Supreme Court: హైకోర్టులో సమర్పించిన ఆ దస్త్రాలన్నీ ఇవ్వండి

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

Updated : 04 Oct 2023 06:54 IST

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
2018లోనే విచారణ ప్రారంభమైనట్లు చెప్పే డాక్యుమెంట్లకు సంబంధించిన చర్చ హైకోర్టు తీర్పులో లేదు
దానిపై స్పష్టత కావాలన్న న్యాయమూర్తులు
17ఎ సెక్షన్‌ వచ్చాకే ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని ఏకీభవించిన ధర్మాసనం
తదుపరి విచారణ 9కి వాయిదా
ఈనాడు - దిల్లీ

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలన్నింటినీ సమర్పించాలని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో 2018లో 17ఎ సెక్షన్‌ అమల్లోకి రాక ముందే విచారణ ప్రారంభమైందని, అందుకు సంబంధించి ఏసీబీ డీజీ మెమో జారీ చేశారని చెబుతూ హైకోర్టులో డాక్యుమెంట్‌ దాఖలు చేశారా? అది కీలకం కాబట్టి దాంతోపాటు, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మొత్తం డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు 17ఎ సెక్షన్‌ అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందన్న వాదనతో ఏకీభవించారు.

మంగళవారం విచారణ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ 2021 డిసెంబర్‌ 9న నమోదైందని, అందువల్ల ఇందులో అంతకు ముందే విచారణ ప్రారంభమైందని హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొనడం తప్పన్నారు. 2021 సెప్టెంబర్‌ 7న అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌కు అందిన లేఖ ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి మోసపూరితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారని, అయితే అధికారంలో ఉన్నవారి కక్ష సాధింపు నుంచి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడానికి పార్లమెంటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 17ఎ ని చేర్చిందని చెప్పారు. దాని ప్రకారం అధికార విధుల నిర్వహణలో భాగంగా పబ్లిక్‌ సర్వెంట్లు చేసిన సిఫార్సులు, నిర్ణయాలపై అధీకృత వ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారీ విచారణ కానీ, దర్యాప్తు కానీ ప్రారంభించడానికి వీల్లేదన్నారు.

నేరం ఎప్పుడు జరిగినా దానిపై విచారణ చేపట్టేటప్పుడు మాత్రం ముందస్తు అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదన్నారు. ఇది అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడానికి అవసరమైన ప్రొసీజర్‌ అని, అందువల్ల ఇది నేర విచారణ తేదీతో ముడిపడిన అంశమే తప్ప నేరం జరిగిన తేదీకి సంబంధించింది కాదన్నారు. అందువల్ల 2018 జులైకి ముందు జరిగిన నేరాలకు 17ఎ వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం తప్పన్నారు. రిమాండ్‌ రిపోర్టులో పిటిషనర్‌కు వ్యతిరేకంగా పేజీల కొద్దీ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అయితే అందులో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలేనన్నారు. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ జోక్యం చేసుకుంటూ ఎప్పుడు విచారణ ప్రారంభమైందో అప్పుడే 17ఎ వర్తిసుందా అని అడగ్గా హరీష్‌ సాల్వే అవునని బదులిచ్చారు. నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికే ఆ సెక్షన్‌ను చట్టంలో చేర్చినట్లు ధర్మాసనానికి విన్నవించారు. అందువల్ల నేరం ఎప్పుడు జరిగిందన్నదాంతో సంబంధం లేదన్నారు.

తర్వాత చంద్రబాబు తరఫున మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదిస్తూ ఫిర్యాదులను వడపోయడానికే చట్టంలో ఈ సెక్షన్‌ను పెట్టినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో ఇచ్చిన యశ్వంత్‌ సిన్హా జడ్జిమెంట్‌ తీర్పులోని పేరా 118లో ఈ విషయం ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా కూడా ఆ కేసుకు సంబంధించిన విషయాలను కోర్టు దృష్టికి తేవడానికి ప్రయత్నించారు.

రఫేల్‌ కేసులో భాగంగా చట్ట సవరణ

తర్వాత హరీష్‌ సాల్వే వాదనలు కొనసాగిస్తూ రఫేల్‌ కేసులో ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో రద్దు చేసుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే 2018లో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి 17ఎ ని చేర్చారని, అందువల్ల అంతకు ముందు తీసుకున్న నిర్ణయాలపైనా అధీకృత వ్యవస్థ అనుమతి లేకుండా విచారణ చేయడం కానీ, దర్యాప్తు చేపట్టడం కానీ కుదరదని సుప్రీంకోర్టు యశ్వంత్‌ సిన్హా కేసు తీర్పులో చెప్పిందని గుర్తు చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తి తప్పని స్పష్టమవుతుందన్నారు. ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగిందని ఆరోపిస్తున్నారని, ఎఫ్‌ఐఆర్‌ ఎప్పుడు నమోదు చేశారని జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించారు. 2015, 2016ల్లో నేరం జరిగిందంటున్నారని, 2021 డిసెంబర్‌ 9న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని సాల్వే బదులిచ్చారు.

జస్టిస్‌ త్రివేది జోక్యం చేసుకుంటూ 17ఎ అవినీతి నిరోధక చట్టంలోని కేసులకు వర్తిస్తుందంటున్నారు కదా? అలాంటప్పుడు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల సంగతేంటని ప్రశ్నించారు. అన్ని నేరాలకూ అది వర్తిస్తుందని సాల్వే బదులిచ్చారు. జస్టిస్‌ బోస్‌ జోక్యం చేసుకుంటూ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఏ నేరాన్నీ ముందస్తు అనుమతి లేకుండా పోలీసు అధికారి విచారించకూడదని మాత్రమే ఆ సెక్షన్‌ చెబుతోంది కదా అని ప్రశ్నించారు. న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం పిటిషనర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతున్నందున, తమపై పెట్టిన కేసులన్నీ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తాయన్నారు. ఇక్కడ రిమాండ్‌ రిపోర్టు ప్రత్యేక కోర్టు ముందే సమర్పించారని, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైనందునే ప్రత్యేక కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకొని రిమాండ్‌కు పంపినట్లు అభిషేక్‌ సింఘ్వీ చెప్పారు. సదరు న్యాయాధికారి ఇచ్చిన తీర్పులో ఇది మంత్రివర్గ నిర్ణయమని పేర్కొన్నారని చెప్పారు.

జస్టిస్‌ త్రివేది స్పందిస్తూ తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదన్నారు. తాము కూడా మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని, ఇక్కడ పిటిషనర్‌పై తన అధికార విధుల నిర్వహణకు సంబంధించిన విషయంలో కేసు పెట్టిన విషయాన్ని మాత్రమే చెబుతున్నామని సింఘ్వీ బదులిచ్చారు. అక్కడ న్యాయమూర్తి 17ఎ సెక్షన్‌ పాత తేదీలకు వర్తించదని చెప్పారని, కానీ వర్తిస్తుందని తాము వాదిస్తున్నామన్నారు. ఆ సెక్షన్‌ వచ్చిన మూడేళ్ల తర్వాతే ఈ కేసులో అన్ని రకాల విచారణలు, దర్యాప్తులు ప్రారంభమయ్యాయని.. పైగా ఈ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విచారించినందున ఇది అవినీతి కేసు కిందికే వస్తుందని చెప్పారు. ఇది కేబినెట్‌ తీసుకున్న నిర్ణయమని న్యాయమూర్తికి తెలుసన్నారు. దాని ప్రకారం ఇది అధికార విధుల నిర్వహణ కిందికి వస్తుందని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. జస్టిస్‌ బోస్‌ స్పందిస్తూ ఇప్పటి వరకు చూసిన వివరాల ప్రకారం సెక్షన్‌ 17ఎ అమల్లోకి వచ్చిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని అంగీకరిస్తున్నామని, అయితే ఐపీసీ నేరాలకు అందులో మినహాయింపులు ఇవ్వలేదు కదా అని వ్యాఖ్యానించారు.

సింఘ్వీ బదులిస్తూ ఈరోజు పోలీసులు తమకు అధికారం లేని చోట విచారణ చేపడుతున్నారన్న విషయాన్నే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఐపీసీ కేసుల సంగతేంటన్నది తర్వాత తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, ప్రత్యేక కోర్టు దానిపై విచారించడం, రిమాండ్‌ ఆర్డర్‌ జారీ చేయడం చట్టబద్ధంగా జరగలేదన్నారు. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారికి మాత్రమే 17ఎ వర్తించదన్నారు. ట్రాప్‌ కేసు మినహాయించి మిగిలిన అన్ని అవినీతి కేసుల విచారణకూ అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని ఆ సెక్షన్‌ చెబుతోందన్నారు. విధాన రూపకర్తలు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు కేసులు పెట్టి వేధించరాదన్న ఉద్దేశంతో పార్లమెంటు 17ఎ ని చేర్చిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అందువల్ల అది పాత తేదీలకూ వర్తిస్తుందన్నారు.

పిటిషనర్‌ 2015 నుంచి 2019 మధ్యకాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు జీవోలు, నోట్‌ఫైల్స్‌, సాక్షుల వాంగ్మూలాలను బట్టి తెలుస్తోందని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారని,  2018లోనే 17ఎ సెక్షన్‌ వచ్చినందున, ఆ తర్వాత ఏడాది (2019)లోగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ కేసులో ఉన్నట్లు వారి రిమాండ్‌ రిపోర్టే చెబుతోందని గుర్తుచేశారు. 2018 జులై 26న పార్లమెంటు 17ఎ సెక్షన్‌ను చేర్చిందని, దాని ప్రకారం అధికార హోదాతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికీ రక్షణ ఉందని చెప్పారు. లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇప్పుడు పిటిషనర్‌పై ఒకటి తర్వాత ఒకటిగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నందున ఇది కక్ష సాధింపు అన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. మరో రెండు కేసులు ఇప్పటికే సిద్ధం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

17ఎ ప్రశ్నే ఉత్పన్నం కాదు: ముకుల్‌ రోహత్గీ

తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 17ఎ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసులో 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ విచారణ మాత్రం 17ఎ సెక్షన్‌ రాక ముందే ప్రారంభమైందని, అందువల్ల ఈ సెక్షన్‌ వర్తించదన్నారు. ఈ సెక్షన్‌ రాకముందే విచారణ ప్రారంభమైందని ఎక్కడుందని జస్టిస్‌ త్రివేది ప్రశ్నించగా.. హైకోర్టు తీర్పులో ఉందని రోహత్గీ బదులిచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులకు వ్యతిరేకంగా 2018 జూన్‌ 5న ఏసీబీ డైరెక్టర్‌ మెమో జారీ చేసి, సాధారణ విచారణ ప్రారంభించమని ఆదేశించారని, దానిపై సీబీఐ విచారణ జరపాలని లేఖ రాసినట్లు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తమ దృష్టికి తెచ్చినట్లు హైకోర్టు తీర్పులో పేర్కొందన్నారు. అది ఎలాంటి విచారణో తమకెలా తెలుస్తుందని జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని రోహత్గీ బదులిచ్చారు. హైకోర్టు తీర్పు ప్రకారం 17ఎ అన్నది ఇక్కడ వర్తించదని, అందువల్ల దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనాన్ని ప్రశ్నించారు.

జస్టిస్‌ త్రివేది జోక్యం చేసుకుంటూ 2018లోనే విచారణ ప్రారంభమైందని మీరు చెప్పిన లేఖలు, డాక్యుమెంట్లు హైకోర్టు రికార్డులో ఎక్కడున్నాయని ప్రశ్నించగా తమ వద్ద ఉన్నాయని రోహత్గీ బదులిచ్చారు. సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇప్పుడు చెబుతున్న డాక్యుమెంట్లను వారు ట్రయల్‌ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ సమర్పించలేదన్నారు. హైకోర్టులో వాదనలన్నీ పూర్తయిన తర్వాత న్యాయమూర్తికి దాన్ని అప్పగించారని చెబుతూ ఆ ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ స్పందిస్తూ మీరు హైకోర్టు ముందు దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నింటినీ సోమవారంలోపు ఇక్కడ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అంగీకరించారు. దానిపై అవసరమైతే తాము కౌంటర్‌ దాఖలు చేస్తామని లూథ్రా చెప్పారు. దాంతో ధర్మాసనం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


ఎంతమంది వాదిస్తున్నారు..

విచారణ సందర్భంగా జస్టిస్‌ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకుంటూ చంద్రబాబునాయుడు తరఫున ఎంత మంది సీనియర్‌ అడ్వొకేట్లు వాదిస్తున్నారని ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకుంటూ ఒకేసారి ముగ్గురు న్యాయవాదులు వాదిస్తున్నారు.. ఒకరు చెబుతుంటే, మరొకరు పేపర్లు చూపుతున్నారు అని అన్నారు. మేం ముగ్గురం ఒక ఎత్తు, రోహత్గీ ఒక్కరే ఒక ఎత్తు అని హరీష్‌ సాల్వే నవ్వుతూ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు