Chandrababu: చంద్రబాబు కేసు అక్టోబరు 3కు వాయిదా

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ ప్రకారం గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది.

Updated : 28 Sep 2023 12:27 IST

సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు
రెండు ధర్మాసనాల ముందు వాదనలు
విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌
దాంతో సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసిన చంద్రబాబు న్యాయవాదులు
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వరుస కేసులు పెడుతున్నట్లు వెల్లడి
15 రోజుల తర్వాత కస్టడీ కోరుతూ సీఆర్‌పీసీని అపహాస్యం  చేస్తున్నారని ఆవేదన

ఈనాడు, దిల్లీ: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ ప్రకారం గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుపై బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం ముందు విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనం నుంచి జస్టిస్‌ భట్‌ తప్పుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన సభ్యుడిగా లేని వేరే ధర్మాసనం ముందు విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వచ్చే వారానికి వాయిదా వేయబోయారు. ఈ కేసులో ఉన్న అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని త్వరగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి విజ్ఞప్తి చేస్తామని, అందువల్ల వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులివ్వొద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అందుకు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా అంగీకరించడంతో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెంటనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వెళ్లి ఈ కేసును మెన్షన్‌ చేసి పూర్వాపరాలు వివరించారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ కూడా తన వాదనలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ కేసును అక్టోబరు 3కు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ క్రమం...

బుధవారం ఈ కేసు 3వ కోర్టులో 61వ నంబరు కింద విచారణకు రాగానే జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా జోక్యం చేసుకుంటూ.. జస్టిస్‌ భట్‌కి కొన్ని పరిమితులు ఉన్నాయని న్యాయవాదులకు చెప్పారు. అప్పుడు చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే... సాధ్యమైనంత త్వరగా తదుపరి విచారణ తేదీని ఖరారు చేయాలని కోరారు. వచ్చే వారం చేపడతామని జస్టిస్‌ ఖన్నా బదులిచ్చారు. సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ఈ కేసు అత్యవసరత దృష్ట్యా సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేయడానికి సమయం ఇవ్వాలని, త్వరగా విచారణకు స్వీకరించేలా సీజేఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అందుకు జస్టిస్‌ ఖన్నా అంగీకరించారు. దాంతో సిద్ధార్థ లూథ్రా వెంటనే... సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం ముందుకు వచ్చి ఈ కేసు గురించి వివరించారు. ఈ కేసును సోమవారం మీ ముందు మెన్షన్‌ చేశామని, దాన్ని దృష్టిలో ఉంచుకుని బుధవారం లిస్ట్‌ చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు పెట్టారని చెప్పారు. ఆయన రిమాండు 15 రోజులు పూర్తయిన తర్వాత పోలీస్‌ కస్టడీ అడుగుతున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

  • 17ఎ కింద ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంపై చట్టబద్ధమైన ఆంక్షలు ఉన్నాయని, ఆ విషయాన్ని యశ్వంత్‌సిన్హా, స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. 8వ తేదీన ఆయనను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. దాన్ని తాము తొలిరోజు నుంచీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కేసు పెట్టడం చట్టవిరుద్ధమని, అది లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం గానీ, చంద్రబాబును అరెస్ట్‌ చేయడం కానీ వీలుకాదన్నారు. ఇక్కడ అదే ప్రధానాంశమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ప్రతి ఒక్కరూ బెయిల్‌ మీద బయట ఉన్నారని, చంద్రబాబు ఒక్కరినే జైల్లో పెట్టారని చెప్పారు. 13వ రోజున రెండు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి ఇచ్చారని, అది పూర్తయిందని తెలిపారు. 15 రోజుల తర్వాత మళ్లీ కస్టడీ పొడిగింపు కోరుతున్నారని, చట్టప్రకారం అదెలా సాధ్యమో తనకు అర్థం కావడం లేదన్నారు.
  • ఇప్పుడు ఒకదాని తర్వాత మరొకటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ప్రారంభించారని చెప్పారు. అన్నింటికీ 17ఎ సెక్షన్‌ వర్తిస్తున్నా, దాన్ని పట్టించుకోకుండా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, పోలీస్‌ కస్టడీ అడుగుతున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వస్తుండటంతో పిటిషనర్‌కు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడానికి ఈ మొత్తం వ్యవహారాన్ని సర్కస్‌లా మారుస్తున్నారని ధర్మాసనానికి విన్నవించారు. ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజాసమస్యలపై మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తిని ఇలా చేయడం తగదన్నారు. తొలి నుంచీ ఈ కేసును తాను వాదిస్తున్నట్లు చెప్పారు. ఆయన్ను ఉదయం 6 గంటలకు కోర్టు ముందు హాజరుపరచగా, సాయంత్రం వరకూ కోర్టులోనే ఉన్నారని తెలిపారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి నిరంతరం వాయిదా వేస్తూ రాత్రి 7 గంటలకు ఉత్తర్వులు వెలువరించారన్నారు. తాము గృహనిర్బంధం కోసం అడిగితే తిరస్కరించారన్నారు. ఎన్‌ఎస్‌జీ జడ్‌ ప్లస్‌ రక్షణ ఉన్న వ్యక్తి విషయంలో వ్యవహరించిన తీరు ఇలా ఉందని పేర్కొన్నారు. తాము బెయిల్‌ కోసం దరఖాస్తు చేశామని, అయితే దాంతో 17ఎ కేసుకు సంబంధం లేదన్నారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ 17ఎ ప్రాతిపదికన మీరు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారా అని ప్రశ్నించగా న్యాయవాది లూథ్రా లేదని సమాధానం చెప్పారు.
  • 17ఎపై హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌లో తీర్పు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాగా, తాము వెంటనే ఇక్కడ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామని చెప్పారు. కేసు ఇక్కడ ఉన్నందున తామేమీ బెయిల్‌ కోసం అక్కడ ఒత్తిడి తేలేదన్నారు. బెయిల్‌ అన్నది కేసు మెరిట్స్‌కి సంబంధించిన విషయమని, 17ఎ అన్నది సమస్యకు మూలాధారమని తెలిపారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ ఈ రోజు మీరు ఏం కోరుకుంటున్నారని ప్రశ్నించారు. లూథ్రా బదులిస్తూ కేసు ఈరోజు లిస్ట్‌ అయినా దురదృష్టవశాత్తు విచారణకు స్వీకరించలేకపోయారని, అది మీ నియంత్రణలో కూడా ఏమీ లేదని, అందువల్ల త్వరగా విచారణకు తీసుకోవాలని, మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. సెక్షన్‌ 17ఏ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి వీల్లేదు కాబట్టి కస్టడీలో ఉంచడానికి వీల్లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ‘ఇప్పుడు ఈ కేసుపై విచారణ చేపడుతున్నారా?’ అని ధర్మాసనాన్ని ప్రశ్నించారు. అందుకు సీజేఐ బదులిస్తూ వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మీ వాదనలూ వింటామని అన్నారు.
  • సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ గురించి చదివి వినిపించారు. దాని ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్‌ విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు ప్రారంభించడానికి వీల్లేదని చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. కానీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 17ఎ కింద ముందస్తు అనుమతులు తీసుకున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ అక్టోబరు 3న ఈ కేసును తగిన ధర్మాసనం ముందు లిస్ట్‌ చేస్తామని చెప్పారు. లూథ్రా బదులిస్తూ ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, యశ్వంత్‌సిన్హా కేసు తీర్పులోని పేరా 115, 116, 118ల్లో అవినీతి కేసుల్లో 17ఎ కింద కేసు నమోదు చేయాలంటే అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోర్టు చెప్పిందని, ఇది న్యాయపరిధికి సంబంధించిన అంశమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
  • ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ ఈ విషయంలో మీరేమంటారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ ఇది రూ.3వేల కోట్ల ప్రాజెక్టు అని, అందులో 90% కాంట్రాక్టర్‌, 10% ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. అప్పట్లో కుదిరిన ఒప్పందంలో 90% క్లాజ్‌ తీసేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 10% మొత్తాన్ని ముందే చెల్లించారని చెప్పారు. అప్పటికి అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 17ఎ సవరణ రాలేదన్నారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ తాము ఈ కేసును వచ్చే మంగళవారానికి లిస్ట్‌ చేస్తామని చెప్పారు.
  • అప్పటి వరకూ వారిని కస్టడీ కోసం ఒత్తిడి చేయొద్దని చెప్పాలంటూ సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ తిరస్కరిస్తూ కింది కోర్టులో చోటుచేసుకున్న పరిణామాలను తాము వచ్చే మంగళవారం ధర్మాసనం దృష్టికి తీసుకొస్తామన్నారు. ఆ వాదనలను లూథ్రా తోసిపుచ్చారు. 15 రోజుల తర్వాత పోలీసు కస్టడీ కోరడానికి వీల్లేదన్నారు. అయినా ఈరోజూ కింది కోర్టులో ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ తన ముందుకొచ్చిన దరఖాస్తులను చూడకుండా దిగువ కోర్టు జడ్జిని నియంత్రించలేమన్నారు. లూథ్రా వాదనలు కొనసాగిస్తూ అక్కడ సీఆర్‌పీసీని అపహాస్యం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీఆర్‌పీసీ 167 ప్రకారం తొలి 15 రోజుల్లోనే పోలీసు కస్టడీ ఇవ్వాలని, అది ఈ నెల 24తో పూర్తయిందన్నారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ పోలీసు కస్టడీ ఇదే కేసులో కోరుతున్నారా.. వేరే కేసులోనా అని ప్రశ్నించారు. ఇదే కేసని లూథ్రా చెప్పారు. పోలీసు కస్టడీని కోరుతూ తాము దాఖలు చేసిన అప్లికేషన్‌ ట్రయల్‌ కోర్టు ముందుందని, బెయిల్‌ మీదున్న ఇతర నిందితుల నుంచి సేకరించిన డాక్యుమెంట్లను ఈయన ముందు పెట్టి విచారించాల్సి ఉందని, అందుకే పోలీసు కస్టడీ పొడిగించాలని కోరామని రంజిత్‌కుమార్‌ చెప్పారు. కావాలంటే వాళ్లు దాన్ని వ్యతిరేకించవచ్చని, దానిపై ట్రయల్‌కోర్టు జడ్జి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత కేసును 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చెబుతూ ప్రధాన న్యాయమూర్తి విచారణ ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు