆ సంస్థకు లబ్ధి చేకూర్చేలా రాజధాని మాస్టర్‌ప్లాన్‌, ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లను మార్చారంటూ సీఐడీ చేస్తున్న ఆరోపణను ఆమె కొట్టిపారేశారు. ‘రామకృష్ణా హౌసింగ్‌ సంస్థ బ్యాంకు ఖాతాల్ని సీఐడీ స్తంభింపజేసినప్పుడు వారు కోర్టుకు వెళ్లారు. ప్రతిపాదిత ఐఆర్‌ఆర్‌కు 5.7 కి.మీ.ల దూరంలో తమ భూములున్నాయని చెప్పారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు బ్యాంకు ఖాతాల్ని విడుదల చేసింది’ అని వెల్లడించారు. రామకృష్ణా హౌసింగ్‌ వారి భూములు నిషిద్ధ జాబితాలో ఉన్నా, వారి కోసం జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లు మార్చి, వారి భవనాల ప్లాన్లకు అనుమతులిచ్చారన్న ఆరోపణలనూ అనురాధ తోసిపుచ్చారు. రామకృష్ణా హౌసింగ్‌ వారి బిల్డింగ్‌ ప్లాన్లకు రాష్ట్ర విభజనకు ముందు 2013లోనే అప్పటి వీజీటీఎం- ఉడా అనుమతులిచ్చిందని గుర్తుచేశారు. ‘రామకృష్ణా హౌసింగ్‌ కడుతున్న రెండు భవనాల్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన అద్దెకు తీసుకోవడానికి నారాయణ సంస్థ దఫదఫాలుగా రూ.12 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. ఆ ప్రాజెక్టు అమలు కాకపోవడంతో ఆ మొత్తాన్ని వెనక్కు కూడా తీసుకుంది. రామకృష్ణ హౌసింగ్‌లో నారాయణకు ఎప్పుడూ భాగస్వామ్యం లేదు. ఇంత నిస్సిగ్గుగా కోర్టుల్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ఎమ్మెల్యే ఆళ్ల గొప్పతనం అనుకోవాలి’’ అని ఆమె మండిపడ్డారు.

నారాయణ భూమి రింగ్‌రోడ్డులో కలిసిపోతుందని సీఆర్‌డీఏ చెప్పింది

విజయవాడలో నారాయణకు చెందిన ఆస్తుల విలువ పెంచుకోవడానికి ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను మార్చారన్న సీఐడీ ఆరోపణనూ అనురాధ కొట్టిపారేశారు. నారాయణ సంస్థకు పోరంకిలోని సర్వే నం.488లో ఉన్న భూమి ప్రతిపాదిత ఐఆర్‌ఆర్‌లో పోతుందని, అందుకే అక్కడ భవన నిర్మాణానికి అనుమతివ్వలేదని 2022లో సీఆర్‌డీఏ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల్లో స్పష్టం చేసిందని తెలిపారు. నిజంగానే ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ మారిస్తే ఆ భూములను ఐఆర్‌ఆర్‌లోకి ఎందుకు పోనిస్తారని ఆమె ప్రశ్నించారు.


క్విడ్‌ ప్రోకోను పరిచయం చేసిందే వైకాపా నాయకులు
- తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

వైకాపా నాయకులకు కొత్త కొత్త పదాల్ని, కుట్రల్ని తెరపైకి తేవడం చాలా ఇష్టమని.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, క్విడ్‌ప్రోకో వంటివి వారికి అలవాటైన పనులని వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. చంద్రబాబు అమరావతినే రాజధానిగా ఎంపిక చేయడానికి 20 కారణాలున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘నీటి లభ్యత, రోడ్డు, రైలు, విమాన మార్గాలద్వారా అనుసంధానం, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి పలు అంశాల్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రైతులకు స్థలాలు ఇచ్చేయగా ఇంకా సీఆర్‌డీఏ వద్ద మిగిలే 8 వేల ఎకరాల్లో.. ఐదు వేల ఎకరాల్ని ఎకరం రూ.20 కోట్లు చొప్పున విక్రయించినా రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి అమరావతి ముమ్మాటికీ స్వయం సమృద్ధ ప్రాజెక్టు. రాజధానిలో గత ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు కొనసాగి ఉంటే.. 60 వేల ఉద్యోగాలు వచ్చేవి. రాజధాని అమరావతిలో వచ్చే 20 ఏళ్లలో 21 లక్షల ఉద్యోగాలు లభించేవి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌తో పాటు, దేశ విదేశాల్లో ఆందోళనలు చేస్తున్నారంటే దానికి కారణం.. అప్పట్లో ఆయన ఐటీని, సైబరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్లే’ అని చెప్పారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు ఇంకా కాగితాలపైనే ఉందని, భూసేకరణ, శంకుస్థాపన కూడా జరగని ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారం ఎక్కడుందని శ్రీదేవి  నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని