శక్తివంచన లేకుండా పనిచేస్తాం

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు.

Updated : 13 Jun 2024 06:25 IST

ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తాం
ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు. ప్రజలు గత ఐదేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి రుణం తీర్చుకునేలా పనిచేస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..


రాష్ట్రాభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తా

‘చంద్రబాబు సాహచర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో నా పాత్ర పోషిస్తా. ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికి అందరి సహకారంతో తోటి మంత్రి నారాయణ, నేను కలిసి పనిచేస్తాం. చంద్రబాబు ఆలోచనలు, ఎన్డీయే మ్యానిఫెస్టో అమలు చేయడం మా ప్రాధాన్యం.

ఆనం రామనారాయణరెడ్డి


ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం

30 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఈరోజు మంత్రిగా ప్రమాణం చేయడం భావోద్వేగానికి సంబంధించిన అంశం. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు ధన్యవాదాలు. ఏ తప్పూ జరగకుండా పాలించాలని మాకు ఓటు వేశారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయం. ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా చూస్తాం. 

పయ్యావుల కేశవ్‌


అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం

చంద్రబాబు సారథ్యంలో రెండోసారి మంత్రిగా ప్రమాణం చేయడం సంతోషంగా ఉంది. గత ఐదేళ్ల అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలు బయటకు వచ్చారు. పేదలు, యువతను దృష్టిలో పెట్టుకుని, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తాం. 

పొంగూరు నారాయణ


విధ్వంస పాలనకు ముగింపు

ఐదేళ్లుగా జరిగిన విధ్వంస పాలనకు ముగింపు పలకడంతో పాటు రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు వైకాపాను ఓడించి, ఎన్డీయేకు ఓటేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చంద్రబాబు విజన్, అనుభవం, పవన్‌కల్యాణ్‌ చిత్తశుద్ధి, మోదీ సహాయ సహకారాలు ఉపయోగపడతాయని భావించారు. మంత్రివర్గ కూర్పులో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చారు. 

కొలుసు పార్థసారథి


రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం 

చంద్రబాబు, పవన్‌ నాకు పెద్ద బాధ్యత అప్పగించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని జగన్‌ మరింత దెబ్బతీశారు. అందుకే జనం విప్లవం లాగా దండెత్తి జగన్‌ను దండించారు. ఏపీని తిరిగి నిలబెట్టే బాధ్యతను ఎన్డీయేకు అప్పగించారు. గత ప్రభుత్వ తప్పులను అసెంబ్లీలో దీటుగా ప్రశ్నించాం. అవమానాలను భరించాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పనిచేస్తాం. 

అనగాని సత్యప్రసాద్‌


ప్రజా ప్రభుత్వం ఏర్పడింది

రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన అంతమై, ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. క్రితంసారి ప్రజలు వైకాపాకు 151 సీట్లు ఇచ్చినా వారికి పాలన చేతకాలేదు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ప్రశ్నించినందుకు వైకాపా నేతలు నన్ను ఎంతో అవమానించారు.

వంగలపూడి అనిత


ఐటీడీఏలను పునరుద్ధరిస్తాం

గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఐటీడీఏలను పునరుద్ధరిస్తాం. చాలా గిరిజనప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్డు మార్గాల్లేని గ్రామాలున్నాయి. ఆసుపత్రులకు డోలీలపై వెళ్తున్నారు. అక్కడ రక్షిత నీరు లేదు. ఈ పరిస్థితుల్ని బాగు చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు మాకు కల్పించారు. 

గుమ్మిడి సంధ్యారాణి


ప్రజల రుణం తీర్చుకుంటా

నాపై ఎంతో విశ్వాసం ఉంచినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు. పార్టీకి మంచి పేరు తెచ్చేలా, రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సూచనలతో ముందుకు సాగుతా.

నిమ్మల రామానాయుడు


బీసీలకు ప్రాధాన్యమిచ్చారు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సమక్షంలో ప్రమాణం చేయడం గర్వంగా ఉంది. తెదేపా అంటేనే బీసీల పార్టీ. ఎన్టీఆర్‌ హయాం నుంచీ బీసీలకు పెద్దపీట వేశారు. సీఎం ఏ బాధ్యత అప్పజెప్పినా నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తా. పదవిని బాధ్యతగా భావిస్తా.

ఎస్‌.సవిత


ప్రభుత్వాన్ని బాధ్యతగా నడుపుతాం

వచ్చే ఐదేళ్లూ ఏపీకి సువర్ణాధ్యాయం. ప్రభుత్వాన్ని బాధ్యతగా నడుపుతాం. రాజధానిని, పోలవరం ప్రాజెక్టును నిర్మించుకోవాలి. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఏపీని పునర్నిర్మించుకోవాలంటే కేంద్ర సహకారం అవసరమని భావించి, ప్రజలు ఎన్డీయేకు 95శాతం మెజారిటీ ఇచ్చారు. 

కొల్లు రవీంద్ర


ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం

రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేసే బాధ్యత మాపై ఉంది. గతంలో ఎప్పుడూలేని విధంగా సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తాం. చంద్రబాబు, పవన్‌ నాయకత్వంలో మనస్ఫూర్తిగా పనిచేస్తాం. మంత్రులమంతా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. గత ఐదేళ్ల రాక్షస పాలన దృష్ట్యా, మేం రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాం.

నాదెండ్ల మనోహర్‌


విధులు సమర్థంగా నిర్వర్తిస్తా

ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేయడం మరచిపోలేని అనుభూతి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఏ శాఖ కేటాయించినా సమర్థంగా, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా.

డీబీవీ స్వామి


సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యమిస్తా

యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. నాకు టికెట్‌ ఇవ్వడమే కాదు, గెలిచాక మంత్రి పదవి కట్టబెట్టి బాధ్యత పెంచారు. గ్రామాల్లో మౌలిక వసతులు, ఇంటింటికీ తాగునీరు నా ప్రాధాన్యాలు. పాలనలో సాంకేతికతను వినియోగిస్తా. విజయనగరం చాలా వెనకబడిన జిల్లా. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వచ్చి, ఉద్యోగ కల్పన దిశగా ప్రయత్నిస్తా.

కొండపల్లి శ్రీనివాస్‌


పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి

భాజపాలో సామాన్య కార్యకర్తనైన నాపై ఈ బాధ్యతను ఉంచిన మోదీ, అమిత్‌ షా, నడ్డా, చంద్రబాబుకు ధన్యవాదాలు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధనలో భాగమవుతా. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు సారథ్యంలో తిరిగి నిలబెట్టుకోవాలి. ఈ ఐదేళ్లలో పోలవరం సహా పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయి, పొలాలకు సాగునీరు అందుతుంది. నదులఅనుసంధానమవుతుంది.

సత్యకుమార్‌ యాదవ్‌


నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

ఐదేళ్లూ మాపై వేధింపులు కొనసాగాయి. పాలన ఎలా చేయకూడదో జగన్‌ చూపించారు. మేం అలా చేయం. నాపై చంద్రబాబు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. అద్దంకి వాసుల రుణం తీర్చుకుంటా.

గొట్టిపాటి రవికుమార్‌


పేదల పక్షాన నిలుస్తా

రాయచోటిలో నేను గెలిచింది అక్కడి వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డిపై కాదు, జగన్‌రెడ్డిపైనే! ముఖ్యమంత్రి నాపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా. పేదల పక్షాన నిలుస్తా. 

మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి


కూటమి లక్ష్యాన్ని సాధిస్తాం

ఏపీని అభివృద్ధి పథంలో నడిపించే యజ్ఞంలో భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎన్డీయే కూటమి ఏర్పడిన లక్ష్యాన్ని సాధించడానికి జనసేన తరఫున సంపూర్ణంగా సహకరిస్తాం. లక్ష్యాన్ని సాధిస్తాం.

కందుల దుర్గేశ్‌ 


ముస్లింలకు నిరంతరం అండగా ఉంటాం

ఎన్నికల్లో ముస్లింలు కూటమికి అండగా నిలిచారు. రాయలసీమ జిల్లాల్లో ముస్లింలు అత్యధికంగా ఉండే స్థానాలన్నింటిలోనూ కూటమి అభ్యర్థులనే గెలిపించారు. ఎన్నికల్లో వారికిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. అన్ని విధాలుగా నిరంతరంఅండగా ఉంటాం. 

ఎన్‌ఎండీ… ఫరూక్‌


శాంతిభద్రతల్ని పటిష్ఠం చేస్తాం

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఈ విజయంతో బాధ్యతతో పాటు భయం కూడా పెరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో అందిస్తాం. శాంతి భద్రతల్ని మరింత పటిష్ఠం చేస్తాం. 

బీసీ జనార్ధనరెడ్డి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని