ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకు ఆహ్వానం

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్డీయే శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన తెదేపా అధినేత చంద్రబాబును గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆహ్వానించారు. 

Updated : 12 Jun 2024 06:33 IST

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న శాసనసభాపక్ష నేత చంద్రబాబునాయుడు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్డీయే శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన తెదేపా అధినేత చంద్రబాబును గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆహ్వానించారు. చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుకు గవర్నర్‌ సాదర స్వాగతం పలికి, అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ రూపొందించిన పత్రాన్ని ఆయనకు అందజేశారు. బుధవారం జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు, తదితర అంశాలపై వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు సుమారు అరగంటసేపు అక్కడ ఉన్నారు. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గవర్నర్‌ను కలిసి... చంద్రబాబును తెదేపా శాసనసభాపక్ష నేతగా, ఎన్డీయే శాససభాపక్ష నాయకుడిగా ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు రెండు వేర్వేరు పత్రాలను అందజేశారు. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదిస్తూ తెదేపా శాసనసభాపక్షం చేసిన తీర్మానానికి మద్దతిస్తూ జనసేన, భాజపా శాసనసభాపక్షాల తరఫున లేఖలు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్‌ ఆహ్వానించారని, బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని