Rushikonda: రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.433 కోట్లు

విశాఖపట్నంలో రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాటిని బయటపెట్టింది.

Updated : 20 Nov 2023 09:55 IST

విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు
ఖర్చెంతో చెప్పకుండా.. ఇన్నాళ్లూ గోప్యత పాటించిన ప్రభుత్వం
న్యాయసమీక్ష తప్పించుకునేందుకు.. చిన్న పనులుగా విభజించి కేటాయింపు
అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు పనుల అప్పగింత

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాటిని బయటపెట్టింది. ఏకంగా రూ.433 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టింది. అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టింది. రుషికొండ పునర్‌ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి తొలుత రూ.350.16 కోట్లు కేటాయించింది. తర్వాత వాటికి అదనపు కేటాయింపులు చేసింది. కళింగ, వేంగి, గజపతి, విజయనగర బ్లాకుల పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు. జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచడానికి అభ్యంతరమేంటని హైకోర్టు తలంటడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నిశాఖల జీవోలను ఏపీ గెజిట్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయ భవనాలకు కేటాయింపు, ఖర్చు తదితర జీవోలు బయటకొచ్చాయి. రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం రాత్రి ఒకేసారి 10 జీవోలను ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసింది. అధికశాతం పనులను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి కేటాయించారు. రూ.100 కోట్లు దాటితే.. న్యాయసమీక్షకు వెళ్తామన్న ఉత్తర్వులను తామే ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా పనులు చేయించారు. తొలుత ఇవి పర్యాటక భవనాలంటూ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పింది. తర్వాత ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి.. సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమంటూ నివేదిక తెప్పించుకుంది.

మూడు దశల్లో పనులు.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు

రుషికొండ పునర్‌ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతోనే ప్రభుత్వం అక్కడ పనులకు శ్రీకారం చుట్టింది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు దశలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా తొలిదశ పనులకు రూ.92 కోట్లు కేటాయించగా.. తర్వాత వాటిని రూ.159 కోట్లకు పెంచారు. రెండోదశ పనులకు రూ.94.49 కోట్లు ఖర్చుచేశారు. మూడోదశలో రూ.112.76 కోట్లు ఖర్చు చూపారు. రహదారులు, తాగునీటి సరఫరా, విద్యుత్తు, మురుగునీటి పారుదల తదితర పనులకు రూ.46 కోట్ల వరకు ఖర్చుపెట్టడం గమనార్హం. ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులకే రూ.21.83 కోట్లు వెచ్చించారు. మూడోదశ పనులకు రూ.77.86 కోట్ల అంచనాతో టెండర్‌ పిలిచారు. 16.46% అధిక ధరలకు... అంటే రూ.90.68 కోట్లకు పనులు అప్పగించడం గమనార్హం.

వేడిని తట్టుకునేలా

గోడలకు ఇంటర్‌లాకింగ్‌ రాఫ్టర్స్‌, వేడిని, నీటిని తట్టుకునేలా 18 ఎంఎం మందంతో కూడిన ప్లైవుడ్‌, వేడి, బ్యాక్టీరియా, నీరు, రసాయనాలకు దెబ్బతినకుండా ఉండేలా 3, 9 మి.మీ. మందంతో లామినేటెడ్‌ ప్యానెల్స్‌తో పాటు పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశ్రాంతి  తీసుకునేందుకు వీలుగా ఆధునికమైన 138 సింగిల్‌  సీటర్‌ సోఫాలు, టూ సీటర్‌ సోఫాలు 42, త్రీ సీటర్‌ సోఫాలు 25, ఎగ్జిక్యూటివ్‌ కుర్చీలు 721, టేబుల్స్‌ 205, పడకలు 20 ఏర్పాటుచేయాలని తెలిపారు. ఫర్నిచర్‌కే రూ.14 కోట్లకు పైగా ఖర్చుపెట్టడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని