సోషల్‌ మీడియా పోస్టింగ్‌ కేసులో... తెదేపా మహిళా నాయకురాలి అరెస్టు

తండ్రి చనిపోయిన బాధలో అనారోగ్యం పాలైన ఓ మహిళను సోషల్‌మీడియా పోస్టింగ్‌ కేసులో గుంటూరు పట్టాభిపురం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ జి.స్పందన తప్పుపట్టారు.

Published : 28 Sep 2023 05:12 IST

ఆరోగ్యం బాగోలేదన్నా వినిపించుకోని పోలీసులు
పోలీసుల తీరును తప్పుపట్టిన మేజిస్ట్రేట్‌
రిమాండ్‌ తిరస్కరిస్తూ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పట్టాభిపురం: తండ్రి చనిపోయిన బాధలో అనారోగ్యం పాలైన ఓ మహిళను సోషల్‌మీడియా పోస్టింగ్‌ కేసులో గుంటూరు పట్టాభిపురం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ జి.స్పందన తప్పుపట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఈ కేసులో సుప్రీం మార్గదర్శకాలను పాటించలేదని మేజిస్ట్రేట్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పెట్టడమేంటి? 41ఏ నోటీసులు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. రిమాండ్‌కు పెట్టిన ఎస్సైని పిలవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిందితురాలు శివపార్వతి రిమాండ్‌ను జడ్జి తిరస్కరించారు. ఆమెను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆమె నుంచి వచ్చే నెల 6వ తేదీలోపు రూ.5వేల విలువైన రెండు బాండ్లను తీసుకోవాలని సూచించారు. గుంటూరు విజయపురి కాలనీలో నివసించే పిడికిటి శివపార్వతి అలియాస్‌ లక్ష్మీగణేష్‌ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా కార్యదర్శిగా ఉన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో వచ్చిన ఓ వీడియోను ఆమె ఫార్వర్డ్‌ చేశారు.

వైకాపా నాయకులనుంచే ఫిర్యాదు

సీఎం ఫొటోను మార్ఫింగ్‌ చేసి పెట్టారని, తమ నాయకుడి గౌరవానికి భంగం కలిగేలా వీడియోలున్నాయని, వీటిని ఫార్వర్డ్‌ చేసిన సంబంధిత మహిళపై చర్యలు తీసుకోవాలని వైకాపాకు చెందిన గుంటూరు 42వ డివిజన్‌ ఇన్‌ఛార్జి చల్లా శేషిరెడ్డి, ఆ పార్టీకే చెందిన పశ్చిమ నియోజకవర్గ సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌ రాజవరపు జగదీష్‌, షేక్‌ ఉస్మాన్‌ ఈ నెల 25న ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభిపురం పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు వేర్వేరుగా నమోదు చేసి శివపార్వతిపై 153, 502, 504, 505(2) ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి పట్టాభిపురం స్టేషన్‌కు చెందిన ఆరుగురు పోలీసులు ఇద్దరు మహిళా సిబ్బందితో సహా ఆమె ఇంటికి బుధవారం ఉదయం వెళ్లారు. తనకు ఆరోగ్యం బాగోలేదని.. తర్వాత స్టేషన్‌కు వస్తానని చెప్పగా కుదరదని రిమాండ్‌కు పెడుతున్నామని, రావాల్సిందేనని పట్టుబట్టి ఇంటి వద్దే కూర్చున్నారు. దీంతో ఆమె తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్‌కు సమాచారమిచ్చారు. వెంటనే ఆయన వచ్చి చట్టవిరుద్ధమైన అరెస్టుపై పోలీసులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో శివపార్వతి బయలుదేరి పోలీసులతో స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల విచారణలో తానే వీడియో ఫార్వర్డ్‌ చేసినట్లు అంగీకరించారు. ఆ వెంటనే ఆమెను అరెస్టు చేసి జీజీహెచ్‌కు పంపారు. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలి తరఫున తెదేపా లీగల్‌సెల్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వచ్చే నెల 2న శివపార్వతి తండ్రి పెద్ద కర్మ ఉందని, ఆ బాధలో ఉన్న ఆమెకు ఎలాంటి నోటీసులివ్వకుండా బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌ పెట్టారని వారు తెలిపారు. సోషల్‌మీడియాకు సంబంధించి గతంలో సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసి విచారించగా, తాజాగా శాంతిభద్రతల విభాగం పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు