ఉద్యమ పథం.. నిరసన స్వరం

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అంటూ నినదించారు. మరోవైపు తెదేపా నాయకులు చేపట్టిన దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి.

Updated : 03 Oct 2023 04:53 IST

న్యూస్‌టుడే బృందం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అంటూ నినదించారు. మరోవైపు తెదేపా నాయకులు చేపట్టిన దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. కొందరు వినూత్న నిరసనలతో ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జరిగిన నిరసన దీక్షల్లో తెదేపా ఆదోని ఐటీడీపీ కార్యదర్శి శివ.. గాంధీ వేషధారణలో నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శిబిరంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు రక్తంతో సంతకాలు చేసి చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.తమిళనాడులోని తచ్చూరులో  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హేమలత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు వంటి మచ్చలేని నాయకుడిపై తప్పుడు కేసులు బనాయించిన సీఎం జగన్‌కి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.


మోకాళ్లపై 2 కిలోమీటర్ల యాత్ర

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన తెదేపా అభిమాని మందాడి రవి మోకాళ్లపై రెండు కిలోమీటర్ల దూరం యాత్ర చేసి న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ ఆరాచకాలకు అంతే లేకుండా పోతోందని ఆవేదన వెలిబుచ్చారు.


బాబుకు మద్దతుగా సైకిల్‌ యాత్ర 

రణస్థలం, న్యూస్‌టుడే: చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని.. బయటకు రావాలని కోరుతూ గాంధీ జయంతి రోజున నారువ గ్రామం నుంచి అయిదుగురు తెదేపా కార్యకర్తలు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. తెదేపా గ్రామ అధ్యక్షుడు ఎన్‌.రామకృష్ణ ఆధ్వర్యంలో సీహెచ్‌ రామసూరి, ఎన్‌.ఆదినారాయణ, ఎన్‌.సుందరరావు, ఎస్‌.రమేశ్‌లు ఈ యాత్ర చేస్తున్నారు. 


ఆహ్వాన పత్రికపై బాబుతో నేను

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: విశాఖ ఎస్‌.ఎస్‌.ఎన్‌.నగర్‌కు చెందిన తెదేపా కార్యకర్త శ్రీనివాసరావు కుమార్తె ఓణీల వేడుక ఈనెల 8న జరగనుండగా.. ఈ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలపై ‘బాబుతో నేను’ అని ముద్రించిన స్టిక్కర్లు అతికించి బంధు, మిత్రులను ఆహ్వానిస్తున్నారు. శ్రీనివాసరావు నివాసంలో జరిగిన పసుపు, మంగళస్నానం కార్యక్రమంలో కూడా కుటుంబ సభ్యులంతా బాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబుపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన చంద్రబాబును ఈ పరిస్థితిలో చూడటం బాధగా ఉంది... అందుకే నా ఇంట్లో జరిగే వేడుకకు నేను పిలిచే కుటుంబాలకు అయినా నా బాధను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని