రాష్ట్ర పరిస్థితి చూసి సిగ్గుపడాలా? జాలిపడాలా?

చూడడానికి వాళ్లు బుడతలే. కానీ వారి ప్రతి పలుకు ఆలోచింపజేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ జగన్‌ అరాచక పాలనను ఎండగడుతూ నాయకులకు దీటుగా ప్రసంగిస్తూ చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు.

Updated : 03 Oct 2023 08:52 IST

‘సత్యమేవ జయతే దీక్ష’లో చిచ్చర పిడుగుల గర్జన

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: చూడడానికి వాళ్లు బుడతలే. కానీ వారి ప్రతి పలుకు ఆలోచింపజేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ జగన్‌ అరాచక పాలనను ఎండగడుతూ నాయకులకు దీటుగా ప్రసంగిస్తూ చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన దీక్షలో పలువురు చిన్నారులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓ ముస్లిం బాలిక చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని వేదికపై ప్రార్థించగా మరికొందరు చిన్నారులు తమ వాగ్ధాటితో కట్టిపడేశారు.

రాజధాని లేని, నేరస్థులు పాలిస్తున్న రాష్ట్రం

ధర్మం తప్పని రాముడికి అరణ్యవాసం. అవినీతి చేయని చంద్రుడికి జైలు వాసం. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడాలా? సిగ్గుపడాలా? జాలిపడాలా? అంటూ రాజమహేంద్రవరానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి ఎ.పార్థు ప్రశ్నించాడు. దీక్షా వేదికపై నుంచి వేల మందిని ఉద్దేశించి మాట్లాడాడు. ‘దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. నేరస్థులు పాలిస్తున్న రాష్ట్రం.. ముద్దాయిలు మంత్రులైన రాష్ట్రం.. ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చుచేసే రాష్ట్రం.. చట్టసభల్లో బూతులు మాట్లాడే రాష్ట్రం.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే రాష్ట్రం దేవుడి డబ్బులు ఖర్చుచేసి తల నీలాలు అమ్ముకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి, భజన చేసే వారికి మంత్రి పదవులు ఇచ్చిన రాష్ట్రం.. పరిపాలన గాలికి వదిలేసి సినిమా టికెట్లు, చేపలు, మాంసం అమ్ముకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 2024 ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం మీరంతా కృషి చేస్తే అది మా లాంటి వేల మంది పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సైకిల్‌ గుర్తుకు ఓటేసి. తెదేపాను గెలిపించండి’ అని పార్థు తన ప్రసంగాన్ని ముగించాడు.

ఆకట్టుకున్న ప్రసంగం

గూడూరుకు చెందిన బాలుడు అనిత్‌ మాట్లాడుతూ.. ‘అయిదు కోట్ల ఆంధ్రులకు బాసటగా ఉన్న చంద్రబాబును సైకో జగన్‌ అరెస్టు చేయించారు. తెలుగు ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ముందుచూపుతో ఆలోచించిన పార్టీ తెదేపా. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు. యువగళంతో ఒంటికి అలుపు, కంటికి నిద్ర లేకుండా భార్యాబిడ్డలను చూడకుండా, కాళ్ల నొప్పులు వచ్చినా వెరవకుండా పోరాడుతున్న తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నకు అభినందనలు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం. నేను చంద్ర తాతయ్యతో కలిసి ప్రజలకు సేవచేస్తా. మనం గెలుద్దాం. మనం అభివృద్ధి చెందుదాం. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు అరికట్టాలంటే చంద్రన్న రాజ్యం రావాలి’ అంటూ అనిత్‌ పిలుపునిచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు