అమరావతి, చంద్రబాబు వ్యతిరేక కేసుల్లో న్యాయవాదుల బిల్లుల చెల్లింపు

రాష్ట్రంలో ఇప్పటికీ కొందరు అధికారులు ఆర్థిక సూత్రాలను, ఫిఫో నిబంధనలను విస్మరిస్తూ బిల్లులను చెల్లిస్తున్నారు.

Published : 12 Jun 2024 05:27 IST

ఒక్క రోజులోనే రూ.2.28 కోట్ల విడుదల

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికీ కొందరు అధికారులు ఆర్థిక సూత్రాలను, ఫిఫో నిబంధనలను విస్మరిస్తూ బిల్లులను చెల్లిస్తున్నారు. పాత ప్రభుత్వ వాసనలు పోని అధికారులు ఇంకా కీలక స్థానాల్లో ఉండటంతో బిల్లుల చెల్లింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా ఉన్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పని చేసిన కొందరు న్యాయవాదులు, అమరావతి రాజధానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదించిన న్యాయవాదులకు చెల్లించాల్సిన బిల్లులను హడావుడిగా కొందరు అధికారులు చెల్లించేశారు. దాదాపు రూ.2.28 కోట్లను జూన్‌ 10న ఇచ్చేశారు. ఇలాంటివి 14 బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఒక్కో బిల్లు కనీసం రూ.65 వేల నుంచి గరిష్ఠంగా రూ.కోటి వరకు కూడా ఉన్నాయని సమాచారం. ఆ న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులను.. అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌కు ఏప్రిల్‌ నెల ఫీజును విడుదల చేశారు. ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌ కుమార్, సీనియర్‌ అడ్వొకేట్‌ ఎస్‌.నిరంజన్‌రెడ్డి, అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌కు ఒక బిల్లులో రూ.1.06 కోట్లు చెల్లించారు.

రూ.2 వేల కోట్ల అప్పు తీసుకోలేదు

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవాలని తొలుత భావించి రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపింది. ఆ తర్వాత రుణం వద్దనుకోవడంతో మంగళవారం ఆ అప్పు తీసుకోలేదు. మరోవైపు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులపై ఆర్థికశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బుధవారం కొలువుదీరిన తర్వాత ఆర్థిక అంశాలపై దృష్టి సారించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని