ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు దగా

ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులుగా విలీనం చేశారు..ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకూ అన్ని ప్రయోజనాలు దక్కుతాయని ఆశలు పెట్టుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ సర్కారు చుక్కలు చూపిస్తోంది.

Updated : 03 Oct 2023 07:04 IST

ప్రభుత్వంలో విలీనం.. పలు ప్రయోజనాలు  వర్తింపచేయకుండా సతాయింపు  
మూడున్నరేళ్లు దాటినా  పింఛనుపై స్పష్టత లేదు
క్రమశిక్షణ చర్యలపై అప్పీలుకు  అవకాశమేదీ..?
సమస్యల పరిష్కారంలో  సీఎం జగన్‌ నిర్లక్ష్యం
ఈనాడు - అమరావతి

ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులుగా విలీనం చేశారు..ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకూ అన్ని ప్రయోజనాలు దక్కుతాయని ఆశలు పెట్టుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ సర్కారు చుక్కలు చూపిస్తోంది. విలీన ప్రక్రియ జరిగి మూడున్నరేళ్లు దాటినా ఇంకా అనేక అంశాలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తీరుతో గతంలో ఆర్టీసీలో ఉండే అనేక ప్రయోజనాలు ఆగిపోగా, ప్రస్తుతం సర్కారు నుంచి దక్కాల్సినవన్నీ అందడం లేదు. గతంలో ఆర్టీసీ యాజమాన్యంతో గట్టిగా మాట్లాడి ఆయా ప్రయోజనాలు దక్కేలా ఉద్యోగులు, వాటి సంఘాల నేతలు చూసేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తామేమీ చేయలేమని, ప్రభుత్వం వద్ద సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటూ యాజమాన్యం చేతులెత్తేస్తోంది. పరిష్కారం కాని సమస్యలపై సీఎం జగన్‌కు, ఆ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ తదితరులకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రతి వారం లేఖలు రాస్తూనే ఉన్నారు. వినతులూ ఇస్తున్నారు. వీటిని జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఆర్టీసీలోని 51 వేల మంది ఉద్యోగులు 2020, జనవరి ఒకటి నుంచి పీటీడీ ఉద్యోగులుగా మారారు. ఇప్పటికీ వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తిస్థాయిలో అన్ని ప్రయోజనాలు దక్కడం లేదు. ప్రతి అంశంపై ప్రభుత్వం ఏదో విధంగా కొర్రీలు వేసి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలుకానుండగా.. ఇప్పటికీ విలీన అంశాలు పరిష్కారం కాకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.

భత్యాలు ఇవ్వకుండా  దోబూచులాట

విధులకు హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు డేఅవుట్‌, నైట్‌అవుట్‌ వంటి భత్యాలు ఉంటాయి. గత ఏడాది ఆగస్టు వరకు వీరి జీతాలు ఆర్టీసీ విధానం ప్రకారం ప్రభుత్వం ఇచ్చేది. గత సెప్టెంబరు నుంచి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశారు. అప్పటి నుంచి భత్యాల్లో సందిగ్ధత నెలకొంది. ఓవర్‌ టైం (ఓటీ) డ్యూటీ చేసిన వారికి ప్రతినెలా భత్యం ఇవ్వకుండా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నిత్యం మూడు వేల నైట్‌ సర్వీసుల్లో విధులకు హాజరయ్యే డ్రైవర్‌, కండక్టర్లకు నైట్‌ అవుట్‌ భత్యం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో నైట్‌అవుట్‌ లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో ఈ భత్యం కింద రోజుకు రూ.90, ప్రభుత్వంలో అయితే రూ.400-600 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీరికి ఏదీ అందడం లేదు.

గోడు ఎవరికి చెప్పాలి?

ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. వారు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయింది. సాధారణంగా తొలగింపు కేసుల్లో సంబంధిత ఉద్యోగి, సీనియర్‌ స్కేల్‌ అధికారికి, తర్వాత రీజనల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం), చివరగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) వద్ద మూడు అంచెల్లో అప్పీలు చేసుకునేవారు. తొలగింపేతర కేసుల్లో సీనియర్‌ స్కేల్‌ అధికారి, తర్వాత ఆర్‌ఎం వద్ద రెండు అంచెల్లో అప్పీలు చేసుకొని తమ గోడు వివరించి ఉపశమనం పొందేవారు. అయితే ఇప్పుడు అన్నింటికీ జిల్లా ప్రజా రవాణా అధికారి, ఈడీ వద్ద రెండు అంచెల్లో మాత్రమే అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కానీ తుది ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో వందలాది అప్పీల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏ పింఛను ఇస్తారో తెలీదు?

ఆర్టీసీలో ఉన్నప్పుడు పదవీ విరమణ చేసిన 32 వేల మంది ఉద్యోగులకు నెలకు సగటున రూ.3-5 వేల వరకే ఈపీఎఫ్‌ పింఛను వస్తోంది. విలీనం తర్వాత సర్వీసులో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పింఛను వస్తుందని ఆశలు పెట్టుకున్నా..ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌-95, భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్‌), ప్రభుత్వ ఉద్యోగుల పాత పింఛను, కొత్తగా అమలు చేస్తామంటున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)లో ఏది వర్తిస్తుందో తెలియదు. ఈపీఎఫ్‌లో హయ్యర్‌ పింఛన్‌కు ఆప్షన్‌ పెట్టుకున్న ఉద్యోగులు భారీ మొత్తం చెల్లించాలంటూ నోటీసులు వస్తున్నాయి. అయితే ఎంత పింఛను వస్తుందో అందులో పేర్కొనడం లేదు. మొత్తంగా పింఛను విషయంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈహెచ్‌ఎస్‌తో వైద్యం వద్దు మహాప్రభో..

ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు అధికం. వీరు ఆర్టీసీలో ఉన్నప్పుడు డిస్పెన్సరీల్లో వైద్యంతో పాటు రెఫరల్‌ ఆసుపత్రుల్లో ఖర్చంతా ఆర్టీసీయే భరించేది. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) ద్వారా సరైన వైద్యం అందడం లేదని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. తమకు పాత విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆర్టీసీలో రిటైర్‌ అయిన ఉద్యోగులకు చివరి చెల్లింపుల్లో కొంత మొత్తం మినహాయించేవారు. దీంతో ఆ ఉద్యోగి దంపతులకు ఆర్టీసీ డిస్పెన్సరీల్లో ఉచిత వైద్యంతో పాటు ఏటా ఇద్దరికీ చెరో రూ.2 లక్షల వరకు రెఫరల్‌ ఆసుపత్రుల్లో వ్యయాన్ని ఆర్టీసీ భరిస్తోంది. ప్రభుత్వంలో విలీనమయ్యాక పదవీ విరమణ చెందినవారి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరికి డిస్పెన్సరీల్లో వైద్యం అందించడం లేదు. అలాగే ప్రభుత్వం తరఫున పింఛను లేకపోవడంతో ఈహెచ్‌ఎస్‌ కార్డులు ఉండటం లేదు. దీంతో సొంత డబ్బులు వెచ్చించి ఆర్థికంగా నష్టపోతున్నారు.

పథకాలు రద్దు చేసినా సొమ్ములివ్వలేదు

ఆర్టీసీలో 1989 నుంచి సిబ్బంది పదవీ విరమణ ప్రయోజన పథకం (ఎస్‌ఆర్‌బీఎస్‌) ఉండేది. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత రికవరీ చేసి దానికి యాజమాన్య వాటా జతచేసే వారు. పదవీ విరమణ తర్వాత నెలకు రూ.3,200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు. ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి సగం మొత్తం అందించే వారు. విలీనం తర్వాత సర్వీసులో ఉన్నవారికి ఈ పథకం వర్తించదని నిలిపేశారు. అయితే ఉద్యోగుల నుంచి గతంలో రికవరీ చేసిన మొత్తాన్ని అందరికీ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఎవరు ముందుగా పదవీ విరమణ చేయనున్నారో వారికే సెటిల్‌ చేస్తున్నారు.

ఉద్యోగులకు స్టాఫ్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ (ఎస్‌బీటీ) పథకం ఉండేది. దీనికి ఉద్యోగి జీతం నుంచి ప్రతినెలా కొంత రికవరీ చేసేవారు. సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి రూ.లక్షన్నరతో పాటు అప్పటి వరకు ఈ పథకానికి రికవరీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా అందించేవారు. ఒకవేళ ఉద్యోగి పదవీ విరమణ చెెందితే వడ్డీతో సహా మొత్తం ఇచ్చేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక 55 ఏళ్లలోపు వారికి ఎస్‌బీటీ నిలిపేసి ఏపీజీఎల్‌ఐసీ (ప్రభుత్వ బీమా) వర్తింపజేశారు. అయితే వారి నుంచి అంతవరకు రికవరీ చేసిన మొత్తాన్ని అందరికీ ఇవ్వడం లేదు.

తొలి నెల బకాయిల ఊసేలేదు..

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ గత ఏడాది సెప్టెంబరు నుంచి అమల్లోకి వచ్చినప్పుడు నెట్‌ జీతం మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. జీతాల నుంచి మినహాయించిన కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) రుణ రికవరీ, పీఎఫ్‌ వాటా తదితరాల గ్రాస్‌ మొత్తాన్ని విడుదల చేయలేదు. ఇలా ఇవ్వాల్సిన మొత్తం రూ.100 కోట్ల వరకు ఉంటుంది.దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉలుకూపలుకూ లేదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు