విజయాల బాటలో సంబరాల బావుటా

వందల కిలోమీటర్ల దూరం నుంచి ముందురోజే ప్రయాణమయ్యారు కొందరు.. ఉదయం 11.27 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి తెల్లవారుజామున 2.30 గంటలకే గ్యాలరీల్లోకి చేరిపోయారు మరికొందరు.. చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి దూరప్రాంతాల నుంచి రాత్రింబవళ్లు ప్రయాణించి.. వేదిక వద్దకు చేరుకునే వీల్లేక 15 కిలోమీటర్లకు పైగా నడిచి వచ్చారు మరికొందరు.

Published : 13 Jun 2024 06:17 IST

ఐదేళ్ల అరాచకాన్ని ఓడించామనే ఆనందంలో తెలుగు తమ్ముళ్లు 
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అసాధారణ స్పందన
ఈనాడు - అమరావతి

వందల కిలోమీటర్ల దూరం నుంచి ముందురోజే ప్రయాణమయ్యారు కొందరు.. ఉదయం 11.27 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి తెల్లవారుజామున 2.30 గంటలకే గ్యాలరీల్లోకి చేరిపోయారు మరికొందరు.. చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి దూరప్రాంతాల నుంచి రాత్రింబవళ్లు ప్రయాణించి.. వేదిక వద్దకు చేరుకునే వీల్లేక 15 కిలోమీటర్లకు పైగా నడిచి వచ్చారు మరికొందరు. ప్రవాహంలా సాగిపోయారు లక్షలమంది జనం.. కూర్చునేందుకు చోటు లేదన్నా, పాస్‌ లేని వాళ్లు రావద్దని ముందే చెప్పినా.. విజయవాడకు పోటెత్తారు.. ఉవ్వెత్తున ఎగసిన ఉత్సాహం వారిని విజయవాడకు నడిపించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కూడా లక్షలమంది కార్యకర్తలు వాహనాల్లో సభా ప్రాంగణానికి వస్తూనే ఉన్నారు. ఇదొక అసాధారణ స్పందన! చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం అడుగడుగునా తెలుగింట పండగ వాతావరణాన్ని తలపించింది. అందరిలోనూ ఐదేళ్ల అరాచకాన్ని ఓడించామనే ఆనందం! నరకాసుర వధతో దీపావళి చేసుకుంటున్నామనే సంతోషం! రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇళ్లలో ఉన్నవాళ్లు టీవీలకు అతుక్కుపోయారు. ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’ అనే మాటలు తమ అధినేత నోటి వెంట వింటూనే ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఒక్క విజయవాడలోనే కాదు, రాష్ట్రమంతా తెదేపా నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేడుకలు చేసుకున్నారు. కొందరు కేక్‌లు కట్‌ చేశారు. మరికొందరు దేవాలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు.

్య సభాప్రాంగణం చిన్నదని.. ఎక్కువమంది పట్టే అవకాశం లేదని పార్టీ వర్గాలు ముందే సూచించాయి. పాస్‌లు ఉన్నవారు మాత్రమే హాజరవ్వాలని నేతలు చెప్పారు. అయినా కార్యకర్తలు ఎలాగైనా వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాయకుల దగ్గర పాస్‌లు సంపాదించి కొందరు.. అవి లేకున్నా ఎలాగోలా అక్కడికి వెళ్లి చంద్రబాబును చూడాలని కొందరు విజయవాడకు బయల్దేరారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని, బస్సులు మాట్లాడుకుని.. ఏదీ లేకపోతే ద్విచక్ర వాహనాల పైనే కొందరు సభా ప్రాంగణానికి కదిలారు. 

అటు మోదీ.. ఇటు అమిత్‌షా

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా లక్షలాది కార్యకర్తలు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. వారందరినీ ఎలా నియంత్రించాలో అర్థంకాక.. ఆందోళన మొదలైంది. తొక్కిసలాట జరిగితే ఎలాగనే కలవరమూ వెంటాడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరవుతుండటంతో.. చిన్న సమస్య తలెత్తినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. విజయవాడలో ఉన్న హోంమంత్రి అమిత్‌షాను కూడా రోడ్డు మార్గంలోనే ప్రాంగణానికి తీసుకెళ్లాలి. ఎన్నికల ముందు చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా లోపాల విషయంలో పోలీసు అధికారులపై వేటు పడింది. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు పాస్‌లు ఉన్నాసరే దూరంగా ఎక్కడికక్కడ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు. వీవీఐపీ పాస్‌లు ఉన్న వారిని, అదీ వాహన పాస్‌లు ఉంటేనే వదలాలని సూచించారు. 

చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జనం

ప్రవాహంలా.. ముందుకు సాగుతూ

ఉవ్వెత్తున ముంచెత్తే ప్రవాహానికి.. అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా? దారులు వెదుక్కుంటూ ముందుకు సాగదా? అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే కార్యకర్తల్ని ఎక్కడికక్కడే నిలిపేయాలని పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వాహనాలు పక్కన పెట్టి నడిచారు. కాస్త ఆలస్యమైనా ప్రమాణ స్వీకారాన్ని చూడాలనే ఉత్సాహంతో ఉరకలేశారు. సభావేదిక వద్దకు రాకుండా.. ఉదయం 7.30 గంటల నుంచే విజయవాడ, చుట్టుపక్కలున్న పలు కూడలి ప్రాంతాలతోపాటు పొట్టిపాడు, కాజ తదితర ప్రాంతాల్లోని టోల్‌గేట్ల వద్దనే వాహనదారులను ఆపేశారు. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల అవతల నుంచి ఆంక్షలు అమలు చేశారు. సభావేదిక ఉన్న కేసరపల్లి చుట్టూ రెండు, మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచింది. రామవరప్పాడు, గన్నవరం ప్రాంతాల్లో వాహనం ముందుకు కదల్లేని పరిస్థితి. ఉదయం 9 గంటలకు వచ్చిన వారు కూడా సభావేదిక వద్దకు వెళ్లలేకపోయారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కాన్వాయ్‌ కూడా కొద్దిసేపు నిలిచిపోయింది.


తరలివచ్చిన విదేశీ ప్రతినిధులు

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న విదేశీ అతిథులు, సినీ ప్రముఖులు శివాజీ,
బోయపాటి శ్రీను, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల ప్రతినిధులు తరలివచ్చారు. సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్, ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ సిలాయి జకి, కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా చాంగ్‌ న్యున్‌ కిమ్, జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ తకహాషి మునియో, బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్‌ వైన్న్‌ ఒవెన్, కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ తియేర్రీ బెర్తేలట్, బంగ్లాదేశ్‌ డీహెచ్‌సీగా వ్యవహరిస్తున్న మొహ్మద్‌ అరిఫుర్‌ రహమన్, కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ నెదర్లాండ్స్‌ ఇవౌట్‌ డి విట్, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నీఫెర్‌ ఆడ్రియానా లార్సన్, గవర్నర్‌ ఆఫ్‌ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ఆఫ్‌ శ్రీలంక సెంథిల్‌ తొండమన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


డీజీపీనే కార్యక్షేత్రంలోకి...

ట్రాఫిక్‌ను స్వయంగా నియంత్రిస్తున్న డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని