గ్రామ సచివాలయంలో పింఛన్‌ సొమ్ము హాంఫట్‌

గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన పింఛన్ల సొమ్ములో రూ.50 వేలు హాంఫట్‌ అయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

Published : 03 Oct 2023 04:04 IST

వైకాపా నాయకుడి సమక్షంలో తెగిన పంచాయితీ

ఈనాడు, కర్నూలు: గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన పింఛన్ల సొమ్ములో రూ.50 వేలు హాంఫట్‌ అయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామ సచివాలయానికి చెందిన సంక్షేమ సహాయకురాలు మండల కేంద్రం నుంచి సోమవారం పింఛన్‌ సొమ్ము తెచ్చి సచివాలయంలో ఉంచారు. కాసేపటి తర్వాత చూడగా అందులో రూ.50 వేలు తగ్గాయి. దీంతో అక్కడున్న ఏడుగురు వాలంటీర్లను ప్రశ్నించగా తమకేమీ తెలియదని వారు సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఆ ఉద్యోగి తీసుకెళ్లారు. తగ్గిన సొమ్మును సర్దుబాటు చేసేందుకు ఒక్కో లబ్ధిదారుకూ రూ.100 తగ్గిద్దామని వాలంటీర్లలో కొందరు సలహా ఇవ్వగా కార్యదర్శి అందుకు ఒప్పుకోలేదు. చేసేదిలేక ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయం మండల వైకాపా నాయకుడి వద్దకు వెళ్లడంతో ఆయన వారిని పిలిపించారు. పార్టీ పరువు పోతుందని చెప్పి వాలంటీర్లను హెచ్చరించారు. అనంతరం వాళ్లలో వాళ్లు సర్దుబాటు చేసుకుని సొమ్ము జమ చేసేలా పంచాయితీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వాలంటీర్లను ఇక ఎలా నమ్మాలంటూ గ్రామస్థులు    ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు నోరు మెదపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని