రాష్ట్రానికి బీపీసీఎల్‌ రిఫైనరీ ప్రాజెక్టు?

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated : 14 Jun 2024 11:15 IST

రూ.50 వేల కోట్ల భారీ పెట్టుబడి
సంస్థ యాజమాన్యంతో ప్రోత్సాహకాలపై సంప్రదింపులు

ఈనాడు, అమరావతి: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.50వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. దీనిద్వారా భారీ పెట్టుబడి.. వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. రిఫైనరీ ఏర్పాటుకు రెండుచోట్ల స్థలాలను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపారు. వాటిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదించారు. ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌ కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్‌లో రిఫైనరీలను సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్‌ పరిశీలిస్తోంది. రాష్ట్రానికి ఉన్న తీరప్రాంతం రిఫైనరీ ఏర్పాటుకు అనువైనదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు.    

 ప్రోత్సాహకాల ప్రస్తావన

రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టినందుకు రాష్ట్రప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లో రిఫైనరీ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం రూ.500 కోట్ల రుణం ఇవ్వడంతో పాటు.. 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందని సంస్థ యాజమాన్యం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే తరహాలో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం అంగీకరిస్తే పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఎల్‌ సంసిద్ధత తెలిపిందని ఒక అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, అందుకు అనుగుణంగా నిర్ణయంతీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈలోగా మరోసారి సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

 కేంద్రానికి లేఖ రాయనున్న అధికారులు

రాష్ట్రానికి పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్, రిఫైనరీ ప్రాజెక్టును కేటాయిస్తామని విభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టంలోనూ ప్రస్తావించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. బీపీసీఎల్‌ ప్రాజెక్టును కేటాయించేలా సహకరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఒక అధికారి తెలిపారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని