వాట్సప్‌లో ప్రశ్నపత్రాలు.. బోర్డుపై ప్రశ్నలు

పాఠశాల స్థాయి పరీక్షల్లో ఎన్నో మార్పులు చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. విద్యార్థులకు కనీసం ప్రశ్నపత్రాన్ని ముద్రించి ఇవ్వలేకపోతోంది.

Published : 03 Oct 2023 09:21 IST

నేటి నుంచి ఫార్మెటివ్‌-2 పరీక్షలు
ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులివ్వని ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: పాఠశాల స్థాయి పరీక్షల్లో ఎన్నో మార్పులు చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. విద్యార్థులకు కనీసం ప్రశ్నపత్రాన్ని ముద్రించి ఇవ్వలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3 (మంగళవారం) నుంచి 6వ తేదీ వరకు ఫార్మెటివ్‌-2 పరీక్షలను నిర్వహించనుండగా వీటి ప్రశ్నపత్రాలను వాట్సప్‌ల్లో పంపిస్తామంటూ ఎస్‌సీఈఆర్టీ ఆదేశాలు ఇచ్చింది. పరీక్షకు ముందు రోజు రాత్రి ప్రశ్నపత్రాలు జిల్లా అధికారులకు పంపిస్తారు. అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయుడికి చేరతాయి. ఇలా వాట్సప్‌ల్లో పంపిస్తున్న సమయంలో అవి బయటకు వచ్చేస్తున్నాయి. గతేడాది ఇలానే నిర్వహించిన పరీక్షల్లో అన్ని ప్రశ్నపత్రాలు లీక్‌య్యాయి. దీంతో ఈ పరీక్షలు తూతూమంత్రంగా మారుతున్నాయన్న అభిప్రాయం నెలకొంది.

ఉపాధ్యాయులకు ఇబ్బందులు

ఆంగ్లం, హిందీ సబ్జెక్టుల్లో ఉండే ప్యాసేజ్‌లు, గణితం, సామాన్య శాస్త్రంలో ఉండే బొమ్మలను బోర్డుపై ఎలా రాయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. బోర్డు మీద వీటన్నింటినీ రాయడానికే 45 నిమిషాల సమయం పడుతోందని.. ఇక పరీక్షలు ఎలా నిర్వహించాలని వాపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను సొంత డబ్బులతో జిరాక్స్‌ తీసి, పిల్లలకు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు పాఠశాలల నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులే జిరాక్స్‌ వ్యయం భరించాల్సి వస్తోంది. 

సెల్‌ఫోన్‌లో టోఫెల్‌..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల సబ్జెక్టులో రెండో పేపర్‌గా టోఫెల్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పీ) ఉన్న చోట ఆడియోలను ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. ఐఎఫ్‌పీలు లేని చోట ఉపాధ్యాయుల సెల్‌ఫోన్లకు వాట్సప్‌లో ఆడియోలు పంపిస్తున్నారు. వీరు సెల్‌ఫోన్‌లోనే ఆడియోలు వినిపించి పరీక్ష పెట్టాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఐఎఫ్‌పీలు అవసరం కాగా 50 శాతం లోపు బడుల్లోనే ఇవి ఉన్నాయి. ఈ పరీక్షకు 10 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు. ఈ సమయంలో ఏ కారణం చేతనైనా సెల్‌ఫోన్‌ ఆడియో వినబడకపోతే విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు సిలబస్‌ ఇవ్వకపోవడం గమనార్హం.


ప్రశ్నపత్రాలను ముద్రించి ఇవ్వాలి

నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌

ఈనాడు, అమరావతి: రెండో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌లో ప్రశ్నలను పరీక్షకు గంట ముందు బోర్డుమీద రాయడం ప్రయాసతో కూడుకున్నదని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి బదులు ప్రశ్నపత్రాలను డీసీబీఈల ద్వారా ముద్రించి ఇవ్వాలని కోరారు. పరీక్ష పత్రం 10 నిమిషాల ముందు ఉపాధ్యాయులకు వాట్సప్‌లో పంపడం అన్నది మాస్‌కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వడమేనని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని