కొండను తవ్వి ఎలుకను పట్టారు!

ఎసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్‌ కాకి లెక్కలు చెబుతున్నారు. 27.14 లక్షల ఎకరాలకు సంబంధించి 15.21 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఇటీవల నూజివీడులో సీఎం ఆర్భాటంగా ప్రకటించారు.

Updated : 21 Nov 2023 08:40 IST
17 లక్షల ఎకరాల  ఎసైన్డ్‌ భూములు ఫట్‌
రికార్డుల్లోని అనుభవదారుల పేర్లు గల్లంతు
పెద్దల చేతుల్లోకి వెళ్లిన వైనం..

ఈనాడు-అమరావతి: ఎసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్‌ కాకి లెక్కలు చెబుతున్నారు. 27.14 లక్షల ఎకరాలకు సంబంధించి 15.21 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఇటీవల నూజివీడులో సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అర్హులను గుర్తించబోగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అయింది. తాజా లెక్కల ప్రకారం.. 10.58 లక్షల ఎకరాల భూములకు మాత్రమే అర్హులు ఉన్నారు. మిగిలిన దాదాపు 17 లక్షల ఎకరాల భూముల వివరాలు కనిపించడంలేదు. అసలు 11.61 లక్షల ఎకరాలు ఎసైన్డ్‌ కేటగిరిలోనే లేవు. చాలా భూములను రెవెన్యూ సిబ్బందిని మభ్యపెట్టి.. ఆన్‌లైన్‌లో మార్పులు చేయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే 6.18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డుల్లో అనుభవదారు లేదా వారసుల పేర్లు లేవు. మరో 30 వేల ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల పరిధిలో ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఘనంగా పేర్కొన్నట్లు 15.21 లక్షలమందికి బదులు కనీసం ఐదారు లక్షలమందికైనా యాజమాన్య హక్కులు లభిస్తాయా.. అనేది సందిగ్ధమే. ఎసైన్డ్‌ భూములు పొంది 20 ఏళ్లు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గత ఆగస్టు నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సుమారు 27.14 లక్షల ఎకరాల వరకు పంపిణీ జరిగిందని, అర్హులు 15.21 లక్షల మంది ఉంటారని అంచనా వేయగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలా జిల్లాల్లో కేటాయింపులు జరిగిన దానికంటే అర్హులు తక్కువగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లోనైతే మండలాలవారీగా అర్హులైన లబ్ధిదారులు లేనేలేరు.

వందల ఎకరాలే ఉన్నాయి

విశాఖ జిల్లాలో 3,037కు 666, గుంటూరు జిల్లాలో 6,518కు 648 ఎకరాలను మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, ఉమ్మడి కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్‌ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి చేరాయి. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని గిరిజనుల్లో 50% మంది లబ్ధిదారుల వద్దే ప్రస్తుతం భూమి ఉంది. అడవుల సమీపంలో, సాగుకు పనికిరాని భూములు మాత్రమే అనుభవదారుల చేతుల్లో ఉన్నాయి. చాలాచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు కాలక్రమేణా పెరిగాయి. దీంతో అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాల్లోని ఎసైన్డ్‌ భూములు 70% వరకు అనధికారికంగా చేతులు మారాయి. పరాధీనమైన భూముల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. మరోవైపు.. ఈ పథకం కింద అర్హుల సంఖ్య పెంచేందుకు ఉన్న మార్గాల గురించి సమాలోచనలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని