నాడు ఎమ్మెల్సీలు.. నేడు ఎమ్మెల్యేలుగా.. నలుగురికి మంత్రివర్గంలో చోటు

గతంలో ఎమ్మెల్సీలుగా ఉండి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలుగురికి చంద్రబాబు ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కింది.

Published : 13 Jun 2024 05:59 IST

ఈనాడు-అమరావతి: గతంలో ఎమ్మెల్సీలుగా ఉండి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలుగురికి చంద్రబాబు ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కింది. సీనియర్‌ నేత ఎన్‌ఎండీ ఫరూక్, నారా లోకేశ్‌. పొంగూరు నారాయణ, గుమ్మిడి సంధ్యారాణిలు మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2014-19 మధ్యకాలంలో అప్పటి చంద్రబాబు మంత్రివర్గంలో లోకేశ్, నారాయణ, ఫరూక్‌ (ముగ్గురూ ఎమ్మెల్సీలు) మంత్రులుగా పనిచేశారు. 2015-21లో ఎమ్మెల్సీగా వ్యవహరించిన సంధ్యారాణికి ఇప్పుడు మొదటిసారి మంత్రి పదవి దక్కింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నంద్యాల, మంగళగిరి, నెల్లూరు పట్టణం, సాలూరు నియోజకవర్గాల నుంచి వీరు శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిలో సీనియర్‌ నేత ఫరూక్‌ మాత్రమే రెండు (అసెంబ్లీ, మండలి) సభల్లో సభ్యుడిగా వ్యవహరించిన అనుభవం ఉంది. కూటమి తరఫున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌ గెలుపొందినా మంత్రివర్గంలో  చోటు దక్కలేదు.

మండలి నుంచి ఒక్కరికీ దక్కని అవకాశం 

కొత్త మంత్రివర్గంలో మండలి నుంచి ఒక్కరికీ స్థానం కల్పించలేదు. ఈ ఎన్నికల్లో 164 స్థానాల నుంచి కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వారి మధ్య మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కూటమిలో భాగస్వామ్య పార్టీలు జనసేన, భాజపాలకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత 20 మందికే తెదేపా నుంచి అవకాశం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని