మాకూ ఉంది బటన్‌.. ముందుంది రిటర్న్‌!

గ్యారంటీడ్‌ పింఛను పథకం(జీపీఎస్‌) బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎస్‌ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు.

Updated : 28 Sep 2023 08:28 IST

ఉద్యోగుల పాలిట చీకటిరోజు
వారంలో ఓపీఎస్‌ అమలు చేస్తానని.. ఇప్పుడు జీపీఎస్‌తో   మోసగించిన జగన్‌
సీపీఎస్‌ ఉద్యోగుల నిరసనలు
జీపీఎస్‌ బిల్లు ప్రతుల దహనం

ఈనాడు, అమరావతి: గ్యారంటీడ్‌ పింఛను పథకం(జీపీఎస్‌) బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎస్‌ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బిల్లు ప్రతులను దహనం చేశారు. ఉద్యోగుల చరిత్రలో దీన్ని చీకటిరోజుగా అభివర్ణించారు. ‘మాకూ ఉంది బటన్‌.. ముందుంది రిటర్న్‌’ అంటూ నినదించారు. పాత పింఛన్‌ పథకం(ఓపీఎస్‌)ను పునరుద్ధరించే దాకా పోరాడతామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వారంలో ఓపీఎస్‌ను అమలు చేస్తానని... ఎన్నికల ముందుకు హామీ ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు మాట తప్పి ఉద్యోగులను నిలువునా మోసగించారని విమర్శించారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసనల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జీపీఎస్‌ వద్దు.. ఓపీఎస్‌ను అమలు చేయాలంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు...


ఇక నుంచి జీపీఎస్‌పై పోరు
- హృదయరాజు, చిరంజీవి, ఏపీటీఎఫ్‌

జీపీఎస్‌ను ఉద్యోగులపై బలవంతంగా రుద్దడాన్ని సహించబోం. ఇప్పటిదాకా సీపీఎస్‌ను రద్దు చేయాలని పోరాడాం. ఇక నుంచి జీపీఎస్‌ అంతం కావాలని ఉద్యమిస్తాం. ఓపీఎస్‌ను పునరుద్ధరించే దాకా ఆందోళనలు ఆగవు.


కనీసం చర్చించకుండా...
- కోట్ల రాజేష్‌, అంబటి వెంకటేశ్వర్లు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ సచివాలయ సీపీఎస్‌ అసోసియేషన్‌

బాధిత ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకుండా... వారు దాచుకున్న డబ్బుతోనే పింఛన్‌ హామీ పేరుతో జీపీఎస్‌ బిల్లు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీలో చివరి రోజు.. అదీ ముందుగా ఎజెండాలో పెట్టకుండా జీపీఎస్‌ బిల్లు తీసుకు రావడం అన్యాయం.


ఈ ప్రభుత్వ అధ్యాయం ముగిసినట్లే
- అప్పలరాజు, కమిరి రాజేశ్వరరావు, దాస్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అసోసియేట్‌ అధ్యక్షుడు, ఏపీసీపీఎస్‌ఈఏ

సీపీఎస్‌ ఉద్యోగులకు ఇది బ్లాక్‌ డే. ఎన్నికలప్పుడు ఈ బ్లాక్‌ డేను గుర్తుపెట్టుకోండి. బలవంతంగా జీపీఎస్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అప్రజాస్వామికం. రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారతారంటే ఇదేనేమో. మమ్మల్ని, మా ఆవేదనను ఓట్ల కోసం వాడుకున్నారు. ఇప్పుడు మా పీక పట్టుకున్నారు. హామీని నెరవేర్చాలని అడిగితే బైండోవర్‌ కేసులు పెట్టారు. ఇక ఈ ప్రభుత్వ అధ్యాయం ముగిసినట్లే.


నిలువునా మోసగించడమే..
- గణపతిరావు, ప్రకాష్‌రావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆప్తా

మధ్యంతర భృతి కంటే పీఆర్సీ ఫిట్‌మెంట్‌ తగ్గించారు. ఓపీఎస్‌ కావాలంటే జీపీఎస్‌ను తెచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని 3.5 లక్షల మంది ఉద్యోగులకు వ్యతిరేకంగా జీపీఎస్‌ను తేవడం నిలువునా మోసగించడమే.


ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
- నరహరి, ఎన్వీ రమణయ్య, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీటీఎఫ్‌

జీపీఎస్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఓపీఎస్‌ను ఇవ్వకపోగా.. ఇప్పుడు జీపీఎస్‌ తెచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను పట్టించుకోక పోవడం శోచనీయం.


బిల్లులో ఏముందో చెప్పలేదు
- శ్రావణ్‌కుమార్‌, బాలాజీ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆపస్‌

జీపీఎస్‌పై అన్ని వర్గాలతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. బిల్లులో ఏముందో ఉద్యోగ సంఘాలకు చెప్పలేదు.


నోరు మెదపని ఐకాస నాయకులు

జీపీఎస్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నా జగన్‌ భజనలోనే కొనసాగుతున్న వైనం

రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు... జీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే ప్రధాన ఐకాసలు మాత్రం నోరుమెదపడం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ మౌనం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా జీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నా ఎక్కడా ఒక్క ఐకాస కూడా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేయలేదు. జీపీఎస్‌పై చర్చల సమయంలోనూ సీపీఎస్‌ ఉద్యోగుల మనోభావాలను పట్టించుకోకుండా జీపీఎస్‌ను స్వాగతిస్తున్నట్లు చెప్పారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గతంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఐకాస నాయకులతో పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై... ‘మాట తప్పని మా జగనన్న’ అంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి ప్రకటన విడుదల చేయడంపైనా ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓపీఎస్‌పై మాట తప్పితే కనీసం ప్రకటన కూడా ఇవ్వలేని దుస్థితిలో ఐకాస నాయకులు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని