స్వల్ప తొక్కిసలాట

కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షల నడుమ కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు.

Published : 13 Jun 2024 06:04 IST

ప్రవేశద్వారం చెంత బారికేడ్లను నెట్టుకుంటూ వస్తున్న జనం

ఈనాడు, గన్నవరం: కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షల నడుమ కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు. సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోవడంతో ప్రవేశద్వారం వద్ద పోలీసులు జనాన్ని కట్టడి చేశారు. కొందరికి వీవీఐపీ పాసులున్నా లోనికి వెళ్లే వీలు లేకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతలోనే ఒక్కసారిగా జనం బారికేడ్లను తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. బారికేడ్ల కింద జనం పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వెనువెంటనే వారందరినీ పైకిలేపి సపర్యలు చేశారు. స్వల్పగాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


టోల్‌ప్లాజా వద్ద తప్పని ఇక్కట్లు

టోల్‌ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు

తాడేపల్లి, మంగళగిరి, మంగళగిరి అర్బన్, ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని జిల్లాల నుంచి తరలి వచ్చిన కూటమి కార్యకర్తలు, నాయకులు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటలకే అక్కడికి చేరుకున్న వాహనాలను పోలీసులు ఆపి, విడతల వారీగా పంపించారు. టోల్‌ సిబ్బంది వాహనాలను ఫాస్ట్రాక్‌ స్కానింగ్‌ చేస్తూ రుసుము వసూలు చేశారు. దీంతో గంటలపాటు ట్రాఫిక్‌లోనే శ్రేణులు ఉండి పోవాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలు దాటినా ఇదే పరిస్థితి నెలకొంది. కొంత మంది నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు. వాహన రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసులు, టోల్‌ప్లాజా సిబ్బంది విఫలమయ్యారని కార్యకర్తలు ఆరోపించారు. గతంలో వైకాపా చేపట్టిన పలు కార్యక్రమాలకు టోల్‌ ప్లాజాలో స్కానింగ్‌ ఎత్తివేశారని, కానీ ఇప్పుడు ఇంత రద్దీ ఉన్నా సిబ్బంది స్పందించకపోవడం తగదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నిదానంగా బయలుదేరిన వాహనాలు తాడేపల్లిలో వారధి వద్ద పోలీసుల ఆంక్షలతో మళ్లీ నిరీక్షించాల్సి వచ్చింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు