Chandrababu: స్కిల్‌ కేసులో సీఐడీ వాదనకు ఆధారాల్లేవు

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయన తెదేపా ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది.

Updated : 21 Nov 2023 13:55 IST
స్పష్టం చేసిన హైకోర్టు
చంద్రబాబుకు బెయిలు
తెదేపా ఖాతాలకు నిధులు మళ్లించినట్లు తేలలేదు  
నేరంలో ఆయన పాత్ర ఉన్నట్లు కనిపించట్లేదు
సీఐడీ ఎలాంటి ఆధారాలూ చూపలేకపోవడం దర్యాప్తు లోపంగా భావిస్తున్నాం
జస్టిస్‌ మల్లికార్జునరావు వ్యాఖ్యలు
బెయిలు పిటిషన్‌పై తీర్పు
ఈనాడు - అమరావతి
పార్టీ ఖాతాకు చంద్రబాబు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని.. ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేం. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నాం.
చంద్రబాబుకు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత ఆయనను నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోంది. అంతేకాక ఆయనను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోంది.
అక్రమ లావాదేవీల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సీఐడీ వాదిస్తున్నప్పటికీ ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. సహ నిందితులను, సాక్షులు, తెదేపా పార్టీ సభ్యులను బాబు పరోక్షంగా ప్రభావితం చేశారన్న సీఐడీ వాదనకు సైతం ఆధారాలు లేవు.
జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదు. సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదు. 73 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు
హైకోర్టు వ్యాఖ్యలు
నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు(Chandrababu) హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయన తెదేపా ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు తెదేపా ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ (సీఐడీ) వద్ద ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. రూ.370 కోట్ల నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించి, ఆ సొమ్మును నగదు రూపంలో చంద్రబాబు ఉపసంహరించుకున్నారనే వాదనకు బలం చేకూరేలా సీఐడీ సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచలేదని పేర్కొంది. చంద్రబాబుకు బెయిలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న సీఐడీ వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో ఇతర నిందితులందరూ బెయిలుపై ఉన్నారని గుర్తుచేస్తూ.. చంద్రబాబుకు బెయిలు మంజూరు చేసింది. అక్టోబరు 31న మధ్యంతర బెయిలు మంజూరు సందర్భంగా ర్యాలీల నిర్వహణ, రాజకీయ సమావేశాల్లో పాల్గొనకుండా విధించిన షరతులను ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు పేర్కొంది. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు సోమవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. స్కిల్‌ కేసులో బెయిలు పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో  చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అందులోని ముఖ్యాంశాలివి..

2.13 లక్షల మంది శిక్షణ పొందినట్లు ఇదే కోర్టు గుర్తించింది

‘ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంలో విఫలమయ్యాయని సీఐడీ రూఢీగా చెప్పలేకపోతోంది. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిలు మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధ్రువపత్రాలు అందజేసినట్లు, శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించింది. హవాలా మార్గంలో నిధుల మళ్లింపునకు సీమెన్స్‌ సంస్థ ఎండీ సుమన్‌ బోస్‌, డిజైన్‌టెక్‌ సీఎండీ ఖన్వేల్కర్‌ మధ్య 2014 డిసెంబరు 31 నుంచి 2016 జనవరి వరకు వాట్సప్‌ సందేశాల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారు. వాస్తవానికి స్కిల్‌ కేసులో ఒప్పందం 2017 జూన్‌ 30న జరిగింది. 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సప్‌ మెసేజ్‌లకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధముందనే విషయంలో ప్రాసిక్యూషన్‌ వద్ద సమాధానం లేదు. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లకు, చంద్రబాబుకు ఏం సంబంధం? ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్‌ల ఆధారంగా నిర్ణయించలేమని సీఐడీయే చెబుతోంది.

ఒప్పందంలో చంద్రబాబు భాగస్వామే కాదు

శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికపై ఆధారపడి సీఐడీ వాదనలు వినిపిస్తోంది. తమ వద్ద దస్త్రాలు లేవని ఏపీఎస్‌ఎస్‌డీసీ చెబుతున్నదానికి భిన్నంగా ఆ సంస్థ తమకు పలు దస్త్రాలు అందజేసిందని శరత్‌ అసోసియేట్స్‌ నివేదిక పేర్కొంది. మరోవైపు ఎంఓయూ (ఒప్పందం) ఎక్కడ జరిగిందనే విషయంలోనూ సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలు చెబుతున్నదానికి విరుద్ధంగా ఫొరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ఉంది. ఒప్పందంలో తేదీని ప్రస్తావించకపోవడానికి అందులో భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏ విధంగా సంబంధం ఉందో ప్రాసిక్యూషన్‌ వివరణ ఇవ్వాలి. ఒప్పందంలో బ్యాంక్‌ గ్యారంటీ క్లాజ్‌ను చంద్రబాబు సూచనతో తొలగించారని ఆడిట్‌ రిపోర్టులో పేర్కొన్నారే కానీ ఏ సాక్షి ఆ విషయాన్ని చెప్పారనే విషయాన్ని సీఐడీ కోర్టు ముందు ఉంచలేదు.

ఆ వ్యత్యాసాలకు బాధ్యుణ్ని చేయడానికి వీల్లేదు

ఎంఓయూలో సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ పేరును సుమన్‌ బోస్‌గా పేర్కొన్నారని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని, సంతకాల్లో తేడా ఉందని ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలన్నింటికి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా బాధ్యులవుతారనే విషయంపై సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయా సంతకాల్లో వచ్చిన తేడాలను పరిశీలించి, పోల్చి చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కాదు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కనుగొన్న వ్యత్యాసాలకు ఆయనను బాధ్యుణ్ని చేయడానికి వీల్లేదు.

అధికారులు గుజరాత్‌లో పరిశీలించారు కదా?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను ఏపీ ఆర్థికశాఖ అప్పటి కార్యదర్శి కె.సునీత, అధికారుల బృదం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అక్కడ ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా ఉందని, ఏపీలోనూ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచస్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందుతారని తెలిపింది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతాలో ఉన్న రూ.270 కోట్లను వెంటనే విడుదల చేయాలని నివేదిక ఇచ్చిన విషయంలో ఎలాంటి వివాదం లేదు. ఆర్థికశాఖ కార్యదర్శి సునీత, అధికారుల బృందం సరైన నివేదిక ఇవ్వలేదని సీఐడీ ఎలాంటి ఆరోపణ చేయడం లేదు. 2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశం. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.241 కోట్ల నిధులను సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ వాదిస్తోంది. నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడేదేనా అని పిటిషనర్‌ ప్రశ్నిస్తున్నారు. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్‌ సైతం చెప్పడం లేదు.

ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేం

ఆర్థికశాఖ కార్యదర్శి నిధుల విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు.. నిధులు విడుదల చేయాలని ఆదేశించే అధికారం ముఖ్యమంత్రికి లేదనేది సీఐడీ చెప్పడం లేదు. చంద్రబాబుకు లేదా ఆయన పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా, శిక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేం. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న ఆయన తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో చోటుచేసుకున్న తప్పులను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు ఆధారాలు సైతం లేవు.

సీఐడీ వాదనకు ఆధారాల్లేవు

క్రమ లావాదేవీల్లో పిటిషనర్‌ పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సీఐడీ వాదిస్తున్నప్పటికి ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. సహ నిందితులను, సాక్షులు, తెదేపా పార్టీ సభ్యులను పిటిషనర్‌ పరోక్షంగా ప్రభావితం చేశారన్న సీఐడీ వాదనకు సైతం ఆధారాలు లేవు. పిటిషనర్‌ పూర్వ పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ సీఐడీ ముందు హాజరుకాకపోవడానికి, కిలారు రాజేష్‌ జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడానికి పిటిషనర్‌కు బెయిలు మంజూరు చేసే విషయానికి సంబంధమే లేదు. పిటిషనర్‌ మధ్యంతర బెయిలు షరతులు ఉల్లంఘించినట్లు బేగంపేట పోలీసులు నమోదు చేసిన కేసులో కనిపించడం లేదు.
22 నెలల తర్వాత నిందితుడిగా చేర్చారు
మంగళగిరి సీఐడీ డీఎస్పీకి సుజయత్‌ ఖాన్‌, ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు సీమెన్స్‌ ఇండియా ఎండీ మాథ్యు థామస్‌లు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే చంద్రబాబుకు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత పిటిషనర్‌ పేరును నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోంది. అంతేకాక పిటిషనర్‌ను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఈ 22 నెలల్లో పిటిషనర్‌ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.  
బాబు తప్ప అందరూ బెయిలు పొందారు
చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిలు లేదా ముందస్తు బెయిలుపై రిలీజ్‌ అయ్యారు. 2021లో కేసు నమోదు అనంతరం 140మందికి పైగా సాక్షులను సీఐడీ విచారించింది, 4 వేలకు పైగా దస్త్రాలను సేకరించింది. దర్యాప్తు తుది దశలో ఉంది. జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్‌ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదు. సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదు. 73 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిలు ఇప్పటికే మంజూరు చేశాం. అక్టోబరు 31న మధ్యంతర బెయిలు మంజూరు సమయంలో సీఐడీ అభ్యర్థన మేరకు.. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పొల్గొనవద్దని షరతు విధించాం. ప్రధాన బెయిలు పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో అలాంటి షరతులు విధించడం చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుంది. కనుక ఆ షరతును ఈ నెల 29 నుంచి సడలిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబరు 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పూర్తిస్థాయిలో బెయిలు ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నాం. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున.. రాజకీయ ప్రతీకారంతో తనపై కేసు నమోదు చేశారన్న పిటిషనర్‌ వాదనతో న్యాయస్థానం అంగీకరించడం లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని