వీసీఐసీ ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు పెంపు

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ) మొదటిదశ పనులను పూర్తిచేయడానికి మరో ఆరు నెలలు గడువు పెంచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంగీకరించింది.

Published : 14 Jun 2024 06:33 IST

దిల్లీలో జరిగిన సమావేశంలో అంగీకరించిన ఏడీబీ

ఈనాడు, అమరావతి: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ) మొదటిదశ పనులను పూర్తిచేయడానికి మరో ఆరు నెలలు గడువు పెంచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంగీకరించింది. అసంపూర్తి పనులను పూర్తిచేయడానికి మరో ఏడాది గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ఆర్థికశాఖ, ఏడీబీ ప్రతినిధులు దిల్లీలో గురువారం సమావేశమై చర్చించారు. ఈ ఏడాది డిసెంబరు వరకు గడువు పెంచడానికి ఏడీబీ అంగీకరించింది. 2017-18లో ప్రాజెక్టు మొదటిదశ పనులను రూ.2,278.60 కోట్లతో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఒప్పందం మేరకు 2023 జూన్‌ నాటికి వాటిని పూర్తిచేయాలి. పనులు పూర్తికాకపోవడంతో.. 2024 జూన్‌ వరకు ఏడీబీ గడువు పొడిగించింది. ఈ నెలతో గడువు ముగియనుండటంతో మరోసారి గడువు పెంపు కోరుతూ ప్రభుత్వం ఏడీబీకి ప్రతిపాదన పంపింది.

ఆరు నెలల్లో సాధ్యమేనా?

మొదటిదశలో 9 ప్యాకేజీల్లో చేపట్టినవాటిలో.. నాయుడుపేట క్లస్టర్‌లో సీఈటీపీ, కాపులుప్పాడ, నక్కపల్లి సబ్‌స్టేషన్ల నిర్మాణపనులే పూర్తయ్యాయి. మిగిలిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టినా ఆరునెలల్లో పూర్తిచేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. నాయుడుపేట, చిత్తూరు సౌత్‌ క్లస్టర్‌ (ఏర్పేడు)లో పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అడ్డంకులు తొలగించి.. మిగిలిన పనులు మొదలుపెట్టాలంటే కనీసం ఏడాది పడుతుంది. గత ప్రభుత్వం రెండేళ్లుగా ప్రాజెక్టు పనులను నిలిపేసింది. 2019కి ముందు 70% పూర్తయిన ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి కదలిక లేదు. గుత్తేదారులకు సుమారు రూ.142 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.20 కోట్లు విడుదల చేస్తే మిగిలిన మొత్తాన్ని ఏడీబీ విడుదల చేసేది. బిల్లులు చెల్లించకపోగా.. పనులు పెండింగ్‌లో šపెట్టిన గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

2019కి ముందు జరిగిన పనులు పోను.. ఇంకా రూ.685 కోట్లు ఖర్చుచేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. ఏడీబీతో కుదిరిన ఒప్పందం మేరకు 21.5% రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.147.27 కోట్లు భరించాలి. పనుల గడువు ముగియనుండటంతో నాయుడుపేట, చిత్తూరు సౌత్‌ క్లస్టర్‌లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను పూర్తి చేయడానికి గత ఏడాది ఆఖరులో అవసరమైన నిధులను ఏపీఐఐసీ నుంచి సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారం కొంత మొత్తాన్ని ఏపీఐఐసీ ఖర్చుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని