సైకిళ్లపైనా పగబట్టారు

ఐదేళ్లుగా సాగిన అసమర్థ వైకాపా పాలనకు నిదర్శనం ఈ సైకిళ్లు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు నడక భారం తగ్గించి వారు బడులకు ఇబ్బంది లేకుండా చేరుకునేలా సైకిళ్లను అందించాలని 2019లో తెదేపా ప్రభుత్వం సంకల్పించింది.

Published : 14 Jun 2024 03:54 IST

పంపిణీలో వైకాపా సర్కారు తీవ్ర నిర్లక్ష్యం
కొత్త ప్రభుత్వం అందిస్తుందని ఆశలు 

తరగతి గదిలో ఉన్న సైకిళ్లు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ఐదేళ్లుగా సాగిన అసమర్థ వైకాపా పాలనకు నిదర్శనం ఈ సైకిళ్లు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు నడక భారం తగ్గించి వారు బడులకు ఇబ్బంది లేకుండా చేరుకునేలా సైకిళ్లను అందించాలని 2019లో తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థినుల కోసం సైకిళ్ల పంపిణీ చేపట్టింది. అయితే తెదేపా ప్రభుత్వ చివరి రోజుల్లో సైకిళ్లు మండలాలకు రావడంతో వాటిని పంపిణీ చేయలేకపోయారు.  కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటి పంపిణీ విషయం అసలు పట్టించుకోలేదు. వాటిని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. దీంతో ఏకంగా 155 సైకిళ్లు ఐదున్నరేళ్లుగా తుప్పు పట్టాయి. బుట్టలు, ఇతర పరికరాలు సైతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు కొలువు దీరిన కూటమి ప్రభుత్వం ఈ సైకిళ్లను పిల్లలకు అందిస్తే వారికి ఎంతో  ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ‘సైకిళ్లు వృథాగా ఉన్న విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశాం.  వారి నుంచి  ఆదేశాలు వస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని చెన్నేకొత్తపల్లి మండల రెండో విద్యాధికారి ప్రసన్నకుమార్‌ నాయుడు వివరణ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు