‘జగన్‌ మాట..’ కొల్లేటి పాలు!

జగన్‌ అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నరేళ్లుగా కొల్లేరు ఉప్పునీటి సమస్య పరిష్కారానికి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వైకాపా హయాంలో రాష్ట్ర సర్కారు అప్పుల ఊబిలో చిక్కుకుంది.

Updated : 20 Nov 2023 10:28 IST

ఉప్పు ముప్పు తప్పిస్తానన్న హామీ నెరవేర్చని వైనం
వైకాపా సర్కారు బిల్లులు చెల్లించడంలేదని ముందుకు రాని గుత్తేదారులు
టెండర్లు పిలిచినా స్పందించని తీరు
ఈనాడు, అమరావతి

కొల్లేరు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ఉప్పునీటితో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తా.

2018 మే 12న కైకలూరులో ప్రజా సంకల్ప యాత్ర సభలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన మాట.

కొల్లేరులో రెగ్యులేటర్లు నిర్మించాలని ప్రజలు గతంలో విజ్ఞప్తి చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతోంది. జూన్‌లో శంకుస్థాపన చేస్తాను.

2022 మే 16న ఏలూరు జిల్లా గణపవరంలో రైతుభరోసా పెట్టుబడి సాయం జమ సభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ హామీ.

జగన్‌ అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నరేళ్లుగా కొల్లేరు ఉప్పునీటి సమస్య పరిష్కారానికి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వైకాపా హయాంలో రాష్ట్ర సర్కారు అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఎవరూ స్పందించలేదు. దీంతో జగన్‌ హామీ కొల్లేటి పాలయింది.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరుకు ఉప్పునీరు పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆ ముప్పును తప్పించుకునేందుకు ప్రతిపాదించిందే రెగ్యులేటర్ల నిర్మాణం. దాదాపు 77,138 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు మంచి నీటి సరస్సు ఇప్పుడు కాలుష్య కాసారంగా, ఉప్పునీటి మయంగా మారిపోయింది. సముద్రంలో నుంచి ఉప్పునీరు ఉప్పుటేరు ద్వారా ఎగదన్నుతూ ఏకంగా కొల్లేరు వరకు చేరుతోంది. అది అనేక సమస్యలను సృష్టిస్తోంది.

ఎందుకీ ఉప్పునీరు?

కృష్ణా, గోదావరి నదుల మధ్య కొల్లేరు సహజ మంచినీటి సరస్సు. అనేక వాగులు, వంకలు దీనిలో చేరతాయి. వర్షాకాలంలో, వరద సమయంలో ఆ నీరంతా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుతుంది. కానీ కొల్లేరు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు విస్తరించడం..  వానలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఉప్పుటేరులోకి వరద ప్రవాహం ఉండటం లేదు. ఆ సమయంలో సముద్ర ఆటుపోటులతో ఉప్పునీరు వెనకకు ఎగదన్నుతోంది. ఆ నీరు ఏకంగా 54 కిలోమీటర్లకు పైగా ఉప్పుటేరులో ప్రవహించి కొల్లేరుకు చేరుతోంది.

రైతులు, మత్స్యకారులకూ నష్టమే

సముద్రం నుంచి ఉప్పునీరు వెనకకు ఎగదన్నడంతో ఉప్పుటేరుకు రెండు వైపులా ఉన్న పంటపొలాలు చౌడుబారిపోతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉప్పుటేరును ఆనుకుని చేపట్టిన ఆక్వా సాగుకు సైతం నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉప్పుటేరు ఆధారంగా వేలాది మత్స్యకార కుటుంబాలు చేపలు పట్టుకుంటూ జీవించేవి. ఉప్పునీరు ఎగదన్నడంతో చేపలు బతకడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఉప్పుటేరుపై మూడు చోట్ల రెగ్యులేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. సముద్రంలో ఉప్పునీరు ఎగదన్నకుండా అదే సమయంలో వానాకాలం కొల్లేరు నీరు సముద్రంలో కలిసేందుకు ఇబ్బందులు లేకుండా వీటిని ప్రతిపాదించారు. జలవనరుల శాఖ రూ.412 కోట్లతో 2022 ఫిబ్రవరిలో ఈ పనులకు పాలనామోదం ఇచ్చింది. ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.87 కోట్లు, మొగల్తూరు మండలం పడతడిక వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ కం బ్రిడ్జి నిర్మాణానికి రూ.136.60 కోట్లు, అదే మండలం మొల్లపర్రు వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌, వంతెనల నిర్మాణానికి రూ.188.40 కోట్లతో నిధులు మంజూరు చేసింది. కృత్తివెన్ను మండలం నిడమర్రు వద్ద పెదలంక మేజర్‌ డ్రెయిన్‌పై అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌, రెండు వరుసల వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. రెండు సార్లు జలవనరులశాఖ టెండర్లు పిలిచినా గుత్తేదారులు స్పందించలేదు. దీంతో మళ్లీ రూ.468 కోట్లకు ప్రతిపాదనలు అంచనాలు సవరించి ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటికీ తదుపరి అడుగులు పడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని