ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో భారీ అక్రమాలు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎసైన్డ్‌ భూముల స్వాధీనం, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ డిజైన్ల మార్పులకు అనుగుణంగా భూముల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు.

Published : 28 Sep 2023 05:46 IST

నామినేషన్‌ పైనే డిజైన్ల బాధ్యతలు అప్పగించారు
శాసన సభలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపణ

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎసైన్డ్‌ భూముల స్వాధీనం, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ డిజైన్ల మార్పులకు అనుగుణంగా భూముల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. శాసనసభలో బుధవారం అమరావతి భూముల వ్యవహారంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌లో భారీఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘అమరావతిని గ్రాఫిక్స్‌తో గారడీ చేశారు. చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో అవినీతి అన్నది చాలా చిన్నపదం. ఐఆర్‌ఆర్‌ మలుపులు తిరిగి కొందరి భూముల వైపు వెళ్లింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తమ ఆప్తులు, సంస్థలకు అనుగుణంగా డిజైన్లలో మార్పుచేర్పులు చేసింది. డిజైన్ల తయారీ బాధ్యతలను నామినేషన్‌ విధానంలో మూడు సంస్థలకు అప్పగించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.28 కోట్ల ఆర్థికభారం పడింది. లింగమనేని ఎస్టేట్స్‌, హెరిటేజ్‌, ఇతర సంస్థలు పథకం ప్రకారం తక్కువ ధరకు భూములు కొన్నాయి. అప్పటి మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలు పెనమలూరు వైపు ఉన్నాయన్న ఉద్దేశంతోనూ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో మార్పులు చేశారు. తక్కువ ధరలకు కొన్న భూములను ఎక్కువ ధరలకు విక్రయించారు. ఇదంతా ‘క్విడ్‌ ప్రో కో’ తరహాలో జరిగింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ‘కాగ్‌’ కూడా తేటతెల్లం చేసింది. ఈ కుంభకోణంలో సన్నకారు, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు’’ అని ఆరోపించారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డులో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఎలైన్‌మెంట్‌లో అనేక మార్పులు, చేర్పులు చేయడంతో కొందరికి ఆర్థికి ప్రయోజనం చేకూర్చడం ద్వారా చంద్రబాబు కుటుంబం లబ్ధి పొందిందని అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కూడా ఇదే అంశంపై మాట్లాడారు.

విచారణలో వెలుగులోకి రాకున్నా.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి: ధర్మాన

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో పదేళ్ల వరకు ఉండొచ్చు. కానీ చంద్రబాబు తప్పులు చేసి, హడావుడిగా ఇక్కడికి వచ్చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ధనంతో మౌలిక సదుపాయాలు కల్పించి, సంపన్నులకు ప్రయోజనం కల్పించారు. అదేవిధానాన్ని అమరావతిలోనూ అనుసరించారు. కోర్‌ కేపిటల్‌ ఎక్కడ వస్తుందన్నదానిపై రకరకాల ప్రచారాలు చేసి ప్రజలను అయోమయానికి గురిచేశారు. ప్రణాళిక ప్రకారం అమరావతిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో చంద్రబాబు బృందం ఎసైన్డ్‌ భూములను చౌకధరలకు కొనేసింది. దూరప్రాంతాల వ్యక్తులు ఇక్కడకు వచ్చి.. వ్యవసాయ భూములు ఎలా కొన్నారు? శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి.. నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి, తమకు కావల్సిన ప్రతిపాదనలు చేయించుకున్నారు. అమరావతిలోని ఎసైన్డ్‌ భూముల రికార్డులను మాయంచేసి, పేదల భూములను లాక్కున్నారు. దర్యాప్తులో సాంకేతికపరమైన లోపాలు వెలుగులోకి రాకపోవచ్చు. కానీ ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని