చంద్రబాబు తప్పు చేయరని విచారణ అధికారులకూ తెలుసు

45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదనే నమ్మకం నాకుంది. ప్రభుత్వాలు మారాయి. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. దేన్నీ నిరూపించలేక పోయాయి.

Updated : 28 Sep 2023 06:59 IST

ప్రజల కోసం ఆలోచించే నేతను అక్రమంగా జైలులో పెట్టారు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం సాగుతుంది: చంద్రబాబు సతీమణి భువనేశ్వరి

45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదనే నమ్మకం నాకుంది. ప్రభుత్వాలు మారాయి. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. దేన్నీ నిరూపించలేక పోయాయి. రాష్ట్ర ప్రజల కోసమే చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తారు. ప్రజలకు ఏం చేయాలి? ఏం చేస్తే వారి కాళ్ల మీద వారు నిలబడతారు? ఏ పరిశ్రమ వస్తే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే ధ్యాసతోనే ఉంటారు. ఇంట్లో అందరం కలసి భోజనం చేసేటప్పుడూ అదే ఆలోచన. మీ కోసమే ఆలోచించే వ్యక్తిని ఏ తప్పూ చేయకపోయినా, జైల్లో నిర్బంధించారు. ఇప్పటికీ చిన్న ఆధారాన్నీ చూపించలేదు.

భువనేశ్వరి

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే,    సీతానగరం, నగరపాలక సంస్థ, టి.నగర్‌: ఏ తప్పూ చేయకపోయినా అక్రమంగా కేసు నమోదు చేసి.. చంద్రబాబును 19 రోజులుగా జైల్లో నిర్బంధించారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రూ.371 కోట్ల అక్రమం జరిగిందని అంటున్నారు.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ఏ ఖాతాలో వేశారు? నిజానిజాలు తెలుసుకున్నాకే ఎవరినైనా నిర్బంధించాలి. ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని  నేనెప్పుడూ చూడలేదు. చంద్రబాబును జైలులో పెట్టాక సీఐడీ అధికారులు రెండురోజులు ప్రశ్నించారు. సీఐడీ వారినే చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తారని నేను ముందే ఊహించా. ఆయనపై నాకు ఉన్న నమ్మకం అలాంటింది. చంద్రబాబు తప్పు చేయరని విచారణకు వచ్చిన అధికారులకూ తెలుసు’ అని భువనేశ్వరి చెప్పారు.

మహిళలంటే గౌరవం

‘చంద్రబాబుకు మహిళలంటే నమ్మకం, గౌరవం. ఆయన అరెస్టు తెలియగానే ఎంతోమంది మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. చంద్రబాబు పాలనంటే అందరికీ అంత నమ్మకం. ఆయన సీఎంగా కారులో వెళ్తుంటే రోడ్డుపై గుంత కనిపించినా, కాలువ సరిగా లేకపోయినా, లీకేజీ ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి అప్రమత్తం చేసేవారు. అమరావతి నిర్మాణ సమయంలో వీధి దీపాల నిర్వహణను యాప్‌లో చూసి అధికారులకు సూచనలు చేసేవారు’ అని భువనేశ్వరి వివరించారు. ‘స్కిల్‌ కేంద్రాలతో లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఇప్పుడు అనేక మంది రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కొందరు కంపెనీలు పెట్టి సీఈవోలు అయ్యారు’ అని భువనేశ్వరి వివరించారు.

వృద్ధురాలిపై హత్యాయత్నం కేసు

70 ఏళ్ల మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో అర్థం ఉందా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. కుప్పంలో నిరసన తెలిపిన మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారని, కొవ్వొత్తుల ర్యాలీలు చేసిన వారిని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, ప్రభుత్వం ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారని విమర్శించారు.

నాకు జరిగిన అవమానాన్ని మరచిపోను

‘నేనూ మహిళనే. నాకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మరచిపోను. నాపై అనేక విమర్శలు చేశారు. ఎవరి కోసమో నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షి, మావారు నమ్మితే చాలు. పనిలేని మగవాళ్లు అలాగే మాట్లాడతారు. మహిళలు పట్టించుకోవద్దు. ఈ సృష్టికి మూలం మహిళ అనే సంగతిని వాళ్లు వాళ్లు మరచిపోయారు’ అని భువనేశ్వరి అన్నారు.

ఎవరూ ఏమీ చేయలేరు

‘కుటుంబమనే ఆలోచనే లేకుండా.. మీ అందరి కోసం చంద్రబాబు రేయింబవళ్లూ కష్టపడేవారన్నారు. ఇప్పుడు మీరంతా రేపటి గురించి ఆలోచించాలి. ఉపాధి, రేపటి ఆంధ్రప్రదేశ్‌ గురించి ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలి. ప్రజలంతా చేతులు కలిపితే ఎవరూ ఏమీ చేయలేరు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా.. అందరం కలసి శాంతియుతంగా పోరాడదాం’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. సేవ్‌ డెమోక్రసీ.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.. సత్యమేవ జయతే... అంటూ మహిళలతో నినాదాలు చేయించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అమరావతి దళిత జేఏసీ ప్రతినిధి కొలికపూడి శ్రీనివాసరావు, రాజానగరం నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


ఓపిక చేసుకుని తిరుగుతా..

- కొండేటి అనంతలక్ష్మి

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు పంపడాన్ని టీవీల్లో చూసి 82 ఏళ్ల వయసులో నా గుండె తరుక్కుపోతోంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే దాకా ఓపిక చేసుకుని తిరుగుతూనే ఉంటా.


శిబిరం వద్ద హైడ్రామా

రాజమహేంద్రవరంలో చంద్రబాబు కుటుంబసభ్యులు ఉంటున్న శిబిరం దగ్గర బుధవారం కొంత హైడ్రామా చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ అధినేత పసుపులేటి సుధాకర్‌ శిబిరానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వారి కళ్లుగప్పి శిబిరానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పసుపులేటి అభిమానులు శిబిరానికి వస్తుండగా 500 మీటర్ల దూరంలో పోలీసులు వారిని ఆపేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.


‘యువతకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో లోకేశ్‌ యువగళం ప్రారంభించారు. తొలుత లోకేశ్‌ మాట్లాడే సౌండ్‌ సిస్టం వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఒక మైక్‌, స్టూల్‌ ఏర్పాటు చేసుకుంటే పనిలేని పోలీసులు వాటినీ తీసుకెళ్లిపోయారు. మైక్‌ తీసేస్తే యువగళం ఆగుతుందా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా సాగుతుంది. మనమంతా చేయిచేయి కలిపి ముందుకెళ్దాం. చంద్రబాబుకు మద్దతుగా సాగుదాం’

నారా భువనేశ్వరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని