1631 రోజుల సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి

రాజధాని అమరావతి పరిరక్షణే శ్వాసగా.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజధాని గ్రామాల్లో సాగిన ఉద్యమానికి అన్నదాతలు ముగింపు పలికారు.

Updated : 13 Jun 2024 06:58 IST

అమరావతి ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు రాజధాని రైతుల ప్రకటన
అమరావతే రాజధాని అని చంద్రబాబు ప్రకటించడంతో నిర్ణయం

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి పరిరక్షణే శ్వాసగా.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజధాని గ్రామాల్లో సాగిన ఉద్యమానికి అన్నదాతలు ముగింపు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి రూపకర్త చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడం, అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసంతో నిరసనలను విరమిస్తున్నట్లు అమరావతి ఐకాస బుధవారం ప్రకటించింది. దీంతో రాజధాని గ్రామాల్లో నిరసన దీక్షల కోసం వేసిన శిబిరాలను తొలగించనున్నారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఉద్యమాన్ని నిలిపివేయాలని అమరావతి ఐకాస నిర్ణయం తీసుకుంది. 

కనీవినీ ఎరుగని రీతిలో..

ప్రపంచంలో కనీవినీ ఎరుగని రీతిలో రాజధాని రైతుల ఉద్యమం 1,631 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడంతో రాజధాని రైతులు ఈ పోరాటానికి శ్రీకారం చుట్టారు. వైకాపా అధినేత తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొదట వెలగపూడి గ్రామంలో రైతు దీక్షా శిబిరం వెలిసింది. అప్పటి నుంచి అలుపెరుగని పోరాటం చేశారు. అమరావతిపై వైకాపా నిరంకుశ ప్రభుత్వం దమనకాండ సాగించింది. అక్రమ కేసులు, నిర్బంధాలు, లాఠీఛార్జులతో అమరావతి అట్టుడికింది. 144 సెక్షన్‌ విధించి వందల మంది పోలీసులతో రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం నిత్యం భయాందోళనలు సృష్టించింది. వైకాపా నాయకులు అన్నదాతలను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో 270 మందికి పైగా రైతులు, రైతు కూలీలు గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఉద్యమకారులు ఎక్కడా వెనకడుగు వేయలేదు. మరింత కదనోత్సాహంతో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ 

పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతికి, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్రలు నిర్వహించారు. అసెంబ్లీ ముట్టడి, జాతీయ రహదారుల నిర్బంధం, విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుల చెల్లింపు తదితర నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని