‘తమాషాలు చేస్తున్నావ్‌.. ఎక్కరా ఎక్కు’

‘తమాషాలు చేస్తున్నాడు.. వీడిని వ్యాన్‌లోకి ఎక్కించండయ్యా. ఎక్కరా... ఎక్కు.. ఓవర్‌ యాక్షన్‌ చేయకు...’ అని కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వామపక్ష నేతపై నోరు పారేసుకున్నారు.

Updated : 28 Sep 2023 06:52 IST

వామపక్ష నాయకుడిపై డీఎస్పీ దుర్భాషలు
విద్యుత్తు ఛార్జీల పెంపుపై నిరసన చేస్తున్న నేతలపై పోలీసుల దురుసు ప్రవర్తన

కాకినాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ‘తమాషాలు చేస్తున్నాడు.. వీడిని వ్యాన్‌లోకి ఎక్కించండయ్యా. ఎక్కరా... ఎక్కు.. ఓవర్‌ యాక్షన్‌ చేయకు...’ అని కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వామపక్ష నేతపై నోరు పారేసుకున్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుపై బుధవారం వామపక్షాలు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా కాకినాడలో నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక ఇంద్రపాలెం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపి, కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు నేతలను ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించారు. సీఐ భగవాన్‌ సీపీఎం నాయకురాలు రమణిపై చేతులు వేసి, మోకాలితో నెట్టుకుంటూ పోలీసు వాహనం వద్దకు తీసుకెళ్లారు. దీనిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు లేకుండా సీఐ దుర్భాషలాడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అదే సమయంలో కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి అక్కడికి వచ్చారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీపీఎం నాయకుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావుపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ముందు వీడిని ఎక్కించండయ్యా.. తమాషాలు చేస్తున్నాడు.. అంటూ దూషిస్తూ పోలీసులకు సూచనలు చేశారు. మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని