బడా గుత్తేదారుల్లో ప్రభుత్వం!

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యం సాగుతోంది. ఇక్కడ ఏ నియమ నిబంధనలకూ దిక్కులేదు. నిర్దేశిత ఆర్థిక విధానాలకు తావు లేదు. ఆర్థిక సంఘం నిబంధనలూ పట్టించుకోదు. కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరాలనూ లెక్క చేయదు.

Updated : 21 Nov 2023 13:57 IST
పెద్ద సంస్థలకే రూ.వేల కోట్ల చెల్లింపులు
చిన్న, సామాన్య గుత్తేదారులకు అష్టకష్టాలు
రూ.1.80 లక్షల కోట్ల బిల్లుల పెండింగ్‌
43 మంది చిన్న కాంట్రాక్టర్ల ఆత్మహత్య
మంత్రులు, నేతల కంపెనీలకే దాసోహం
సీఎం సన్నిహిత కంపెనీ మేఘాకు భారీగా లబ్ధి  
ఆందోళన బాటలో చిన్న గుత్తేదారులు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యం సాగుతోంది. ఇక్కడ ఏ నియమ నిబంధనలకూ దిక్కులేదు. నిర్దేశిత ఆర్థిక విధానాలకు తావు లేదు. ఆర్థిక సంఘం నిబంధనలూ పట్టించుకోదు. కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరాలనూ లెక్క చేయదు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ సలహాలన్నా లెక్కలేదు. గతంలో నిర్దేశించుకున్న సంప్రదాయాలూ పాటించదు. అధినేత ప్రాపకం పొందితే ఏదైనా సాధ్యమే. ఆయన నిర్దేశిస్తారు. అధికారులు పాటిస్తారు. అవసరమైతే చట్టాలను మార్చేస్తారు. అవి నిబంధనలకు లోబడి ఉన్నాయా లేవా అనేది తేలేసరికి ఏళ్ల సమయం పడుతుంది. ఈలోగా మేం చక్కబెట్టేసుకుంటాం.. ఇదీ రాష్ట్రంలో వైకాపా పాలన!

అన్నొచ్చాడు.. అన్నీ మార్చేశాడు. సామాన్యుల బతుకులు తలకిందులు చేసేశాడు. రాజకీయ పెత్తందారులకు, బడాబాబులకే ఇక్కడ ప్రయోజనాలు దక్కుతాయి. ఏళ్ల తరబడి బిల్లులు అందక వేల మంది గుత్తేదారుల బతుకులు దుర్భరమైపోయినా మేఘా వంటి పెద్ద సంస్థలకే జగన్‌ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి మరీ వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజకీయ అండదండలున్న 5 బడా సంస్థలకు రూ.2,650 కోట్ల వరకు బిల్లులు చెల్లించింది. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే. ఈ నాలుగేళ్లలో ఇలాంటి పెద్దలకు చెల్లించిన మొత్తంలో సగం నిధులు చిన్న గుత్తేదారులకు చెల్లించినా సగం మంది బిల్లులు క్లియర్‌ అయ్యేవని అంచనా.

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 43 మంది చిన్న, మధ్య తరగతి గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బ్రాయ్‌) రాష్ట్ర శాఖ ప్రకటించింది. వేల మంది చిన్న గుత్తేదారులు బిల్లులు అందక విలవిల్లాడుతోంటే జగన్‌ ప్రభుత్వం ఫిఫో (ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌) నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికే చెల్లిస్తోంది. అమాత్యుల కంపెనీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువుల కంపెనీలకు, అధినేత సన్నిహిత కంపెనీలకే సొమ్ము అందుతోంది. తాజాగా మేఘా కంపెనీకి కొత్త తరహాలో ప్రయోజనం కల్పించేందుకూ సిద్ధమైంది. ఆ కంపెనీ పెండింగ్‌ బిల్లులకు ప్రభుత్వం గ్యారంటీలు అందిస్తోంది. ఆ బిల్లులు ఎప్పటిలోగా చెల్లించబోయేదీ సంబంధిత శాఖల కార్యదర్శులు గ్యారంటీ పత్రాలు ఇస్తున్నారు. వాటి ఆధారంగా మేఘా కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటోంది. ప్రభుత్వం సొమ్ము ఖాతాలో జమ చేశాక వడ్డీతో కలిపి ఆ బ్యాంకులు  జమ చేసుకుంటాయి. రాష్ట్రంలో వేల మంది కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లుల కారణంగా.. అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నా వారి సంగతి గాలికొదిలేసి ఇలా బడా గుత్తేదారుల ప్రయోజనాలకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. సెప్టెంబరులో వరుస క్రమం తప్పి దాదాపు రూ.650 కోట్లు బడా రాజకీయ గుత్తేదారులకు చెల్లించింది. ఇవి కాకుండా రాయలసీమ ఎత్తిపోతలలో రూ.739 కోట్లు, తాజాగా బిల్లు డిస్కౌంటింగ్‌ విధానంలో దాదాపు రూ.1300 కోట్లు మేఘా కంపెనీకి చెల్లిస్తోంది.

నాలుగేళ్లలో భారీగా పెండింగ్‌

రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా సామాన్య గుత్తేదారులకు, సరఫరాదారులకు బిల్లులు సరిగా చెల్లించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు సంబంధించి దాదాపు రూ.20 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పీడీ ఖాతాలకు సంబంధించినవి మరో రూ. 30 వేల కోట్ల వరకు పెండింగ్‌ ఉన్నాయని సమాచారం. ఇవన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానివి మాత్రమే. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో దాదాపు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు బిల్లులు ల్యాప్స్‌ చేసింది. వాటిని తదుపరి బడ్జెట్‌కు బదిలీ చేయలేదు. దీంతో ఆ నాలుగేళ్లలో ఎంత చెల్లించిందో అధికారికంగా లెక్కలు ఉండడం లేదు. ఆయా శాఖల ఉన్నతాధికారులూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. నాలుగేళ్లూ కలిపితే బకాయిల మొత్తం రూ.1.80 లక్షల కోట్ల పైనే ఉంటుందని అంచనా.

సమర్థ విధానాలను వదిలేసి..

బిల్లుల చెల్లింపులకు గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను రూపొందించారు. బడ్జెట్‌ మంజూరు, అందుబాటు, బిల్లుల స్వీకరణ, చెల్లింపుల విషయాలు శాఖలన్నింటికీ తెలిసేవి. చెల్లింపులకు ఫిఫో విధానం అమలు చేసేవారు. కచ్చితంగా వరుస క్రమంలోనే చెల్లింపులు సాగేవి. వరుస తప్పితే అందుకు కారణాలను కచ్చితంగా నమోదు చేయాల్సి ఉండేది. జలవనరుల శాఖ బిల్లుల చెల్లింపులకు మరో ఫిఫో వ్యవస్థ ఉండేది. ఉల్లంఘనకు తావుండేది కాదు. వైకాపా ప్రభుత్వంలో ఇదంతా దారి తప్పి అనుయాయులకే చెల్లించే వ్యవస్థ మొదలైంది. అనేక సందర్భాల్లో చిన్న గుత్తేదారులు, చిన్న బిల్లులను పక్కన పెట్టేసి బడా రాజకీయ గుత్తేదారులకు వరుస క్రమం తప్పి మరీ రూ.వేల కోట్ల మొత్తాల చెల్లించడమూ వివాదమైంది. అలాంటి సందర్భాల్లో పీఎల్‌ఆర్‌, డీఎస్‌ఆర్‌, వీఏఆర్‌కేఎస్‌, ఎంఆర్‌కేఆర్‌ వంటి కంపెనీలే ప్రయోజనం పొందాయి.


మేఘాకు అందలం

ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహిత కంపెనీగా పేరున్న మేఘా సంస్థ అనేక ప్రయోజనాలు పొందుతోంది. పోలవరం ప్రాజెక్టులో టెండరు దాఖలు చేసిన ఒకే ఒక్క సంస్థగా ఉండి కూడా ఆ పనులు దక్కించుకోగలిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పనులు చేయకుండానే మేఘా జాయింట్‌ వెంచర్‌ కంపెనీలకు రూ.739 కోట్లు చెల్లించేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈ పనులను నిలిపివేసినా, ఇప్పట్లో ప్రారంభించే ఆస్కారం లేకపోయినా ఆ సంస్థ పనుల కోసం తీసుకువచ్చిన మెటీరియల్‌కు సొమ్ము చెల్లించేశారు. అంతేకాదు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ల నుంచి రుణం తీసుకుని ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు రప్పించకుండా నేరుగా గుత్తేదారుకు చెల్లించేయడం విశేషం. ఇప్పుడు తాజాగా పెండింగ్‌ బిల్లులకు మేఘా కంపెనీ ప్రభుత్వం నుంచి గ్యారంటీలు పొందుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు