పిఠాపురంలో ఓట్ల తొలగింపునకు కుట్ర

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పలువురి ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందనే ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి.

Updated : 03 Oct 2023 03:41 IST

నియోజకవర్గంలో 862 ఫారం-7ల సమర్పణ

పిఠాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పలువురి ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందనే ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. ఒక వ్యక్తి 5 ఓట్లకు మించి తొలగింపునకు దరఖాస్తు పెట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ నియోజకవర్గంలో దాదాపు 12,500 ఓట్ల తొలగింపునకు 862 మంది ఇచ్చిన దరఖాస్తులను బీఎల్‌వోలు స్వీకరించారు. గతంలో పిఠాపురం మున్సిపాలిటీలో బూత్‌ నంబరు 125, డోర్‌ నంబరు 1-2-63లో ఒకే ఇంటి నంబరుపై 448 ఓట్లున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టినా అధికారులు వివరాలు వెల్లడించలేదు. గ్రామాన్ని విడిచి ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నవారి ఓట్ల తొలగింపునకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా సెప్టెంబరు 11 నుంచి 23 మధ్య జరగ్గా 862 మంది ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌వర్మ ఈ విషయాన్ని ఓటరు నమోదు అధికారి సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు.

వివరాలు ఇవిగో..

  • పిఠాపురం మండలం విరవ గ్రామంలోని 102 బూత్‌లో 88 ఓట్ల తొలగింపునకు గాంధీ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు.
  • కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని 213 బూత్‌లో 40 ఓట్లను తీసివేయాలని ఫారం-7ను పి.మంగరాజు సమర్పించారు.
  • పిఠాపురం పట్టణంలోని 160వ బూత్‌లో 29 ఓట్ల తొలగింపు కోరుతూ వై.వీరలక్ష్మి ఫిర్యాదు చేశారు.
  • గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 37, 40 బూత్‌లతో దేవుడబ్బాయి 37, సుందర్‌ అనేవారు 30 ఓట్ల తొలగింపు కోరుతూ అధికారులకు దరఖాస్తులు అందించారు.

ఎవరూ ఫిర్యాదు చేయలేదు..: ‘ఫారం-7 ద్వారా 5 ఓట్ల కంటే ఎక్కువ తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ప్రతి మంగళవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారి అభ్యంతరాలపై చర్చిస్తున్నాం. ఫారం-7ల పరిశీలన ఇంకా పెండింగ్‌లో ఉంది. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం’ అని పిఠాపురం ఓటరు నమోదు అధికారి సుబ్బారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని