తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా.. గడపదాటి తిరగబడగ రారా..

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ మాటలు... తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కి నిరసనగా ఉద్యమించాల్సిందిగా తెలుగు ప్రజలకు పిలుపునిస్తూ రూపొందించిన పాటలోనివి.

Updated : 28 Sep 2023 05:46 IST

చంద్రబాబుకు సంఘీభావంగా పాట
నిర్మాత అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో రూపకల్పన

అదిగో... అది ఉన్మాదం పాలిస్తున్న రాజ్యం..
ఖైదీలకు హోదాలొచ్చిన కాలం..
అది దుర్మార్గం శాసిస్తున్న నేల...
నియంత మరింత దిగజారిన వేళ...
ఏమిటీ అన్యాయం అని ఆలోచిస్తూ,
బాధపడుతూ ఆగిపోతే ఎలా?
తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా
గడపదాటి తిరగబడగ రారా..

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ మాటలు... తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కి నిరసనగా ఉద్యమించాల్సిందిగా తెలుగు ప్రజలకు పిలుపునిస్తూ రూపొందించిన పాటలోనివి. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌, సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో రూపొందించిన అ పాటను బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఆ పాటను ఒక వీడియోగా రూపొందించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రజా వేదిక కూల్చివేత, మద్యం దుకాణాల వద్ద టీచర్లకు డ్యూటీలు వేయడం, డా.సుధాకర్‌ తదితర దళితులు, ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలు, చంద్రబాబు అరెస్ట్‌ దృశ్యాలు, దానికి నిరసనగా ఊరూరా సాగుతున్న ప్రదర్శనల్ని ఈ వీడియోలో పొందుపరిచారు. ‘‘ఒక్కడినే అనుకుంటూ ఆగింది ఇక చాలురా... వెనుకబడితే ముందు చరిత ఎవరు రాయలేరురా.. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా... ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా .. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా...’’ అంటూ ఎవరికి వారు మన ఒక్కరి వల్లే ఏమవుతుందని ఆగిపోరాదని ఉద్బోధించారు. ‘ఒక్కరొస్తే బంధిస్తారు.. వందలొస్తే భయపెడతారు... వేలు, లక్షలుగా కదిలి, కోటి మంది తరలి వెళితే.. కూటకాల అడ్డుగోడలెంతరా... మోసకారి కేసులు గల్లంతురా..’’ అంటూ అందరూ కలసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్మకు బాలేదంటూ తప్పించుకోలేదు... అబద్ధమని తెలిసినా తప్పుగ మాట్లాడలేదు.. చట్టాన్ని గౌరవించి... న్యాయానికి విలువనిచ్చి.. చెయ్యని తప్పుకు నేడు చెరసాలకు నడిచినాడు...మన చంద్రన్న. రాక్షసరాజ్యం లక్ష్యం ఒక్కటే చంద్రన్నను బంధించి వేధించడమే...’’ అంటూ వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్‌ని తప్పించుకోవడానికి వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కర్నూలు ఆస్పత్రి వద్ద సృష్టించిన హంగామాను పరోక్షంగా ప్రస్తావించారు.

తప్పు చేయకపోయినా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి చంద్రబాబు అరెస్టయ్యారని తెలిపారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేసిన చంద్రబాబుకి, అందరూ సంఘీభావంగా నిలవాలంటూ... ‘‘మన భవితలకే బలమైనోడు... తన బలమే మనమవ్వగా వచ్చే సమయమే... తెలుగుజాతి వెలుగుబిడ్డలేరా.. గడపదాటి తిరగబడగ రారా... నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం... నాటుక పోతున్నది పాలనలో ద్వేషం... విలువలు దిగజారినవి... బూతులు చెలరేగినవి... ప్రశ్నించిన గొంతులపై ఉరితాడులు మొలిచినవి...’’ అని పిలుపునిచ్చారు. ‘‘తప్పులు చుట్టి... కేసులు పెట్టి... ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా.. పద్ధతిలేదు.. పాలనరాదు... సైకోలా మనుషులపై కక్షగట్టెరా... అందుకే తెలుగుజాతి వెలుగుబిడ్డలేరా... గడపదాటి తిరగబడగ రారా... పసుపుకుంకుమ అందుకున్న అక్కచెల్లెలందరూ... పట్టిసీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ... సాఫ్ట్‌వేర్‌ సోదరులు... సమభావన సహచరులు... అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగుజాడలు.. పిడికిలి ఎత్తి పోదాం రండి... చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి... ఆంధ్రులకు అర్థం ఆత్మగౌరవం... అని తెలిసిన అన్నగారి ఆవేశమవ్వండి..’’ అంటూ ఉత్తేజం నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని