ఆస్తుల క్రయ, విక్రయాలకు ‘సబ్‌ డివిజన్‌’ కష్టాలు

రీ-సర్వే పేరుతో వైకాపా ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల కొన్నిచోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంలేదు.

Published : 14 Jun 2024 04:45 IST

 రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఎల్పీఎం సమస్య

ఈనాడు, అమరావతి: రీ-సర్వే పేరుతో వైకాపా ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల కొన్నిచోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఒకే యజమాని పేరుతో వివిధ సర్వే నంబర్ల కింద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒకే ఎల్పీఎం (ల్యాండ్‌ మ్యాప్‌) ఇస్తున్నారు. ఉదాహరణకు..గ్రామంలో పది ఎకరాలు వేర్వేరుచోట్ల ఉన్నా..యజమానికి ఒకే ఎల్పీఎం ఇస్తున్నారు. ఈ యజమాని ఒకేసారి పది ఎకరాల భూమిని విక్రయించాలనుకుంటే.. మాత్రం సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అలాకాకుండా.. ఒకచోట రెండు ఎకరాలు, మరోచోట మూడు ఎకరాల భూమిని మాత్రమే విక్రయించుకోవాలనుకుంటే.. ముందుగా తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా విక్రయ భూమి వరకు ‘సబ్‌ డివిజన్‌’ జరగాలన్న నిబంధన రైతులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. తన భూమిలో ఎన్నిసార్లు విక్రయాలు జరపాలనుకుంటే.. అన్నిసార్లు తహసీల్దార్‌ కార్యాలయంచుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 3,250 గ్రామాల్లోని రైతుల భూములకు కొత్త ఎల్పీఎం కేటాయించారు. కేటాయించిన ఎల్పీఎంలకు తగ్గట్లు వెబ్‌ ల్యాండ్‌లో మార్పులు జరగలేదు. రైతుల నుంచి విజ్ఞప్తి అందిన వెంటనే గ్రామ సర్వేయర్‌ దరఖాస్తులో పేర్కొన్న ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఎమ్మార్వోకు నివేదించాలి. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరగాలి. అయితే.. సకాలంలో ఈ ప్రక్రియ జరగనందువల్ల భూములను విక్రయించాలనుకున్న రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్‌ ద్వారా సబ్‌ డివిజన్‌ జరిగితేనే ఆన్‌లైన్‌లో సబ్‌ రిజిస్ట్రార్లకు తదుపరి వివరాలు కనిపిస్తాయి. సర్వే నంబర్ల వారీగా భూములు ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తలేదు. కొన్నిచోట్ల జాయింట్‌ ఎల్పీఎంలను పక్కపక్కనే భూములు కలిగిన వారికి ఇచ్చారు. ఒకరి భూమితో మరొకరికి సంబంధం లేకున్నా.. సబ్‌డివిజన్‌ షరతు వల్ల క్రయ, విక్రయాలు ఆలస్యమవుతున్నాయి. వైకాపా అమల్లోకి తెచ్చిన ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పించాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. ఈ అంశం విజయవాడలో జరిగిన వీఆర్వోల సంఘ సమావేశంలోనూ చర్చకు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు