భూసర్వేపై పునఃసమీక్ష అవసరం

కొత్తగా కొలువుదీరనున్న ఎన్డీయే ప్రభుత్వం భూముల రీసర్వేను పున:సమీక్షించాలని రైతులు కోరుతున్నారు.

Updated : 12 Jun 2024 06:46 IST

పట్టాదారు పాసుపుస్తకాల్లో భారీగా తప్పులు
వైకాపా ప్రభుత్వ చర్యలతో విస్తీర్ణం తగ్గిందని రైతుల గగ్గోలు

ఈనాడు, అమరావతి: కొత్తగా కొలువుదీరనున్న ఎన్డీయే ప్రభుత్వం భూముల రీసర్వేను పున:సమీక్షించాలని రైతులు కోరుతున్నారు. రీసర్వే కారణంగా భూకొలతలు, పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించాలని అభ్యర్థిస్తున్నారు. వైకాపా పాలనలో అడ్డగోలుగా నిర్వహించిన భూముల రీసర్వేతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమ భూవిస్తీర్ణం తగ్గిందని, కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లాయని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. జగన్‌ మెప్పు కోసం ఉన్నతాధికారులు రీసర్వేను హడావుడి చర్యలతో భ్రష్టు పట్టించారు. వారసత్వ భూముల విస్తీర్ణమూ తగ్గిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ప్రతి గ్రామంలో సుమారు 25% మంది రైతులు భూసర్వేలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. 

ప్రశాంతమైన పల్లెల్లో రీసర్వే చిచ్చు రేపింది. నిబంధనల ప్రకారం.. రీసర్వే వల్ల ఎకరాలో 5శాతం వరకు భూమి తగ్గవచ్చు. చాలామంది రెట్టింపు భూమి, దాన్ని మించి కోల్పోయారు. రికార్డులు చూపుతున్నట్లు భూమి క్షేత్రస్థాయిలో లేదని రీసర్వే సిబ్బంది పేర్కొనడంపై భగ్గుమంటున్నారు. సమస్యను అధికారుల ఎదుట ప్రస్తావిస్తే.. పొలం పక్కనున్న రైతులతో మాట్లాడుకోవాలని చెబుతున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఇస్తున్న కొత్త పట్టాదారు పాసుపుస్తకాల్లో భారీగా తప్పులు దొర్లాయి. దీనివల్ల బ్యాంకు రుణాలు అందడం లేదు. కొన్నిచోట్ల ఇద్దరు ముగ్గురికి కలిపి జాయింట్‌ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాపింగ్‌ (ఎల్పీఎం) నంబరు ఇవ్వడం గొడవలకు కారణమవుతోంది.

రైతులకు తెలపకుండానే..

రీసర్వే ప్రారంభించే ముందు ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి. సర్వే పూర్తయ్యాక రైతులకు తప్పనిసరిగా నోటీసులివ్వాలి. రైతు సంతృప్తి చెంది సంతకం పెడితేనే విస్తీర్ణాన్ని ఖరారు చేయాలి. ఇవేవీ ఆచరణలో అమలు కాలేదు. రీసర్వే గురించి చెప్పకుండానే నోటీసులిచ్చినట్లు కొన్నిచోట్ల రికార్డుల్లో నమోదు చేశారు. భూయజమానులకు తెలియకుండానే స్థలాన్ని కొలిచి హద్దులను ఖరారు చేశారు. ఒకరి భూహక్కు పత్రంలో పక్కనున్న మరొకరి పేర్లనూ చేర్చారు. సిబ్బంది వెళ్లినప్పుడు సంబంధిత భూమి హక్కుదారులు లేరంటూ జాయింట్‌ ఎల్పీ నంబరు ఇచ్చారు. విస్తీర్ణం విషయంలో రైతుల మధ్య వివాదాలను రెవెన్యూ సిబ్బంది విస్మరించారు. ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ పట్టాదారు పాస్‌బుక్‌ యాక్ట్‌-1971, 1989 సెక్షన్‌ 3(3) ప్రకారమే కాకుండా రూల్‌ 17 ప్రకారం అప్పీల్‌ లేదా అభ్యంతరాలు తెలిపే అవకాశాన్ని పూర్తిస్థాయిలో కల్పించలేదు.

రికార్డుల బాగుసేతలో గందరగోళం

రీసర్వే నిర్వహణకు ముందు భూరికార్డుల స్వచ్ఛీకరణ కింద రాష్ట్రంలోని 17,600కు పైగా రెవెన్యూ గ్రామాల్లోని రికార్డులను పరిశీలించారు. ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్, వెబ్‌ల్యాండ్‌లోని వివరాల మధ్య వ్యత్యాసాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు, కాలువలు, వాగులు తదితర అంశాలను పరిశీలించకుండానే రికార్డుల బాగుసేత ప్రక్రియను పూర్తిచేశారు. నెలరోజులపాటు జరగాల్సిన ఈ ప్రక్రియను సర్కారు మెహర్బానీ కోసం రోజుల్లోనే ముగించారు. భూముల స్వభావ వివరాల్లోనూ తప్పులున్నాయి. చనిపోయిన వారి పేర్లు, విక్రయించిన వారి పేర్లు అలాగే రీసర్వే రికార్డుల్లో కొనసాగుతున్నాయి. 

జగన్‌ బొమ్మలపై మండిపాటు

ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు సొంత భూములన్నట్లు వైకాపా సర్కారు పెద్దలు వ్యవహరించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు అందజేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో జగన్‌ బొమ్మలే కనిపించాయి. పట్టాలను నీలం రంగులో ముద్రించారు. ప్రైవేటు భూములకు జగన్‌ ఫొటోతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు అందించడాన్ని కొన్నిచోట్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు