నిప్పుల్లా నిత్యావసరాలు!

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే.. నిత్యావసరాల ధరలు సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయి. బియ్యం 32%, కందిపప్పు 107%, ఉల్లి 287% పెరిగాయి. ఇతర పప్పుధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం తదితర సరకులతో పాటు చిరుధాన్యాలదీ అదేదారి.

Updated : 20 Nov 2023 07:22 IST

వైకాపా పాలనలో సగటున 50% ధరల పెరుగుదల
పైపైకి ఎగబాకుతున్న బియ్యం, పప్పులు.. చిరుధాన్యాలదీ అదే దారి
ప్రతినెలా అదనపు మోతతో సామాన్య కుటుంబాల విలవిల
కరవుతో తగ్గనున్న దిగుబడులు.. ధరలు మరింత పెరిగే అవకాశం
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే.. నిత్యావసరాల ధరలు సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయి. బియ్యం 32%, కందిపప్పు 107%, ఉల్లి 287% పెరిగాయి. ఇతర పప్పుధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం తదితర సరకులతో పాటు చిరుధాన్యాలదీ అదేదారి. వీటికితోడు విద్యుత్తు బిల్లులు, వంటగ్యాస్‌, పాలు.. ఇతరత్రా బాదుడు భరించలేకున్నామని నిరుపేదలు వాపోతున్నారు. అయిదేళ్ల కిందటితో పోలిస్తే బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరకుల రూపంలోనే నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చవుతోందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వీటికి నెలకు రూ.3 వేలు ఖర్చు చేసిన కుటుంబం ఇప్పుడు రూ.4,500 వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఇలా ఒక్కో ఇంటిపై సగటున నెలకు రూ.1,200 వేసుకున్నా.. 54 నెలల జగన్‌ పాలనా కాలంలో సరకుల రూపంలో రూ.65 వేల అదనపు భారం పడింది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులూ భారీగా తగ్గనున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబరు నుంచి మొదలైన పెరుగుదల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతేడాది జులై వరకు కిలో రూ.50 వరకు ఉన్న సన్నబియ్యం ధర క్రమంగా పెరుగుతూ ఇప్పుడు సగటున రూ.60 దాటింది. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో సన్నబియ్యం ధరలు రూ.65 నుంచి రూ.67 వరకు పలుకుతున్నాయి. కొన్నిచోట్ల సాధారణ రకం బియ్యమే కిలో రూ.50 కిపైగా అమ్మకం చేస్తున్నారు. దీంతో నెలకు 25 కిలోలు వినియోగించే కుటుంబంపై రూ.250 పైగా భారం పడుతోంది. అంటే ఏడాదికి రూ.3 వేల చొప్పున వంటింటి ఖర్చు పెరిగింది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదీ ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్‌ ఆయకట్టులో సన్న రకాల ధాన్యం సాగు భారీగా తగ్గింది. దీంతో వాటి ధర మరింత పెరుగుతుందన్న అభిప్రాయం మిల్లర్లలో వ్యక్తమవుతోంది. గోధుమపిండి ధర సైతం కిలో రూ.45 నుంచి రూ.55 వరకు ఎగబాకింది.

పప్పులు, పల్లీలు కొనగలమా?

కందిపప్పు ధరలూ ఈ ఏడాది జనవరి నుంచి ఉడుకుతున్నాయి. గత 11 నెలల్లో కిలోపై సగటున రూ.80కిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.180 నుంచి  రూ.190 మధ్య కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో కిలో  రూ.200 పైనే ఉంది. సగటున కుటుంబానికి నెలకు కిలో వినియోగం చొప్పున చూసినా.. ఏడాదికి     రూ.1200 మేర భారం పడుతోంది. మినపగుళ్ల ధర కూడా కిలో రూ.130 పైగా ఉంది. పల్లీలు (వేరుశనగ గుళ్లు) కిలో రూ.160 నుంచి రూ.180 పైగా పలుకుతున్నాయి. వేరుశనగ నూనె లీటరు రూ.170 పైనే ఉంది. రాష్ట్రంలో వేరుశనగ సాగు తగ్గిపోవడంతో పాటు కరవు నేపథ్యంలో దిగుబడులు క్షీణించాయి.

కిలో రూ.60 పైనే ఉల్లి

ఉల్లి ఉత్పత్తి పడిపోవడంతో ధరలు ఆకాశానికేసి చూస్తున్నాయి. ఎగుమతులపై ఆంక్షలు, నాఫెడ్‌   ద్వారా మార్కెట్లోకి నిల్వలు విడుదల నేపథ్యంలో  పెరుగుదల ఆగినా.. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో కిలో రూ.62 నుంచి రూ.70 మధ్య ఉంది. చింతపండు ధర కూడా కిలోకు రూ.35 పైనే పెరిగింది. అయిదేళ్ల కిందటితో పోలిస్తే.. పంచదార ధర కిలోకు రూ.7, బెల్లం రూ.12 చొప్పున పెరిగాయి.

చిరుధాన్యాల ధరలూ పెరిగాయ్‌..

ఆరోగ్యంపై శ్రద్ధతో చిరుధాన్యాల వినియోగం పెరుగుతోంది. వాటి ధరలూ అదే దారిలో నడుస్తున్నాయి. గతంలో పచ్చజొన్నల ధర కిలో రూ.60 ఉండగా.. ఇప్పుడు రూ.100 నుంచి రూ.110 వరకు పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ పంట దెబ్బతింది. తెల్లజొన్న ధర కూడా కిలో రూ.65 వరకు చేరింది. కొర్రలు, సామలు తదితర చిరుధాన్యాలు కిలో రూ.120 నుంచి రూ.160 మధ్య అమ్ముడవుతున్నాయి.  రెండేళ్ల కిందటితో పోలిస్తే ఇవి కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగాయి.


రేషన్‌ దుకాణాల్ని ఖాళీ చేసి

వైకాపా హయాంలో రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్పితే.. మరేమీ దొరకని దుస్థితి నెలకొంది. కార్డుదారులకు కనీసం కిలో చొప్పున కూడా కందిపప్పు పంపిణీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. గోధుమపిండి, చిరుధాన్యాలు ఇస్తున్నామంటున్నా.. కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. కనీసం పేదలనైనా ఆదుకుందామన్న ధ్యాసే కొరవడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని