అంతుచిక్కని రీతిలో తుపాన్ల గమనం

పెరుగుతున్న భూతాపం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు.. వాతావరణ మార్పులతో తుపాన్లు అంతుచిక్కని విధంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

Updated : 28 Sep 2023 05:48 IST

భూతాపం, వాతావరణ మార్పులే కారణం
ఇన్‌కాయిస్‌-ఏయూ అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: పెరుగుతున్న భూతాపం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు.. వాతావరణ మార్పులతో తుపాన్లు అంతుచిక్కని విధంగా మారుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. తుపాన్లు వేగంగా బలం పుంజుకోవడం, బలహీనపడే సమయంలో మళ్లీ విజృంభించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. వాటిని అంచనా వేయడంలో, నష్ట నివారణ ప్రణాళిక రూపకల్పనలో శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ తరహా మార్పులు మున్ముందు మరింతగా పెరుగుతాయని పేర్కొంది. ఈమేరకు ఇన్‌కాయిస్‌ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవాకేంద్రం), విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి.

  • పరిశోధకులు 1981-2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా మహా సముద్రాల్లో ఏర్పడ్డ తుపాన్ల సమాచారాన్ని అధ్యయనం చేశారు. ప్రపంచంలోని అన్ని తుపాన్ల సమాచారాన్ని అమెరికాకు చెందిన ఐబీ ట్రాక్స్‌ సంస్థ సేకరిస్తుంటుంది. అక్కడున్న సమాచారాన్ని విశ్లేషించి తుపాన్ల తీరుతెన్నులపై తెలుసుకున్నట్లు ప్రాజెక్టు శాస్త్రవేత్త ఎన్‌.డి.మణికంఠ తెలిపారు. ఇటీవలి కాలంలో బలహీనపడతాయనుకున్న సమయంలో తుపాన్లు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని, తీరం దాటేటప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని వివరించారు.
  • 40 ఏళ్లలో చోటుచేసుకున్న 3,800 తుపాన్లను పరిశీలిస్తే చివరి 20 సంవత్సరాల్లో క్రమం తప్పినవి 80% పెరిగినట్లు శాస్త్రవేత్త డాక్టర్‌ సుధీర్‌ జోసెఫ్‌ వెల్లడించారు. అధ్యయన ఫలితాలను మరింతగా విశ్లేషించి.. ఏఐ, ఇతర సాంకేతికతల వినియోగంతో వాతావరణ మార్పుల తీరుతెన్నులను పసిగట్టవచ్చన్నారు. తుపాన్ల మార్పులను గుర్తించడం వల్ల భవిష్యత్తు పరిశోధనలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రజలకు మరింత కచ్చిత సమాచారాన్ని అందించగలమని ఇన్‌కాయిస్‌ డైరెక్టర్‌ టి.శ్రీనివాసకుమార్‌ తెలిపారు.
  • పసిఫిక్‌ మహాసముద్రంలో తీవ్రమైన తుపాన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 మార్చిలో వచ్చిన ఫ్రెడ్డీ తుపాను 5సార్లు తగ్గిపోయి, మళ్లీ విజృంభించింది. నెలపాటు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలను ముంచెత్తింది. ఒడిశాలో 2019లో వచ్చిన ఫణి తుపాను అలాంటిదే. తీరం దాటే సమయంలో బలహీనపడినట్లు కనిపించి, మళ్లీ విజృంభించడంతో ప్రజలకు తీవ్రనష్టం వాటిల్లిందని ఇన్‌కాయిస్‌ ప్రాజెక్ట్‌ శాస్త్రవేత్త మణికంఠ వివరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని