జనహితానికే దీక్ష

నిజం గెలవాలి.. ఈ నినాదంతో ప్రజలు ముందుకు రావాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడి స్వాతంత్య్రం తీసుకురావాలి. జీవితాల్లో జ్యోతిని వెలిగించుకోవాలి. అవసరమైనప్పుడల్లా నేను ప్రజలతో ఉంటా.. పోరాడతా. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు మంచి కోసం చాలా మంది దీక్ష చేస్తున్నారు.

Updated : 03 Oct 2023 07:02 IST

నా ఆయుష్షూ పోసుకుని.. చంద్రబాబు ప్రజలకు సేవ చేయాలి
మా కుటుంబమంతటినీ జైల్లో పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన
అదే జరిగితే కార్యకర్తలైన మా బిడ్డలే తెదేపా జెండా ఎగరేస్తారు
‘సత్యమేవ జయతే దీక్ష’లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి

నిజం గెలవాలి.. ఈ నినాదంతో ప్రజలు ముందుకు రావాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడి స్వాతంత్య్రం తీసుకురావాలి. జీవితాల్లో జ్యోతిని వెలిగించుకోవాలి. అవసరమైనప్పుడల్లా నేను ప్రజలతో ఉంటా.. పోరాడతా. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు మంచి కోసం చాలా మంది దీక్ష చేస్తున్నారు. మీ అందరి ప్రేమాభిమానం.. దేవుడిచ్చిన కొండంత బలంలా మా కుటుంబానికి రక్షగా ఉంటుంది. అది ఎప్పుడూ మరిచిపోలేను. సత్యమేవ జయతే.

నారా భువనేశ్వరి

ఈనాడు- రాజమహేంద్రవరం, కాకినాడ

మా కుటుంబాన్ని అంతటినీ అరెస్టు చేసి, జైల్లో పెట్టాలనేది ప్రభుత్వం ధ్యాస అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. మమ్మలందర్నీ అరెస్టు చేసినా, మేం జైలుకెళ్లినా మా బిడ్డలైన తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండా ఎగరేసి.. పార్టీని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ భువనేశ్వరి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ‘సత్యమేవ జయతే దీక్ష’ చేపట్టారు. సత్యమేవ జయతే, అహింస నినాదాలను నమ్ముతానని.. అందుకే న్యాయం కోసం ఈ దీక్షలో కూర్చున్నానని ఆమె చెప్పారు. ఈ దీక్షలో పాల్గొన్నది చంద్రబాబు కోసం, తమ కుటుంబం కోసం కాదని.. ప్రజలందరి కోసమని ప్రకటించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి ప్రజలందరికీ చెప్పడానికే దీక్ష చేపట్టానని వెల్లడించారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు, ప్రజలను ఉద్దేశించి దీక్ష విరమణ అనంతరం భువనేశ్వరి భావోద్వేగంతో ప్రసంగించారు.

‘కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని ఒకప్పుడు నేను నా భర్తను నిలదీసేదాన్ని. ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఆయన పట్ల మీరందరూ చూపించిన అభిమానం, కష్టంలో ఉన్నప్పుడు అందిస్తున్న సహకారం చూస్తుంటే నా ఆయుష్షు కూడా పోసుకుని ఆయన మరిన్నాళ్లు బతికి.. ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘అక్టోబర్‌ 2 మహాత్మాగాంధీ పుట్టినరోజు. ఆంగ్లేయులతో పోరాడి స్వాతంత్య్రం తీసుకొచ్చిన అంతటి మహనీయుడికీ జైలుకెళ్లక తప్పలేదు. ఆయన హింస పడినా పట్టు విడవలేదు. మళ్లీ బయటకు వచ్చి ప్రజల సహకారంతో ముందుకు నడిచారు. ఆయన స్ఫూర్తితోనే దీక్ష చేపట్టాం. బహిరంగ సభల్లో, రాజకీయ సమావేశాల్లో ప్రసంగించడం నాకు అలవాటు లేదు. మీరందరూ ఉన్నారనే ధైర్యంతో మాట్లాడుతున్నా. దీక్షలో పాల్గొన్న, సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. ‘మేం నలుగురం నాలుగు దిక్కులైపోయాం. చంద్రబాబును నిర్బంధించి జైల్లో పెట్టారు. లోకేశ్‌ దిల్లీలో ఉండిపోయాడు. నేను, బ్రాహ్మణి రాజమహేంద్రవరంలో ఉండిపోయాం. మా కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కోసం తపించే మనిషి చంద్రబాబు

‘నందమూరి తారక రామారావు తెదేపాను ప్రజల కోసం నిర్మించారు. ఆయన బాటలోనే క్రమశిక్షణ, నీతి, నిజాయతీతో చంద్రబాబు, మా కుటుంబం నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్లింది. నాన్న ఎన్టీఆర్‌ మాకు నేర్పిన క్రమశిక్షణతో ఏనాడూ మా కుటుంబం అవినీతికి పాల్పడలేదని గర్వంగా చెబుతున్నా. నా తండ్రి, భర్త ముఖ్యమంత్రిగా చేసినా.. ఎప్పుడూ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదు. చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే బతికారు. ఎప్పుడూ ప్రజలకు ఏం చేద్దాం? యువతకు ఉద్యోగాలు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నదే ఆయన ఆలోచన. 25 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించి ఐటీ సిటీని అభివృద్ధి చేశారు.. బిల్‌గేట్స్‌, బిల్‌ క్లింటన్‌, టోనీ బ్లెయిర్‌ లాంటి మహామహులు చంద్రబాబుపై నమ్మకంతో హైదరాబాద్‌ వచ్చారు. ఆయన నాయకత్వంపై నమ్మకంతో హైదరాబాద్‌లో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. కఠోర దీక్షతో చంద్రబాబు రోజుకు 18, 19 గంటలు పనిచేసేవారు’ అని గుర్తు చేశారు. 

అభివృద్ధికి పదేళ్లయినా అవకాశమివ్వాలి

‘ఒక ఇల్లు కట్టాలంటే ఒకటి, రెండేళ్లయినా పడుతుంది.. అలాంటిది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎన్నేళ్లు పడుతుంది? పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన.. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పడిన కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ అమరావతి, పోలవరం గురించే ఆలోచించేవారు. అమరావతి సైబరాబాద్‌ దాటి ముందుకెళ్లాలని కలలుగనేవారు. వాటి సాకారం కోసం రాత్రీపగలు కష్టపడ్డారు. కేవలం మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అయిదేళ్లలో అయిపోతుందట అని అప్పట్లో పలువురు హేళన చేశారు. మీరు అనుకున్నది తప్పు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. డబ్బులేని రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే కనీసం పదేళ్లయినా గడువివ్వాలి. అప్పుడు మీరు అభివృద్ధి చూసేవారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండేది. రాష్ట్రానికి సంపద వచ్చేది’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు నిధుల్లేవు. గత ఎన్నికల్లో ప్రజలు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు ఉన్నది కూడా పోయింది.. మీరేం చేస్తారు? ఏం చేయగలరో చెప్పండి’ అని ఆమె ప్రశ్నించారు. దీంతో ఆహూతులు.. తెదేపాకు ఓటేస్తాం అంటూ స్పందించారు. అందరూ మళ్లీ ఆలోచించి ఓటు సరిగా వేయాలని భువనేశ్వరి కోరారు.

చేతిలో రాజ్యాంగం.. చేతల్లో సత్యాగ్రహం

మనసంతా సత్యాగ్రహ దీక్ష.. న్యాయమే గెలవాలనే ఆకాంక్ష.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఓ చేతిలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం పుస్తకంతో సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం వేదికగా నారా భువనేశ్వరి సత్యమేవ జయతే అంటూ దీక్షబూనారు. రాజమహేంద్రవరంలోని బస శిబిరం నుంచి భువనేశ్వరి కంబాలచెరువు కూడలికి సోమవారం ఉదయం 10.25 గంటలకు ముఖ్య నాయకులతో కలిసి చేరుకున్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అక్కడి నుంచి క్వారీ మార్కెట్‌ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లి గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఓ చేతిలో రాజ్యాంగం పట్టుకుని సాయంత్రం 5 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, మహిళా నాయకులు, తెదేపా నేతలు ఆమెను కలిసి సంఘీభావం తెలిపారు. సర్వమత ప్రార్థనలతో అర్చకులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించారు.


ప్రజల సొమ్ముపై ఆశ లేదు

‘మీ ప్రేమ, అభిమానం.. చంద్రబాబుపై మీకున్న నమ్మకం చూస్తే ఆనందంగా ఉంది. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఐటీ, ఇతర రంగాలవారు, ప్రజలు ముందుకొచ్చి ర్యాలీలు, దీక్షలు చేశారు. అది నేనెప్పుడూ మరిచిపోలేను. చంద్రబాబు వారి జీవితాల్లో తీసుకొచ్చిన వెలుగులతో ఆ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉన్నాయి. సంపాదించిన డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారు. కార్లు కొనుక్కున్నారు. చంద్రబాబుకు రాజకీయాల నుంచి లబ్ధిపొందాలని ఆలోచన ఎన్నడూ లేదు. హెరిటేజ్‌ సంస్థతో మా కుటుంబం సంతోషంగా ఉన్నాం. దాంతో తృప్తి పడతాం. ప్రజల సొమ్ముపై మాకు ఆశ లేదు’ అని భువనేశ్వరి చెప్పారు.


105 కుటుంబాలను కలుస్తా

చంద్రబాబును నిర్బంధించినప్పుడు 105 మంది బాధతో మృతి చెందారని, ఆ కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతానని భువనేశ్వరి ప్రకటించారు. ఎల్లప్పుడూ వారి కోసం నేనుంటానని మాటిచ్చారు. ‘మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు ఇక్కడ ఉండి ఉంటే.. మీరిచ్చే మద్దతు చూసి చాలా సంతోషించేవారు. మహిళలు చంద్రబాబు కోసం బయటకు వచ్చి పోరాడారంటే ఆయన ఉంటే రక్షణ ఉంటుందనే నమ్మకంతోనే. బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ చంద్రబాబుకు మద్దతుగా బయటకు వస్తున్నారు. పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లి అన్ని స్టేషన్లకు తిప్పి ఇబ్బంది పెడుతున్నారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని