ఓపీఎస్‌ను అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదు

పాత పింఛను పథకం (ఓపీఎస్‌) అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 3% ఉండాల్సిన ఆర్థికలోటు ఓపీఎస్‌ అమలుతో 2030కి 4.8%, 2040కి 6.1%, 2050 కల్లా 8 శాతానికి చేరుతుందని చెప్పారు.

Updated : 28 Sep 2023 08:07 IST

2050 నాటికి ఆర్థికలోటు 8 శాతానికి చేరుకుంటుంది
ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తుంది: మంత్రి బుగ్గన
జీపీఎస్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఈనాడు, అమరావతి: పాత పింఛను పథకం (ఓపీఎస్‌) అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 3% ఉండాల్సిన ఆర్థికలోటు ఓపీఎస్‌ అమలుతో 2030కి 4.8%, 2040కి 6.1%, 2050 కల్లా 8 శాతానికి చేరుతుందని చెప్పారు. అదే జరిగితే రాష్ట్రం ఆర్థికంగా స్తంభించి, అప్పుచేసే పరిస్థితి కూడా ఉండదని మంత్రి వివరించారు. భావితరాలను, ఉద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యాన్యుటీ మోడల్‌లో గ్యారంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) తీసుకొచ్చామని ఆర్థికమంత్రి తెలిపారు. ఇదే విధానాన్ని రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. జీపీఎస్‌ బిల్లు-2023ను ముందుగా నిర్ణయించిన ఎజెండాలో కాకుండా... టేబుల్‌ ఎజెండా ఐటంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం’ (సీపీఎస్‌)ను రివ్యూ చేయాలని అనేక ఏళ్లుగా ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై అనేక రకాలుగా అధ్యయనం చేశాక హైబ్రిడ్‌ మోడల్‌లో గ్యారంటీ పెన్షన్‌ స్కీం తెచ్చాం. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు సొంత అవసరాలు, అభిప్రాయాల కంటే ప్రజలకు సంబంధించిన అంశాలే ప్రధానం. ఓపీఎస్‌లో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదికి రూ.20,400 కోట్ల చొప్పున ప్రభుత్వం పింఛన్‌ ఇస్తోంది. సీపీఎస్‌ ఉద్యోగులంతా ఓపీఎస్‌కు వెళితే 2030లో రూ.33,546 కోట్లు అవసరమవుతాయి. 2045 నుంచి పరిస్థితి మరింత చేయి దాటిపోతుంది. ఎందుకంటే 2004 తరువాత నియమితులైన ఉద్యోగుల పదవీ విరమణ.. 2045 నాటికి భారీసంఖ్యలో ఉంటుంది. ఈరోజు ఎవరైతే సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ తీసుకున్నామని సంబరపడతారో... వారు 2045 నాటికి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలామంది ఓపీఎస్‌ను పెట్టాలని అంటున్నారు. మనస్సాక్షిగా పాలన చేయాలి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా... 2070 వరకు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించి ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది’ అని ఆర్థికమంత్రి అన్నారు.

మధ్యే మార్గంగా జీపీఎస్‌

సీపీఎస్‌ ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను షేర్‌ మార్కెట్‌లో పెడుతున్నందున వారికి కలిగే ప్రయోజనం 20% కంటే ఎక్కువ లేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు ప్రస్తుత, భవిష్యత్‌లో నియమితులయ్యే ఉద్యోగుల అవసరాలు, వారి పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించి సీపీఎస్‌, ఓపీఎస్‌కు మధ్యేమార్గంగా జీపీఎస్‌ తీసుకొచ్చాం. ఒక వేళ ఓపీఎస్‌కు వెళితే రాష్ట్ర పింఛన్లు 2030 నాటికి 16%, 2040కి 19.5%, 2050కి 28.6%, 2100కి దాదాపుగా 40 శాతానికి వెళతాయి. ఇది 5-7 శాతమే ఉండాలి. స్థూల ఉత్పత్తికి అప్పు అనేది ఒక నిష్పత్తిగా తీసుకుంటే 35 శాతం కంటే ప్రస్తుతం తక్కువ ఉంటాం. ఓపీఎస్‌కు వెళితే అప్పు 2030కి 53%, 2040కి 70%, 2050కి 107 శాతానికి చేరుతుంది. దీనివల్ల భవిష్యత్‌లో ఆర్థికంగా తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని జీపీఎస్‌ను రూపొందించాం’ అని బుగ్గన వివరించారు.

జీపీఎస్‌తో ప్రయోజనాలివీ...

‘పదవీ విరమణ చేసే నాటికి చివరిసారిగా డ్రా చేసిన మూల వేతనంలో 50% చొప్పున నెల వారీ పింఛన్‌ ఉండేలా గ్యారంటీ ఇస్తున్నాం. పింఛన్‌దారు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 60% పింఛన్‌ వర్తింపజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జీపీఎస్‌ ఉద్యోగులకు హెల్త్‌ స్కీం అమలు చేస్తాం. పదేళ్ల సర్వీసు కలిగిన ఉద్యోగులకూ రూ.10 వేల పింఛన్‌ గ్యారంటీ ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు.


10,117 మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

వివిధ ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్‌ 2 నాటికి పని చేస్తున్న 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌ బిల్లు-2013ను అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు. సభ ఆమోదించాక మంత్రి మాట్లాడారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు లోబడి క్రమబద్ధీకరించిన ఉద్యోగులను... ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమిస్తామని వెల్లడించారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 2 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని