పలాసలో పోలీసుల జులుం

గుంతలు పడిన రోడ్డును పూడుస్తున్న తెదేపా నాయకుల్ని అడ్డుకోవడమే కాకుండా, పనిలోకి వచ్చిన ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.

Updated : 28 Sep 2023 05:47 IST

గుంతలు పూడుస్తున్న తెదేపా నాయకుల అడ్డగింత
ట్రాక్టర్‌ డ్రైవర్‌పై చేయిచేసుకున్న సీఐ

పలాస, న్యూస్‌టుడే: గుంతలు పడిన రోడ్డును పూడుస్తున్న తెదేపా నాయకుల్ని అడ్డుకోవడమే కాకుండా, పనిలోకి వచ్చిన ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాశీబుగ్గ నుంచి పలాస వైపు వెళ్లే కె.టి.రోడ్డుపై గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాటిని పూడ్చేందుకు తెదేపా నాయకులు ట్రాక్టర్‌తో క్రషర్‌బుగ్గి, నీళ్ల ట్యాంకర్‌ తెప్పించారు. మాజీ ఎంపీ అప్పయ్యదొర విగ్రహ కూడలి వద్ద పనులు చేపడుతుండగా కాశీబుగ్గ ఎస్సై షేక్‌ ఖాదర్‌ బాషా అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తాయని పనులు చేయవద్దని చెప్పారు. పాలకపక్షం నాలుగేళ్లుగా రోడ్డును పట్టించుకోవడం లేదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు చేస్తున్నామని నాయకులు వివరణ ఇచ్చారు. ఇంతలో గ్రామీణ సీఐ శంకరరావు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సీఐ ఆగ్రహంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ చెంపపై కొట్టి వాహనాన్ని ముందుకు కదిలించాలని గద్దించారు. దీంతో తెదేపా నాయకులు సీఐతో వాగ్వాదానికి దిగారు. చివరకు ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను సీఐ చెంపపై కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. ‘పాలకపక్షం నాలుగేళ్లుగా కె.టి.రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయలేదు. గుంతలు పూడ్చేందుకు మా పార్టీ నాయకులు సిద్ధమైతే అడ్డుకోవడం భావ్యం కాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే పోలీసులను పంపించి అడ్డుకోవడం పాలకపక్ష నేతలకు అలవాటుగా మారింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌పై సీఐ చేయిచేసుకోవడం దారుణం’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని