సంక్షిప్త వార్తలు(8)

సీఎం ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది.

Updated : 13 Jun 2024 06:21 IST

సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర

ఈనాడు, అమరావతి: సీఎం ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీలో తొలి అధికారిగా రవిచంద్ర నియామకమయ్యారు. 


నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండడంతో బడులు తెరవడాన్ని ఒక రోజు వాయిదా వేశారు. పాఠశాలలు తెరిచిన నాటి నుంచే పాఠ్యపుస్తకాలు, విద్యార్థి కిట్లను పంపిణీ చేయనున్నారు. పాఠ్యపుస్తకాలు దాదాపుగా పూర్తిస్థాయిలో మండల కేంద్రాలకు చేరగా.. విద్యార్థి కిట్ల సామగ్రి కొంత వరకే వచ్చింది. బ్యాగులు, బెల్టులు, బూట్లు, ఏకరూపదుస్తులను గుత్తేదార్లు సరఫరా చేసినవి చేసినట్లుగా విద్యార్థులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వైకాపా ప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు నిర్ణయాల కారణంగా విద్యార్థుల కిట్ల పంపిణీలో కొంత ఆలస్యం కానుంది. కమీషన్ల కోసం కొందరు అధికారులు, మాజీ మంత్రి తీసుకున్న చర్యలు ఇప్పుడు కిట్ల పంపిణీలో జాప్యానికి కారణమయ్యాయి. గుత్తేదార్లు సామగ్రి సరఫరాను నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం వీటిపై దృష్టిసారించాల్సి ఉంది. 


చోరీ కేసులో బెయిలు మంజూరు చేయండి
హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి
నేడు విచారణ

ఈనాడు, అమరావతి: కీలక దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ      ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్‌ గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. ఈ నెల 6న ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలను చోరిచేసి కారులో తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం మొగులూరుకు చెందిన గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ ఠాణాలో వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


నూతన ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆకాంక్ష
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు

ఈనాడు, అమరావతి: న్యాయవాదుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం పేర్కొన్నారు. వివాదాస్పద భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, మంత్రి పదవి చేపట్టిన పవన్‌ కల్యాణ్, మంత్రివర్గ సభ్యులకు బుధవారం ఓప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.


హిందుజా థర్మల్‌ యూనిట్‌లో సాంకేతిక లోపం
నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలోని హిందుజా పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన రెండు థర్మల్‌ యూనిట్లలో మంగళవారం నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు కొరత కారణంగా గత కొన్ని నెలలుగా ఒక యూనిట్‌ నుంచి మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాని ద్వారా వచ్చే విద్యుత్‌ కూడా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం రెండు యూనిట్ల ద్వారా 1,040 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు అందాల్సి ఉంది. ఆ మేరకు పవన,  సౌర యూనిట్ల నుంచి గ్రిడ్‌కు విద్యుత్‌ అందడంతో బుధవారం డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేయడంలో డిస్కంలకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందాల మేరకు 49.71 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు తీసుకోవాల్సి ఉంది. అందులో రాష్ట్ర అవసరాలు పోను 21.15 ఎంయూల విద్యుత్‌ మిగిలింది. ఆ మిగులు విద్యుత్‌ను డిస్కంలు మార్కెట్‌లో విక్రయించాయి.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అల్లెన్‌ విద్యార్థికి 1వ ర్యాంక్‌

రాజస్థాన్‌ కోటాలోని అల్లెన్‌ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయి మొదటి ర్యాంకుతో పాటు పలు ర్యాంకులు సాధించారు. తమ విద్యార్థి వేద్‌ లహోటి గతంలో ఎన్నడూ లేనివిధంగా 360కి 355 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ సాధించాడని అల్లెన్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ మహేశ్వరి తెలిపారు. తమ విద్యార్థులు రిథమ్‌ కేడియా 4, రాజ్‌దీప్‌ మిశ్ర 6, ద్విజ పటేల్‌ 7 ర్యాంకులు సాధించినట్లు వివరించారు. జనరల్‌లో 7వ ర్యాంకు సాధించిన ద్విజ పటేల్‌ బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. మొత్తంగా మొదటి పది ర్యాంకుల్లో 4, మొదటి వందలో 45 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు వెల్లడించారు.


ఫిట్‌జీ విద్యార్థికి 2వ ర్యాంక్‌

దిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని ఫిట్‌జీ తెలిపింది. తమ విద్యార్థి ఆదిత్య జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించాడని వెల్లడించింది. 360కి 346 మార్కులు సాధించిన ఆదిత్య దిల్లీలో టాపర్‌గా నిలిచాడని పేర్కొంది. ఫిట్‌జీలో నాలుగేళ్ల క్లాస్‌ రూమ్‌ ప్రోగ్రామ్‌ విద్యార్థి అయిన ఆదిత్య జేఈఈ మెయిన్‌లోనూ 99.99 స్కోర్‌తో జాతీయ స్థాయిలో 185వ ర్యాంకు సాధించాడని తెలిపింది. ఆదిత్యతో పాటు తమ విద్యార్థులు మరో ముగ్గురు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొదటి 10లోపు ర్యాంకులు సాధించారని వివరించింది.


ఆకాష్‌కు వెయ్యిలోపు 9 ర్యాంకులు

హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్‌కు చెందిన తమ విద్యార్థులు 9 మంది అత్యుత్తమ విజయాలు సాధించారని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) తెలిపింది. రిషిశేఖర్‌ శుక్లా 25, ఉజ్వల్‌ సింగ్‌ 95, సాయిదివ్యతేజారెడ్డి 174, సూర్యప్రకాష్‌ పింగళి 245, విశ్వనాథ్‌ కేఎస్‌ 247, రిత్విక్‌ పెరుమాళ్ల 434, మన్నెం నాగ సంజయ్‌ 741, కోతా ప్రతీక్‌రెడ్డి 819, ఆర్యన్‌ భోజ్వానీ 951 ర్యాంకులు సాధించారని వెల్లడించింది.


సీఎం, మంత్రుల నియామకంపై నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రుల నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యుడిగా చంద్రబాబునాయుడు నియామకంతోపాటు 24 మంత్రుల నియామకం సైతం బుధవారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. 


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి

చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ శర్మ లేఖ

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ‘స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల 27 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ప్లాంటు విక్రయిస్తే.. రూ.వేల కోట్ల విలువైన 18 వేల ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అన్యాక్రాంతమవుతుంది. కేంద్రం పన్నుల రూపంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న నిధులను ఆర్థిక సంఘానికి మళ్లించి, వాటిపై పూర్తి అధికారం చెలాయిస్తోంది. సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే అలాంటి విధానాలను మార్చుకోవాలని అన్ని రాష్ట్రాల తరఫున భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని పేర్కొన్నారు. కొత్తగా అధికారం చేపట్టిన తెదేపా ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. 


ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి

ఈనాడు, అమరావతి: ఏపీఈఏపీసెట్‌- 2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. అగ్రి/ఫార్మ విభాగంలో ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి మొదటి ర్యాంకు, పూల దివ్యతేజ 2, వడ్లపూడి ముకేశ్‌ చౌదరి 3, పేర సాత్విక్‌ 4, ఆలూర్‌ ప్రణీత 5, గట్టు భానుతేజ సాయి 6, పి.నిహారికా రెడ్డి 7, శంబంగి మనోఅభిరాం 8, శరగడం పావని 9వ ర్యాంకులు సాధించారని వెల్లడించింది. ఇంజినీరింగ్‌లో పలగిరి సతీష్‌ రెడ్డి 4వ ర్యాంకు, గొల్ల లేఖహర్ష 7, పుట్టి కుశాల్‌ కుమార్‌ 8వ ర్యాంకులు పొందారని చెప్పింది. అలాగే అగ్రి/ఫార్మలో 10 లోపు 9, 100 లోపు 50, ఇంజినీరింగ్‌లో 10 లోపు 3, 100 లోపు 55 ర్యాంకులు వచ్చాయని పేర్కొంది. ప్రతిభ కనబరచిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అభినందించారు.


భాష్యం విద్యార్థుల సత్తా

ఏపీఈఏపీసెట్‌-2024 ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఎం.జిష్ణుసాయి మొదటి ర్యాంకు, ఎం.సాయియశ్వంత్‌ రెడ్డి 2, కె.మనీష్‌ చౌదరి 5, కె.ప్రభాస్‌ 10, కె.హర్షిత 16, ఎస్‌.ప్రణయ్‌ విక్టర్‌ 25, ఎం.శ్రీచరిత సాయి 29, టి.మునికార్తీక్‌ 35, పి.శ్యామ్‌ 49, కె.చైతన్య 54, ఎం.సాయిజస్వంత్‌ రెడ్డి 61, ఆర్‌.రాజ్‌ శ్రీవర్ధన్‌ 83వ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. అలాగే 100 లోపు 12 ర్యాంకులు వచ్చాయని చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్‌ హనుమంతరావులు అభినందించారు. 


శశి విశాఖపట్నం విద్యార్థుల ప్రతిభ 

ఏపీఈఏపీసెట్‌-2024 ఫలితాల్లో శశి విశాఖపట్నం క్యాంపస్‌ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో కె.ఎం.డి.ఎస్‌.ఫణి కుమార్‌ 59వ ర్యాంకు, కె.టి.షణ్ముఖ శ్రీ సాయి 108, పి.హర్షిత 154, పి.చైతన్య కుమార్‌ 182వ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. అలాగే 1,000 లోపు 17, 2 వేల లోపు 27, 3 వేల లోపు 39, 5 వేల లోపు 53 ర్యాంకులు వచ్చాయని చెప్పారు. ఇంజినీరింగ్‌ విభాగంలో ఎస్‌.దిలీప్‌ వెంకట సతీష్‌ 165, సిహెచ్‌ వరుణ్‌ నాగసాయి నారాయణ 331వ ర్యాంకులు పొందారని అన్నారు. అలాగే 1,000 లోపు 15, 2 వేల లోపు 43, 3 వేల లోపు 73, 5 వేల లోపు 110, 10 వేల లోపు 173, 15 వేల లోపు 220, 20 వేల లోపు 260 ర్యాంకులు వచ్చాయని వెల్లడించారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను శశి విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ మేకా నరేంద్ర కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్రాంతి సుధ అభినందించారు. 


శశి వేలివెన్ను విజయభేరి

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో శశి వేలివెన్ను విద్యార్థులు విజయభేరి మోగించారని శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. ఎం.ప్రణవ్‌ సాయి 12వ ర్యాంకు, బి.గౌతమి 24, కె.అనిరుధ్‌ 30, పి.శ్రీలలిత దేవి 36వ ర్యాంకు, ఎల్‌.సత్యవర్ధన్‌ 37వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 8 మంది 100లోపు ర్యాంకులు, 33 మంది 500లోపు ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని శశి విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ శ్రీమతి బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.


తిరుమల విద్యాసంస్థల విజయకేతనం

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో తిరుమల ఐఐటి, మెడికల్‌ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు వెల్లడించారు. అగ్రికల్చర్‌ విభాగంలో ఎన్‌.రాధాకృష్ణ 10వ ర్యాంకు, పి.యస్‌.సంపత్‌ నాయుడు 28, డి.ప్రభాస్‌ 41, ఎస్‌.సాకేత్‌ రాఘవ్‌ 43వ ర్యాంకు సాధించారని తెలిపారు. 100లోపు 9 మంది, 1000లోపు 78 మంది అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో బి.సాయి నరేన్‌ 51వ ర్యాంకు, జి.సత్యనారాయణ 56వ ర్యాంకుతో రాణించారని తెలిపారు. ఐదుగురు 100లోపు, 166 మంది 1000లోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారన్నారు. విద్యార్థులను, అధ్యాపకులను తిరుమలరావు అభినందించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు