సర్పంచులకు తెలియకుండా నిధులెలా ఖర్చుచేస్తారు?

పంచాయతీలకు వచ్చిన ఆర్థికసంఘం నిధులను సర్పంచులకే తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉపకార్యదర్శి విజయకుమార్‌ ఏలూరు జిల్లా పంచాయతీ అధికారులను ప్రశ్నించారు.

Published : 28 Sep 2023 05:12 IST

ఏలూరు జిల్లా అధికారులను ప్రశ్నించిన కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఉపకార్యదర్శి

ఈనాడు-ఏలూరు, న్యూస్‌టుడే-పెదవేగి, బుట్టాయగూడెం: పంచాయతీలకు వచ్చిన ఆర్థికసంఘం నిధులను సర్పంచులకే తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉపకార్యదర్శి విజయకుమార్‌ ఏలూరు జిల్లా పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. సర్పంచుల అనుమతి లేకుండా.. వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఖర్చుచేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థికసంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేసిందని రాష్ట్ర సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఇచ్చిన ఫిర్యాదులపై రెండు రోజుల విచారణ కోసం దిల్లీ నుంచి వచ్చిన విజయకుమార్‌ బుధవారం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పెదవేగి మండలం భోగాపురం పంచాయతీల్లో పర్యటించారు. ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఆ వివరాలిలా..

విజయకుమార్‌ బుధవారం ఉదయం బుట్టాయగూడెం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్థికసంఘం నిధుల్లో రూ.57 లక్షలు దారిమళ్లినట్లు గుర్తించారు. దీనిపై సర్పంచి వెంకాయమ్మను ప్రశ్నించగా ‘నాకు ఆర్థికసంఘం నిధులు వచ్చినట్లు, వాటిని విద్యుత్తు బకాయిలకు చెల్లించినట్లు తెలియదు. నేను వైకాపా మద్దతుదారునే.. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు’ అని బదులివ్వటంతో ఆశ్చర్యపోయారు.

ఎలా దుర్వినియోగం చేస్తారు

పంచాయతీ నిధులు ఏమయ్యాయని డీపీవో విశ్వనాథ్‌ను ప్రశ్నించగా విద్యుత్తు బకాయిలు చాలా కాలం నుంచి పేరుకుపోవటంతో ఆర్థికసంఘం నిధుల నుంచి చెల్లించామని, ఇది మంచి పరిణామమేనని చెప్పుకొచ్చారు. దీంతో విజయకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విద్యుత్తు బకాయిలు చెల్లించడానికి ఆర్థికసంఘం నిధులు వినియోగించటం నిబంధనలకు విరుద్ధం అని తెలియదా.. ఆ నిధుల్లో 10% పంచాయతీ అవసరాలకు కేటాయిస్తారు. అందులో అన్ని ఖర్చులతో పాటు విద్యుత్తు బిల్లు కూడా చెల్లించాలి. అంతేగానీ వచ్చిన నిధులన్నీ వినియోగించటం నేరం. వాటిని తిరిగివ్వాలి. మీరు చెల్లించిన విద్యుత్తు బకాయిల రసీదులు చూపించండి నిధుల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.

భోగాపురంలో రూ.52 లక్షల దారి మళ్లింపు

అనంతరం విజయకుమార్‌ పెదవేగి మండలం భోగాపురం పంచాయతీని పరిశీలించారు. అక్కడ కూడా రూ.52 లక్షలు దారిమళ్లించారు. ఇవీ విద్యుత్తు బకాయిలకే వినియోగించామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. పంచాయతీ నుంచి చెల్లించిన బకాయిల రసీదులు, ఖర్చులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణలో డీపీవో తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని