దీక్ష పూనిన అభిమానం

అభిమాన నాయకుడి కోసం ఊరూ వాడా కదిలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్ష పూనింది. ‘సత్యమేవ జయతే’ అంటూ నినదించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో తెలుగువారున్న ప్రతిచోటా సోమవారం పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి.

Updated : 03 Oct 2023 06:31 IST

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఊరూవాడా నిరాహార దీక్షలు
గాంధీ జయంతినాడు ‘సత్యమేవ జయతే’ నినాదంతో..
రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, కాగడాలతో సంఘీభావం
దేశ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు
ఈనాడు - అమరావతి

భిమాన నాయకుడి కోసం ఊరూ వాడా కదిలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్ష పూనింది. ‘సత్యమేవ జయతే’ అంటూ నినదించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో తెలుగువారున్న ప్రతిచోటా సోమవారం పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో చేపట్టిన దీక్షలకు విశేష స్పందన లభించింది. వేల సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా నియోజకవర్గాల్లో దాదాపు అన్ని గ్రామాల్లోనూ దీక్షలు జరిగాయి. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన దీక్షకు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సహా వేల సంఖ్యలో మహిళలు హాజరై సంఘీభావం తెలిపారు. దిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దీక్ష చేశారు. పార్టీ ఎంపీలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో ఆయనతోపాటు దీక్షలో పాల్గొన్నారు. తెదేపా ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర నాయకులు ఆయా నియోజవర్గాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ తదితరులు లోకేశ్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కడపలో బలిజ సంఘాల ఆధ్వర్యంలోర్యాలీ నిర్వహించారు. జనసేన, సీపీఐ నాయకులు పలు చోట్ల మద్దతు ప్రకటించారు. విజయవాడ దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. దీక్షకు కొనసాగింపుగా సోమవారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శనలు నిర్వహించి, సంఘీభావం ప్రకటించారు. ట్విటర్‌లో ‘భువనమ్మ దీక్ష’ హ్యాష్‌ ట్యాగ్‌ టాప్‌-3లో చాలాసేపు ట్రెండింగ్‌లో నిలిచింది. 

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల దీక్ష

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు నిరాహారదీక్ష చేశారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క, నారా రోహిత్‌ తల్లి ఇందిర తదితరులు పాల్గొన్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తదితరులతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నిరాహార దీక్ష చేశారు. 

  • అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత నిరాహార దీక్ష చేశారు. మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో, కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలో దీక్షలో పాల్గొన్నారు. తాడిపత్రిలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద దీక్ష చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి.
  • మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కుటుంబసభ్యులతో కలిసి దీక్ష చేశారు.
  • గుంటూరులో తెదేపా నాయకుడు ఉయ్యూరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 రోజుల్లో సుమారు 2 వేల మంది పాల్గొన్నారు.
  • గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పెద్ద ఎత్తున వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా తెదేపా సానుభూతిపరులు రాత్రి 7 గంటల నుంచి అయిదు నిమిషాలపాటు ఇళ్లలో లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించారు.
  • ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు జరిగాయి. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో రుద్ర, నవ చండీ హోమాలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం తిరుపతిలో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని