ఉద్యోగులకు కొత్త దగా

జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులను మళ్లీ దగాచేసింది. వారు తమ హక్కుగా పొందాల్సిన పింఛనుకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. శాసనసభలో ‘గ్యారంటీ పింఛను పథకం’ (జీపీఎస్‌) పేరుతో బుధవారం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది.

Updated : 28 Sep 2023 09:45 IST

జీపీఎస్‌తో సరికొత్త టెన్షన్‌
దాచుకున్న నిధీ హాంఫట్‌
ప్రభుత్వ గ్యారంటీకి అన్నీ కోతలే
నిబంధనలు తేలితే మరిన్ని తూట్లు? 

ఈనాడు, అమరావతి:

జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులను మళ్లీ దగాచేసింది. వారు తమ హక్కుగా పొందాల్సిన పింఛనుకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. శాసనసభలో ‘గ్యారంటీ పింఛను పథకం’ (జీపీఎస్‌) పేరుతో బుధవారం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. తీరా దాని తీరుతెన్నులు చూసి ప్రభుత్వోద్యోగులు హతాశులవుతున్నారు. ‘‘పింఛను ఉద్యోగుల హక్కు. అలాంటిది జగన్‌ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచింది. కొత్త పథకంలో మాకు పింఛను భరోసా లేకుండా పోయింది. ఇందులో ఉద్యోగులకు కొత్తగా భరోసాగా ఇచ్చే పింఛను ఎక్కడుంది’’ అని ఆగ్రహోదగ్రులవుతున్నారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని తమను నమ్మబలికి, అధికారంలోకి వచ్చి ఇలా నట్టేట ముంచడమేంటని నిరసన ధ్వనులు వినిపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న పింఛను గ్యారంటీ అనేది మాటలకే పరిమితమయిందని  ఆ బిల్లు చూస్తేనే తెలిసిపోతోంది. అసలు ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారంటీ పింఛనే అంతంతమాత్రం. దానికీ గ్యారంటీ లేదన్న తరహాలో ప్రభుత్వం బిల్లు రూపొందించి ఆమోదించుకుంది. కొత్త పథకం వస్తోందంటే అది ఉద్యోగులకు మేలుచేసేలా ఉండాలి. ఏదో కొత్త పథకం తెచ్చామని చెప్పడానికి తప్ప.. ఇది ఉద్యోగులకు మేలుచేసేలా లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ చేత్తో ఇచ్చి... ఆ చేత్తో కోత

ఈ స్కీం పేరు గ్యారంటీ పింఛను. ప్రభుత్వం ఒక చేత్తో పింఛనుకు గ్యారంటీ ఇస్తోంది. మరో చేత్తో కోత పెట్టేస్తోంది. పైగా ఇప్పుడున్న సీపీఎస్‌తో పోలిస్తే నష్టమేనని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగి పదవీవిరమణ చేసే నాటికి అతని మూలవేతనంలో 50% పింఛనుగా వచ్చేలా గ్యారంటీ ఇస్తామని చెబుతున్నారు. అదేమీ ప్రభుత్వం జేబులోంచి తీసి ఇవ్వదు. ఉద్యోగులు ప్రతి నెలా ఇచ్చే వాటా సొమ్ము, ప్రభుత్వం జతచేసే వాటా సొమ్ముతో ఏర్పడ్డ నిధిని యాన్యుటీ స్కీంలో పెట్టుబడిగా పెడతారు. ఆ స్కీం నుంచి ప్రతి నెలా వచ్చే మొత్తం ఆధారంగా పింఛను ఇస్తానని చెబుతోంది. అలా వచ్చే సొమ్ము 50 శాతానికి తక్కువైతే.. అది తామే భరిస్తామని చెబుతోంది. నెలకు రూ.10 వేలు అలా భరిస్తానని చెబుతోంది. ఉద్యోగులు దాచుకున్న నిధిలో ప్రస్తుతం 60% మొత్తం పదవీవిరమణ సమయంలో వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ నిధి నుంచి ఉద్యోగులు అలా తీసుకుంటే పింఛను మొత్తానికి గ్యారంటీ ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఆ మేరకు పింఛనులో కోత పెడతామని బిల్లులో పేర్కొంది. ఆ మాత్రం సీపీఎస్‌తో పోలిస్తే ప్రయోజనం ఏంటని.. ఇదేం గారడీ అని ఉద్యోగులు నిలదీస్తున్నారు.

ఎందుకంటే...

ఉద్యోగి పదవీవిరమణ చేసేనాటికి రూ.60వేల మూలవేతనం ఉందనుకుందాం. ఆయనకు జీపీఎస్‌లో రూ.30వేల పింఛను వస్తుంది. ఆ ఉద్యోగికి పింఛను నిధి దాదాపు రూ.60 లక్షలు జమ అయిందని అంచనా వేస్తే, ఆ నిధిలో నుంచి ఏ మొత్తమూ అతను తీసుకోకూడదు. కొంత తీసుకుంటే గ్యారంటీ పింఛను తగ్గిపోతుంది. అదే సీపీఎస్‌ విధానంలో 60లక్షల నుంచి 60%.. అంటే 36 లక్షలు వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 24 లక్షలు పింఛను స్కీంలో పెట్టుబడి పెడతారు. 12% వడ్డీ వచ్చిందనుకున్నా అతనికి రూ.24,000 పింఛను వస్తుంది. జీపీఎస్‌లో అదనంగా వచ్చే రూ.6,000 కోసం ఉద్యోగి కోల్పోయేది రూ.36 లక్షలు. ఒకవేళ యాన్యుటీ స్కీం నుంచి ప్రతినెలా వచ్చే మొత్తం గ్యారంటీ పింఛను కన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది ఉద్యోగులకు ఇస్తారా.. తీసేసుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆనక ఇవ్వబోయే నిబంధనల్లో ఆ వివరణ ఏమైనా ఉంటుందేమో చూడాలి.

ప్రభుత్వం ఎప్పుడైనా ఆ మొత్తం ఆపేస్తుందట

ఉద్యోగులకు ఎలాంటి హక్కులూ కల్పించని ప్రభుత్వం తనకు మాత్రం పెద్ద హక్కే బిల్లులో ఇచ్చుకుంది. ఈ గ్యారంటీ పింఛను కోసం ప్రభుత్వం ప్రతి నెలా అదనంగా ఇచ్చే టాప్‌ అప్‌ మొత్తం రూ.10వేలు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చట. దీని నియమ నిబంధనలు ఇంకా రాలేదు. ఉద్యోగి ప్రవర్తన ఆధారంగా ఈ గ్యారంటీ పింఛను ఎత్తేస్తారట. ప్రవర్తన అంటే ఏంటో ఇంకా స్పష్టం చేయలేదు. మరోవైపు పదవీవిరమణ చేసిన తర్వాత అతను వేరే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఈ పింఛనులో ప్రభుత్వం అదనంగా భరించే టాప్‌ అప్‌ గ్యారంటీ ఉండబోదట. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏముంది? ఒకవైపు ఇప్పటికే పదవీవిరమణ చేసి పెద్ద మొత్తంలో పింఛను పొందుతున్న తమ అనుయాయులను ప్రత్యేకాధికారులుగా నియమించి పెద్ద పెద్ద జీతాలిస్తున్న జగన్‌ ప్రభుత్వం.. ఉద్యోగులకు ఈ నిబంధన పెట్టడమేంటోనన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ గ్యారంటీ పింఛను పూర్తిగా పొందాలంటే 33 ఏళ్ల సర్వీసు ఉండాలట. ఇదేం నిబంధన అని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ఉద్యోగులు పాత పింఛను విధానంలో 28 ఏళ్లు సర్వీసు చేసినా ప్రభుత్వం 5 ఏళ్లు అదనంగా సర్వీసు కలిపి పూర్తి పింఛను ఇస్తోంది. అలాంటిది కొత్త పింఛను స్కీంలో ఇచ్చేది తక్కువైనా స్వచ్ఛంద పదవీవిరమణ చేస్తే 20 ఏళ్ల సర్వీసు, అనారోగ్య కారణాలతో పదవీవిరమణ పొందితే పదేళ్ల కనీస సర్వీసు ఉండాలని నిబంధనలు పెట్టడమూ చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేసినా, ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించినా ఈ పథకం వర్తించదు. క్రమశిక్షణ అంశాలు పెండింగులో ఉంటే అవి తేలేవరకు ఈ స్కీం ప్రయోజనాలు అందవు. ఉద్యోగి మరణిస్తే అతని భార్య లేదా, ఆమె భర్తకు ఆ పింఛనులో 60% ఇస్తారు. దీనికీ అనేక నిబంధనలు వర్తిస్తాయి.

మూల పింఛను పెరగదు, డీఆర్‌పై స్పష్టత లేదు

పాత పింఛను విధానంలో ఆరునెలలకోసారి ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం ప్రకటించే కరవుభత్యం మొత్తాన్ని డీఆర్‌ (డియర్‌నెస్‌ రిలీఫ్‌) రూపంలో ఇస్తారు. కొత్త జీపీఎస్‌లో దానిపై స్పష్టత లేదు. చట్టం ఆధారంగా రూపొందించే నిబంధనల్లో దీనిపై వివరణ ఇస్తామన్నారు. పాత పింఛను విధానంలో అయిదేళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఆధారంగా మూల పింఛను పెరుగుతుంది. ఈ స్కీంలో అది ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని